Share News

Engineering Negligence: నిర్లక్ష్యపు గోడ

ABN , Publish Date - May 01 , 2025 | 05:20 AM

సింహాచలంలో ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చందనోత్సవానికి ముందు నిర్మాణం చేసిన గోడ కుప్పకూలింది. పునాది లేకుండా నిర్మించిన గోడ వర్షం కారణంగా కూలిపోయింది.

Engineering Negligence: నిర్లక్ష్యపు గోడ

  • చందనోత్సవం ముందు హడావుడిగా పనులు

  • బలమైన పునాది లేకుండా నిర్మాణం

  • గోడ పునాదుల్లోకి చేరిన వర్షపు నీరు

  • నాసిరకం కావడంతో కుప్పకూలిన గోడ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): సింహాచలంలో ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం ఖరీదు భక్తుల ప్రాణాలు! లక్షలమంది హాజరయ్యే, అతి భారీగా, వేడుకగా జరిగే స్వామివారి చందనోత్సవానికి ముందు... హడావుడిగా గోడ నిర్మాణం చేపట్టడమే ఒక తప్పు! దానిని... నాసిరకంగా చేపట్టడం ఘోరం, నేరం! అధికారులంతా చందనోత్సవ ఏర్పాట్లలో తలమునకలై ఉండగానే... వారం కిందట రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టారు. కింద ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ వైపు వర్షపు నీరు వెళ్లకుండా చూడటమే దీని ఉద్దేశం. 40 అడుగుల పొడవు, పది అడుగుల ఎత్తు, రెండు అడుగుల మందంతో ‘ఎల్‌’ ఆకారంలో గోడను నిర్మించారు. ఇంత భారీ గోడను నిర్మించేటప్పుడు పక్కాగా పునాదులు ఏర్పాటు చేయాలి. కానీ... నాలుగు అడుగుల వెడల్పు, మూడు అడుగుల లోతు మట్టి తవ్వేసి, లోపలి నుంచి గట్టి సిమెంట్‌ బ్రిక్స్‌తో గోడ కడుతూ వచ్చారు. క్యూరింగ్‌ కూడా సరిగా చేయలేదనే ఆరోపణలున్నాయి. గోడను చేతితో పట్టుకొని గట్టిగా రుద్దితే సిమెంట్‌ పిండిలా విడిపోతోంది. పునాదుల కోసం తవ్విన మట్టిని గోడకు అటూ ఇటూ పోగేశారు. 4 రోజుల కిందటే ఈ గోడ నిర్మాణం పూర్తయిందనిపించారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక సింహాచలంలో ఒక్క అరగంటలోనే రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది. గోడకు అటూఇటు వేసిన మట్టి లూజుగా ఉండటంతో... వర్షపు నీళ్లు దానిగుండా గోడ కింది దాకా వెళ్లాయి. అసలే అంతంతమాత్రం నాణ్యతతో కట్టిన గోడ కావడంతో ఒక్కదెబ్బకు కూలిపోయింది. 90 శాతం గోడ పడిపోయి... చిన్న భాగం మాత్రం మిగిలింది.


పర్యవేక్షణ ఇలాగేనా?

చందనోత్సవం ఏర్పాట్లు 2 నెలలుగా జరుగుతున్నాయి. సింహాచలంలో వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్‌’ పథకం కింద రూ.50 కోట్లు సింహాచలం దేవస్థానానికి మంజూరుచేసింది. ఏపీటీడీసీఇంజనీరింగ్‌ విభాగం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లతో ఈ పనులు చేయిస్తోంది. సింహాచలం దేవస్థానం ఇంజనీరింగ్‌ విభాగం దీనిని పర్యవేక్షిస్తోంది. గోడ నిర్మాణం నాలుగు రోజుల కిందట పూర్తిచేశారు. అయితే, ఈ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్‌ అధికారులపై లెక్కలేనన్ని ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. పడిపోగా మిగిలిన గోడను మంత్రి అనిత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అధికారులు పరిశీలించారు. అది కూడా ఎక్కడికక్కడ బీటలువారి కనిపించింది. నిర్మాణంలో నాణ్యత లేదని వారు పెదవి విరిచారు. పనుల పర్యవేక్షణ చేసేది ఇలాగేనా అంటూ ఇంజనీరింగ్‌ అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు.


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 01 , 2025 | 05:24 AM