CM Chandrababu Review: ఉల్లి రైతులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Aug 28 , 2025 | 04:19 PM
రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
అమరావతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఇవాళ(గురువారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, మార్కెటింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. ఈరోజు నుంచే క్వింటాకు రూ.1,200 చొప్పున రైతుల వద్ద నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.
కమ్యూనిటీ హాళ్లల్లో ఉల్లిని నిల్వ చేయాలి..
ఉల్లికి రేటు వచ్చే వరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేయడానికి రైతులకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. వచ్చే పది రోజుల్లో ఐదువేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు వివరించారు. కొనుగోలు చేసి ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లల్లో విక్రయించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తక్షణం ఉల్లిని కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలని ఆదేశించారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రైతుబజార్ల సంఖ్యను పెంచటంతోపాటు ఆధునికీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.
పెట్టుబడులపై చర్చ...
మరోవైపు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్రతిపాదనలు, పరిశ్రమల కోసం ఏపీఐఐసీ ప్రతిపాదనలు, ప్రైవేటు పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కుల ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రైవేటు మెగా ఇండస్ట్రీయల్ పార్కులు, టూరిజం శాఖ ప్రతిపాదనలు, విద్యుత్ శాఖ ప్రతిపాదనలపై మాట్లాడారు. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ప్రతిపాదనలకు పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో చర్చించి ఆమోదం తెలిపామని అన్నారు. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం ద్వారా రూ. 53,922 కోట్ల పెట్టుబడులతో 83,437 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయని వివరించారు సీఎం చంద్రబాబు.
ఫ్యామిలీ కార్డ్ జారీ చేయాలి..
అలాగే.. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఫ్యామిలీ కార్డ్ జారీ చేయాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో ఏపీ ప్రభుత్వం పొందుపరచనుంది. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఏయే కుటుంబానికి ఏమేం అవసరాలున్నాయనే అంశాన్ని క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలని మార్గనిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.
ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు...
ప్రతి కుటుంబానికి ఇచ్చే ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వం ఇచ్చే పథకాల వివరాలను పొందుపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని సూచించారు. అందరికీ లబ్ధి కలిగేలా అవసరమైతే పథకాలను రీ-డిజైన్ చేసే అంశాన్నీ పరిశీలిద్దామని సీఎం చెప్పుకొచ్చారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు పెరగాలని వాటిని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని సూచించామని అన్నారు. ప్రభుత్వ పథకాల కోసం కార్డుల్లో ఫ్యామిలీలను విభజించుకుంటున్నారంటూ సీఎం వ్యాఖ్యానించారు. కుటుంబం ఉమ్మడిగా ఉన్న సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగానే ప్యామిలీ కార్డులకు రూపకల్పన చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యుదాఘాతంతో యువకుడు మృతి.. పవన్ కల్యాణ్ విచారం
భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్
For AP News And Telugu News