Cyclone Montha: మొంథా తుపాన్.. జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు: హోం మంత్రి
ABN , Publish Date - Oct 26 , 2025 | 09:13 PM
కాకినాడ సమీపంలో మొంథా తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులతో హోం మంత్రి అనిత టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, అక్టోబర్ 26: మొంథా తుపాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించాలని వివిధ జిల్లాల ఉన్నతాధికారులకు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆదివారం అమరావతిలో అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లా కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఎస్పీలతో హోం మంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా వారికి ఆమె కీలక సూచనలు చేశారు.
100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలుల ప్రభావంతో చెట్లు, పోల్స్ పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చునన్నారు. ఆ క్రమంలో పునరుద్దరణకు ముందుగానే ట్రాన్స్‌ఫార్మర్స్, పోల్స్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే జేసీబీలు, జనరేటర్స్ సైతం రెడీగా ఉంచాలన్నారు. అయితే వివిధ ప్రాంతాల్లోని భారీ హోర్డింగ్స్‌ను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు.
డెలివరీ తేదీ దగ్గరలో ఉన్న గర్భిణీల కుటుంబాలతో సైతం మాట్లాడుతూ ఉండాలని సూచించారు. వారికి మెడికల్ ఎమర్జెన్సీ కోసం అంబులెన్సులను సైతం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక కాకినాడ జిల్లాలోని 6 మండలాలపై ఈ తుపాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాలో అత్యధిక రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. రోడ్డు బ్లాక్ అయితే డైవర్షన్స్‌కు ముందే మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
జిల్లా, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లోని వారికి పరిశుభ్రమైన ఆహారం అందించాలన్నారు. నిత్యవసర వస్తువులు, మెడిసిన్, శానిటేషన్ మెటీరియల్ తదితర వస్తువులు రిలీఫ్ కేంద్రాల్లో ఉండే వారికి అందుబాటులో ఉంచాలని చెప్పారు. అవసరం అయితే వారిని తరలింపునకు ట్రాక్టర్, జేసీబీ, బస్సు, ఇతర వాహనాలను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంత గ్రామాల వారిని ముందుగానే ఒప్పించి రిలీఫ్ కేంద్రాలకు తరలించాలని అధికారులకు హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శవాల మీద రాజకీయం చేస్తున్న వైసీపీ: ఎంపీ శబరి
మొంథా తుపాను నేపథ్యంలో స్కూల్స్ బంద్
For More AP News And Telugu News