Andhra Pradesh Government: పట్టణాల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 21 , 2025 | 02:36 PM
రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మంగా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది.
అమరావతి, అక్టోబర్ 21: రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగు పరచడానికి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అమృత్ (AMRUT) 2.0 పథకం కింద 281 పనులకు రూ.10,319. 93 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు మున్సిపల్ శాఖ తెలిపింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే ఏపీయూఎఫ్‌ఐడీసీ (APUFIDC), పబ్లిక్ హెల్త్, గ్రీన్ బిల్డింగ్స్ కార్పొరేషన్లకు ఈ పనుల నిర్మాణంతోపాటు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు జారీ చేసి ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే మొత్తం ప్రాజెక్టు ఖర్చులో కేంద్రం రూ. 2, 470 కోట్లు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2, 490 కోట్లు విడుదల చేయనున్నాయి. ఇక ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ. 925 కోట్లు విడుదల చేయనుంది. పట్టణాల వాటా రూ. 590 కోట్లుగా నిర్ధారించింది. అంతా కలిపి ప్రాజెక్టు క్యాపెక్స్ రూ.6, 477 కోట్లుగా.. దీనికి 10 ఏళ్ల నిర్వహణ ఖర్చు రూ.1, 499 కోట్లుగా నిర్ణయించింది.
ఇక వడ్డీ ఖర్చు కింద రూ. 2,344 కోట్లు భారం పడనుంది. ఈ మొత్తం ప్రాజెక్టు విలువ రూ.10, 319. 93 కోట్లు. మరోవైపు ఈ పనులు తీసుకునే సంస్థలు.. ఒప్పందం సమయంలో కొంత మొత్తం సెక్యూరిటీగా చెల్లించాలనే నిబంధనను విధించింది. ఈ పనులు సాగుతున్న సమయంలో ఈ నిధులు కట్ చేయకుండా మాఫీ చేసేందుకు అనుమతి సైతం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, పట్టణాల వాటా కోసం అవసరమైన నిధులను సేకరించేందుకు APUFIDCకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది రాష్ట్ర పట్టణాభివృద్ధి చరిత్రలోనే అతి పెద్ద పెట్టుబడి పెట్టిన ప్రాజెక్ట్‌గా రికార్డుల్లో నమోదవనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ముంచుకొస్తున్న అల్పపీడనం .. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
ఆయనకు చదువుంది.. బుద్ధి, జ్ఞానం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి
For More AP News And Telugu News