Share News

AP News: కొండ కోనల్లో.. ఏకాంతంగా ఏకిరిపల్లె

ABN , Publish Date - Oct 07 , 2025 | 10:17 AM

పులపత్తూరుకు సమీపంలో బాహుదానది ఆనుకుని అటవీ ప్రాంతంలో ఏకిరిపల్లె గ్రామం ఉంది. వీరు అడవిలో లభించే అటవీ వస్తువులను నమ్ముకుని గతంలో జీవనం సాగించేవారు. రాను రాను అటవీ ప్రాంతంలో ఉన్న మెట్ట ప్రాంత భూములను చదును చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

AP News: కొండ కోనల్లో.. ఏకాంతంగా ఏకిరిపల్లె

- గ్రామస్థుల జీవనం

- నేటికీ రోడ్డులేక అవస్థలెన్నో...

- కాలిబాటే వారికి రాచబాట

- అటవీ అనుమతులు రాక...

- రోడ్డు వేసుకోలేక ప్రజలకు తప్పని ఇబ్బందులు

రాజంపేట మండలంలో అటవీ ప్రాంతమైన ఏకిరిపల్లె స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి నేటికీ మౌలిక వసతులకు దూరంగా ఉంది. రాజంపేటకు 20 కిలోమీటర్ల దూరంలో పులపత్తూరు గ్రామ పరిధిలో ఏకిరిపల్లె గ్రామం మజరా గ్రామంగా ఉంది. ఈ గ్రామంలో 40 కుటుంబాలున్నాయి. ఈ గ్రామానికి రోడ్డు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాలిబాటే వారికి రాచబాటగా మారింది. విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్లాలంటే కాలినడకన వెళ్లాల్సిందే. ఏళ్ల తరబడి పాలకుల చుట్టూ తిరుగుతున్నా మా బాధలు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

రాజంపేట(కడప): పులపత్తూరు(Pulapattur)కు సమీపంలో బాహుదానది ఆనుకుని అటవీ ప్రాంతంలో ఏకిరిపల్లె గ్రామం ఉంది. వీరు అడవిలో లభించే అటవీ వస్తువులను నమ్ముకుని గతంలో జీవనం సాగించేవారు. రాను రాను అటవీ ప్రాంతంలో ఉన్న మెట్ట ప్రాంత భూములను చదును చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ బగ్గిడిపల్లె నుంచి మూడున్నర కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో బండిబాటే వారికి రాచబాటగా మారింది.


విద్యార్థులు చదువుకోవాలంటే కాలిబాటన సుమారు 7 కిలోమీటర్ల దూరంలోని మందపల్లెకు, 20 కిలోమీటర్ల పరిధిలోని రాజంపేట(Rajampeta)కు లేదా నందలూరుకు 30 మంది విద్యార్థులు ప్రతిరోజూ కాలినడకన వెళుతున్నారు. ఈ గ్రామానికి రోడ్డు వేయడానికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, దివంగత మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య అనేక ప్రయత్నాలు చేశారు. మూడున్నర కిలోమీటర్ల మేర రూ.3.50 కోట్లతో రోడ్డు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమార్లు ప్రతిపాదనలు పంపారు.


గతంలో ఒకసారి నిధులు కూడా విడుదలయ్యాయి. అయితే రోడ్డు వేయడానికి అధికారులు సిద్ధమై అందుకు సంబంఽధించిన కంకర సిద్ధం చేశారు. ఇంతలో అటవీ శాఖ అధికారులు అటవీ సంరక్షణ కింద రోడ్డు వేయడానికి అనుమతులు ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అటవీ శాఖ, వన్య సంరక్షణ అధికారులు అనుమతులు ఇస్తే తప్ప రోడ్డు వేయడానికి వీలులేదని తేల్చి చెప్పారు. దీంతో రోడ్డు పనులు నిలిచిపోయాయి. కరెంటు సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుని గ్రామంలోకి మంచినీటి పథకానికి, గ్రామ వీధి దీపాలకు, వ్యవసాయ బోరు బావులకు ఆ కరెంటును ఉపయోగిస్తున్నారు.


