Scrub Typhus: స్క్రబ్ టైఫస్‌పై ఆందోళన అవసరం లేదు: హెల్త్ కమిషనర్
ABN , Publish Date - Dec 08 , 2025 | 06:49 PM
స్క్రబ్ టైఫస్‌పై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని హెల్త్ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ ఏడాది 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు వచ్చాయని చెప్పారు. గతేడాది 1,613 కేసులు వచ్చాయని ఆయన వివరించారు.
అమరావతి, డిసెంబర్ 08: స్క్రబ్ టైఫస్ వల్ల వెంటనే ఎవరు మరణించరని.. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ స్పష్టం చేశారు. ఈ స్క్రబ్ టైఫస్‌పై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు వచ్చాయని చెప్పారు. గతేడాది 1,613 కేసులు వచ్చాయని వివరించారు. ఈ స్క్రబ్ టైఫస్ ఈ ఏడాది వచ్చినట్లుగా భావించవద్దని ప్రజలకు ఆయన సూచించారు. సోమవారం రాజధాని అమరావతిలో కమిషనర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ.. ఈ వ్యాధి ఎవరికి తెలియనిది కాదన్నారు. మలేరియా, డెంగీలాగా స్క్రబ్ టైఫస్ వస్తుందన్నారు.
ప్రతీ ఏడాది 1,300 స్క్రబ్ టైఫస్ కేసులు వస్తున్నాయంటూ ఆయన గణాంకాలతో సహా సోదాహరణగా వివరించారు. ఇప్పటి వరకూ ఈ స్క్రబ్ టైఫస్ వల్ల 9 మంది మరణించినట్లు గుర్తించామని చెప్పారు. దీనిపై ఎక్స్‌పర్ట్ జార్జితో సైతం ఇప్పటికే మాట్లాడామన్నారు. దీనిని అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్‌లతో తగ్గించుకో వచ్చని సూచించారు. ఇప్పటి వరకూ నమోదైన మరణాలు స్క్రబ్ టైఫస్ వల్ల మాత్రమే కాదని.. ఆల్రెడీ వ్యాధి ఉండి, ఇది వచ్చాక మరణించిన కేసులు ఇవన్నీ అని కమిషనర్ వీరపాండ్యన్ వివరించారు.
కర్ణాటకలో గత ఏడాది 1,689 స్క్రబ్ టైఫస్ కేసులు.. ఈ ఏడాది 1,870 కేసులు వచ్చాయన్నారు. అలాగే తమిళనాడులో గతేడాది 6,925 స్క్రబ్ టైఫస్ కేసులు.. ఈ ఏడాది 7,380 కేసులు వచ్చాయని తెలిపారు. తెలంగాణలో గతేడాది 309.. ఈ ఏడాది 183 కేసులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుత్రుల్లో స్క్రబ్ టైఫస్‌కు ట్రీట్‌మెంట్ ఉందని స్పష్టం చేశారు. జ్వరం వచ్చిన 5వ రోజు నుంచీ 20వ రోజు మధ్యలో స్క్రబ్ టైఫస్ బయటపడుతోందన్నారు.
గుంటూరు, విజయవాడలలో జినోమ్ ల్యాబ్‌లను యాక్టివేట్ చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ, గ్రామీణ విభాగాలను సైతం అప్రమత్తం చేశామని చెప్పారు. ఇక ప్రతీ జిల్లాలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఉంటుందన్నారు. దీనిపై ప్రతీ వారం సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. IHIP పోర్టల్‌లో ప్రతీ కేసు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని వారికి స్పష్టం చేశామన్నారు. పారిశుద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు.
ఆరుగురు ఐసీయూలో.. : గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
స్క్రబ్ టైఫస్ వార్డులో ఉన్న 12 మందిలో ఆరుగురు ఐసీయూలో ఉన్నారని గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ వివరించారు. అయితే గతంలో వ్యాధులు ఉన్నా వారు ఆలస్యంగా ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఒక యువతికి డైరెక్ట్‌గా బ్రెయిన్‌కు వచ్చింది డాక్టర్ రమణ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ: సీఎం రేవంత్
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
Read Latest AP News And Telugu News