CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:23 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలువురు కీలక నేతలతోపాటు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారని తెలుస్తోంది.
అమరావతి, డిసెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. డిసెంబర్ 18, 19 తేదీల్లో ఆయన న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు వెలగపూడి సచివాలయంలోని హెలిప్యాడ్ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. ఆ రాత్రి వన్ జనపథ్‌లో ఆయన బస చేయనున్నారు.
19వ తేదీ సాయంత్రం 6. 40 గంటలకు ఢిల్లీ నుంచి తిరిగి విజయవాడకు సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. అయితే 18వ తేదీ రాత్రి.. కేంద్రంలోని పలువురు కీలక నేతలతోపాటు.. ఉన్నత స్థాయి అధికారులను సీఎం చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 19వ తేదీ కూడా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీకి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి అవసరమైన కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులతోపాటు ఆమోదం అంశాలపై వారితో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ముందు రోజు సీఎం చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉత్తరాంధ్రలో పలు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష..
ఉత్తరాంధ్రలో నిర్మితమవుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఐటీ కంపెనీలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాల్ని ఆయన పరిశీలించారు. అలాగే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌లో జరుగుతున్న పలు కీలక ప్రాజెక్టుల పురోగతి పనులపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇక భోగాపురం ఎయిర్ పోర్టు, రాయ్‌పూర్ - విశాఖ జాతీయ రహదారి, తీర ప్రాంతంలోని రహదారులు, కనెక్టివిటీ ప్రాజెక్టులపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పల్లెల నుంచే కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్: కేటీఆర్
విశాఖ కాగ్నిజెంట్‌లో 25 వేల మందికి ఉద్యోగాలు: సీఈవో రవి కుమార్
For More AP News And Telugu News