kadapa1.jpg

అరటి, వేరుశనగ, వరి, రాగి, సజ్జ, పొద్దుతిరుగుడు తదితర పంటలను సాగు చేసుకుంటున్నారు. పండించిన పంటను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలంటే పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. గ్రామానికి వాహనాలు వచ్చే అవకాశం లేదు. అందువల్ల భూమికి సుమారు 500 ఎత్తు అటవీ మార్గంలో ఉండే ఏకిరిపల్లెకు రెండెద్దుల బండ్లను, అతి కష్టం మీద ట్రాక్టర్లను ఉపయోగించుకుని ఈ పంటలను ఎగుమతి చేస్తున్నారు. ఎత్తయిన బండరాళ్ల ప్రాంతంలో ఏమాత్రం కాలు జారినా అటు ఎద్దులకు, ఇటు ట్రాక్టర్‌ డ్రైవర్లు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. అలా గతంలో చాలా సంఘటనలు జరిగాయి.


గతంలో అనేకమార్లు ఈ గ్రామాన్ని తరలించాలని ప్రయత్నించినా వారి గ్రామాన్ని వదిలి రావడానికి ఇష్టపడలేదు. గర్భిణులు, తీవ్ర అనారోగ్యానికి గురైనవారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఎద్దుల బండికి డోలీలు కట్టి అతి కష్టం మీద వారిని అందులో పడుకోబెట్టి తీసుకువస్తుంటారు. బాహుదానదికి నీరు వస్తే వారి కష్టాలు మరింత దుర్భరం. ఏటి ద్వారా రాలేక, ఏరును ఆనుకుని కాలిబాట ద్వారా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. వర్షం లేనప్పుడు, బాహుదాలో నీరు తగ్గినపుడు అనేకమార్లు గ్రామ పరిధి వరకు ఏటిలో మట్టిరోడ్డును తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.


వర్షపు నీటికి ఆ తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడం ఇప్పటికి అనేకసార్లు జరిగింది. ఇటీవల బీజేపీ నాయకుడు, ప్రస్తుత శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌ పోతుగుంట రమేశ్‌నాయుడు ఆధ్వర్యంలో ఆ గ్రామాన్ని సందర్శించి గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతూ సంబంధిత అధికారుల ద్వారా ప్రతిపాదనలు తయారు చేసి అధికారులకు పంపారు. అయినా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి ఈ గ్రామానికి రోడ్డు వేయాలని, స్థానికులు కోరుతున్నారు.


నిధులు మంజూరైనా అనుమతులు ఇవ్వలేదు

గతంలో ఈ గ్రామానికి మూడున్నర కిలోమీటర్ల మేర రోడ్డు వేయడానికి రూ.3.50 కోట్ల నిధులను మంజూరు చేయించాం. పనులు ప్రారంభం చేయడానికి కావాల్సిన కంకర అన్నీ సిద్ధం చేశాం. అయితే అటవీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి. దీనివల్ల తాను వ్యక్తిగతంగా ఖర్చు చేసిన డబ్బులు కూడా వృథాగా పోయాయి. అటవీశాఖ అనుమతులు ఇస్తేగాని ఈ గ్రామానికి రోడ్డు వేయడం కష్టం.

- ప్రతాపరెడ్డి, పులపత్తూరు, రాజంపేట.


ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం

ఏకిరిపల్లె గ్రామానికి రోడ్డు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపాం. నేనే స్వయంగా ఇటీవల ఏకిరిపల్లె గ్రామానికి వెళ్లి ప్రజలు అక్కడ ఎదుర్కొంటున్న బాధలను స్వయంగా తెలుసుకున్నాను. ఈ విషయంలో గత పాలకులు ఈ గ్రామానికి రోడ్డు వేసే అంశంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. వారు పట్టుబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి గ్రామానికి రోడ్డు వేసి ఉంటే అన్ని సమస్యలు తీరేవి. వారి నిర్లక్ష్యం వల్ల గ్రామానికి రోడ్డు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అయినా దీనిపై పోరాడి రోడ్డును వేయిస్తాం.

- పోతుగుంట రమేశ్‌నాయుడు, బీజేపీ నేత,

శ్రీశైలం దేవస్థానం చైర్మన్‌


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ రాజకీయం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 07 , 2025 | 10:17 AM