Draksharamam Incident: శివలింగం ధ్వంసం ఘటన.. పోలీసుల అదుపులో కీలక నిందితుడు
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:28 AM
భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం కేసులో కీలక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శివలింగాన్ని ధ్వంసం చేయడానికి గల కారణాలను సదరు యువకుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
అంబేద్కర్ కోనసీమ, డిసెంబర్ 31: ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కపాలేశ్వర స్వామి శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆరు పోలీసు బృందాలతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా అనుమానితులను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల అదుపులో కీలక నిందితుడు ఉన్నట్లు సమాచారం. తోటపేట గ్రామానికి చెందిన 38 సంవత్సరాల యువకుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగానికి పూజలు చేసే అర్చకుడికి అనుమానిత యువకుడికి మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో శివలింగం ధ్వంసం చేయడానికి కారణమని సదరు యువకుడు చెబుతున్నట్లు సమాచారం. శివలింగంకు పూజలు చేసే సమయంలో అనుమానిత యువకుడు, అర్చకుడు తరచూ గొడవ పడేవారని తెలుస్తోంది. అర్చకుడు మీద ఉన్న కోపంతో ఆ అనుమానిత యువకుడు శివ లింగం ధ్వంసం చేసినట్లు సమాచారం.
సీఎం ఆదేశాలు..
మరోవైపు... ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శివలింగం ధ్వంసం ఘటనపై తాను జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తో పాటు జిల్లా మంత్రితో మాట్లాడినట్లు ముఖ్యమంత్రికి ఆనం రామనారాయణరెడ్డి వివరించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఘటనపై దర్యాప్తు అంశాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఇవి కూడా చదివండి...
ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం..
దారుణం.. భార్యను పచ్చడి బండతో కొట్టి చంపిన భర్త
Read Latest AP News And Telugu News