Cyclone Montha: మెుంథా తుపాన్.. ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది: నారా లోకేశ్
ABN , Publish Date - Oct 27 , 2025 | 09:30 PM
మొంథా తుపాన్ నేపథ్యంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన సోదాహరణగా గణాంకాలతో సహా వివరించారు.
అమరావతి, అక్టోబర్ 27: మొంథా తుపాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా ఎక్కడా ఎటువంటి ప్రమాదం జరగకుండా బాధితులను రక్షించేందుకు ఆర్టీజీఎస్ సహకారంతో చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. 19 జిల్లాల్లో మొత్తం 40 లక్షల మంది ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు గుర్తించామని.. వారందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.

అయితే ఇప్పటికే 1,238 గ్రామాలు ప్రమాదకర అంచున ఉన్నాయన్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నామని వివరించారు. వారి కోసం 1,906 సహాయ శిబిరాలు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. అదే విధంగా 3,465 గర్భిణులతోపాటు బాలింతలను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వారి కోసం వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. తుపాన్ నేపథ్యంలో 14,798 స్కూళ్లకు సెలవులు ప్రకటించామన్నారు. 364 స్కూళ్లను తుపాన్ సహాయ శిబిరాలుగా వినియోగిస్తున్నట్లు తెలిపారు.

అక్టోబర్ 29వ తేదీ వరకూ చేపల వేట, పడవ ప్రయాణంపై నిషేధం విధించామన్నారు. బీచ్‌లను సైతం మూసివేశామని ప్రకటించారు. మరోవైపు 11 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపామని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బందితోపాటు చెట్లు విరిగి రహదారిపై పడిపోతే వాటిని తొలగించేందుకు బృందాలను సైతం సిద్ధంగా ఉంచామన్నారు.

325 వైద్య శిబిరాలు, 876 వైద్య బృందాలతోపాటు 108, 104 అంబులెన్స్‌లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే 3 పడవల్లో వైద్య బృందాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. 11,347 స్తంభాలు, 1,210 డీటీఆర్‌లను 772 విద్యుత్ బృందాలు పునరుద్దరించాయన్నారు. రహదారులు క్లియరెన్స్ కోసం 7,289 యంత్రాలు, 1,521 నీటి ట్యాంకర్లు, 1,037 జనరేటర్లతోపాటు తగినంత ఇంధన నిల్వలను సిద్ధంగా ఉంచామని చెప్పారు.
అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థను సైతం వినియోగించుకుంటున్నామని అన్నారు. అందులో భాగంగా 16 శాటిలైట్ ఫోన్లు, 3 డీఎంఆర్ సెట్లు, 10 సీవోడబ్ల్యూలను అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంయేలతోపాటు పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని మంత్రి నారా లోకేశ్ వివరించారు.
అయితే తుపాన్ నేపథ్యంలో బయటకు రావద్దని ఇంటిలోనే ఉండాలని ప్రజలకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరదలున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దని ప్రజలను కోరారు. అత్యవసరమైతే.. ఆర్టీజీఎస్, ఏపీఎస్‌డీఏంఏ, కలెక్టరేట్ సలహాలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..
For More AP News And Telugu News