Share News

Heavy Rains: ముంచెత్తనున్న వానలు.. టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల

ABN , Publish Date - Nov 20 , 2025 | 07:59 PM

ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Heavy Rains: ముంచెత్తనున్న వానలు.. టోల్ ఫ్రీ నెంబర్లు విడుదల
Heavy Rains Alert

అమరావతి, నవంబర్ 20: ఆంధ్రప్రదేశ్‌ను వరుణ దేవుడు వీడడం లేదు. మొన్న ముంథా తుఫాన్ సృష్టించిన ఆస్తి నష్టం అంతా ఇంతా కాదు. తాజాగా మళ్లీ ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. అది కూడా ఒకటి, రెండు కాదు.. వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నవంబర్ 27 నుంచి 29వ తేదీ వరకు అంటే.. గురు, శుక్ర, శనివారాల్లో.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆ తదుపరి 48 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు అవకాశం ఉందని చెప్పింది.


వర్షాల దృష్ట్యా వరి కోతలు సహా వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులకు విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే పండిన ధాన్యాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని స్పష్టం చేసింది. అత్యవసర సహాయం కోసం.. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 42 50101 సంప్రదించాలని రైతులకు విజ్ఞప్తి చేసింది. ఇక శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

President Droupadi Murmu: తిరుమల చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

TTD Laddu Adulterated Ghee Case: కల్తీ నెయ్యి కేసులో.. ముగిసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ..

Updated Date - Nov 20 , 2025 | 09:19 PM