Share News

AP Govt Road Show In Seoul: సియోల్‌లో రోడ్డు షో.. మంత్రి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 29 , 2025 | 06:50 PM

దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు పి. నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితోపాటు ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం పర్యటిస్తుంది. అందులో భాగంగా రాజధాని సియోల్‌లో సోమవారం రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించింది.

AP Govt Road Show In Seoul: సియోల్‌లో రోడ్డు షో.. మంత్రి కీలక వ్యాఖ్యలు
AP Minister BC Janardhan reddy

అమరావతి, సెప్టెంబర్ 29: గత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ 156 ప్రాజెక్టుల ద్వారా రూ. 10 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను సాధించడంతో పాటు దాదాపు 8 లక్షల కొత్త ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాలు,పెట్టుబడులు శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదని.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఒక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌పై ఉంచిన విశ్వాసానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ - దక్షిణ కొరియా బిజినెస్ ఫోరం పార్టనర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా రాజధాని సియోల్‌లో సోమవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియా పెట్టుబడుదారులను ఉద్దేశించి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రసంగించారు.


1,053 కిలోమీటర్ల తీర ప్రాంతంతో.. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి తూర్పు తీర ముఖ ద్వారంగా ఉందని వివరించారు. ఏపీలో పోర్టులు ఇప్పటికే తూర్పు తీరంలో 30 శాతం కార్గోని నిర్వహిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నాలుగు కొత్త గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు.. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ ద్వారా ఏడాదికి అదనంగా 353 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యాన్ని పెంచాయని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో కార్గో సామర్థ్యాన్ని సంవత్సరానికి 700 మిలియన్ మెట్రిక్ టన్నులకుపైగా విస్తరించనున్నామని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


ఏవియేషన్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో 6 ఆపరేషన్ ఎయిర్ పోర్టులు ఉన్నాయని.. 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు సహా ప్రస్తుతం 9 విమానాశ్రయాలు అభివృద్ధి దశలో ఉన్నాయని ఈ సందర్భంగా వారికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదాహరణగా వివరించారు. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2026 నాటికి గ్లోబల్ కనెక్టివిటీకి ప్రధాన కేంద్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో విమానయాన ఇంధన డిమాండ్‌లో 20 శాతం ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా ఏరోస్పేస్ క్లస్టర్‌లలో తాము సైతం పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు.


భారతదేశంలో 3 జాతీయ పారిశ్రామిక కారిడార్లు కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని.. ఆ క్రమంలో పారిశ్రామిక అవసరాలకు 91 వేల ఎకరాల భూమిని అందించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1. 3 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేయగలిగామని.. ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 ఎమ్‌ఎస్ఎమ్‌ఈ పార్కులు స్థాపిస్తున్నామని తెలిపారు. మా మల్టీ - మోడల్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లతో కలిపి, ఆయా ఉత్పత్తులు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను వేగంగా, కచ్చితత్వంతో చేరుతాయని పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్ 20 గిగా వాట్ల స్థాపిత సామర్థ్యంతో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు తమ ప్రభుత్వం హామీ ఇస్తుందని వారికి మంత్రి భరోసా కల్పించారు. అందులో 39 శాతం పునరుత్పాదక శక్తి ఉంటుందని వివరించారు. ఏడాదికి 300 రోజులు వేడి వాతావరణం కారణంగా రాష్ట్రంలో 2047 నాటికి 160 గిగా వాట్ల పునరుత్పాదక శక్తిని సాధించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని స్థాపించడానికి, క్లీన్ ఎనర్జీ ఎగుమతుల్లో గ్లోబల్ లీడర్‌గా ఎదగడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.


టెక్నాలజీలో సైతం ఏపీ ముందంజలో ఉందన్నారు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ ఐబీఎం 133- క్యూబిట్ (kubit) క్వాంటం సిస్టం-2ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నాట్లు ఈ సందర్భంగా దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలకు మంత్రి వివరించారు. ఆర్సెల్లార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ వంటి గ్లోబల్ స్థాయి లీడర్లు ఇప్పటికే తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకున్నారని సోదాహరణగా వారికి వివరించారు.


బీపీసీఎల్ రూ. లక్ష కోట్ల విలువైన పెట్రో కెమికల్ అండ్ గూగుల్ అతి పెద్ద భారతీయ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జేఎస్‌డబ్ల్యూ, ఎల్‌జీ , డైకిన్, ఐబీఎం వంటి క్లయింట్ కంపెనీలు తమ మౌలిక సదుపాయాలు, దార్శనికతపై విశ్వాసాన్ని ఉంచాయన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజధాని అమరావతి అని.. 44 వేల ఎకరాల స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయబోతున్నామని వివరించారు. 2050 నాటికి 35 బిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 1.5 మిలియన్ల కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.


ఈ ఏడాది నవంబర్‌లో విశాఖపట్నం వేదికగా జరిగే 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరవ్వాలంటూ దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులతోపాటు పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రతినిధుల బృందం ఆహ్వానించింది. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా పలు నిర్మాణాలను ప్రభుత్వం నిర్మిస్తుంది. ఆ క్రమంలో ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు కన్నబాబు, ఎం.టీ. కృష్ణబాబు, ఈడీబీ అధికారుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం ప్రతినిధులు, వివిధ కంపెనీల సీఈవోలతో ఈ ప్రతినిధి బృందం వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందో.. తెలుసుకునే సింపుల్ చిట్కాలు

విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు..

For More AP News And Telugu News

Updated Date - Sep 29 , 2025 | 06:59 PM