Share News

Kakinada సీ పోర్టు.. వాటాలు కేవీరావుకు తిరిగిచ్చేసిన అరబిందో..

ABN , Publish Date - Jan 21 , 2025 | 07:22 AM

‘కాకినాడ సీ పోర్టు’ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ... కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు చేయడం... ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను ‘అరబిందో’ సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది.

Kakinada సీ పోర్టు.. వాటాలు కేవీరావుకు తిరిగిచ్చేసిన అరబిందో..
Kakinada Sea Port Shares

కాకినాడ: సీ పోర్టు (Kakinada Sea Port) డీల్ రివర్స్ (Deal Reverse) అయింది. వాటాలను అరబిందో కంపెనీ (Aurobindo Company) తిరిగి కేవీరావు (KV Rao)కు ఇచ్చేసింది. మూడు రోజుల క్రితం బదిలీ కార్యక్రమం గుట్టుగా జరిగిపోయింది. ఈ వివాదంలో పైస్థాయి వ్యక్తులు మధ్యవర్తిత్వం జరిపారు. అయితే సెజ్‌ను మరిచిపోవాలంటూ కేవీరావుకు షరతు విధించారు. దానికి బదులుగా పోర్టులో గతంలో లాక్కున్న 41.12 శాతం వాటాలు తిరిగి బదిలీ చేశారు. ఈ క్రమంలో కేవీ రావు పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కాగా తనను బెదిరించి.. భయపెట్టి పోర్టులో వాటాలు లాగేసుకున్నారని గత నెలలో కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అటు సీఐడీ ఫిర్యాదు ఆధారంగా రూ.494 కోట్ల చెల్లింపులపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి.. వైవి విక్రాంత్ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించారు. ఒకవైపు ఈడీ విచారణ జరుగుతుండగానే కేవీ రావుకు గతంలో గుంజుకున్న వాటాలను అరబిందో సంస్థ తిరిగి ఇచ్చేసింది.


‘కాకినాడ సీ పోర్టు’ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ... కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు చేయడం... ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను ‘అరబిందో’ సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది. మూడు రోజుల కిందట వాటాల బదిలీ పూర్తయినట్లు సమాచారం. విషయాన్ని అటు సీఐడీ, ఇటు ఈడీ లోతుగా లాగకుండా ముందు జాగ్రత్తగా వాటాలను తిరిగి ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. కానీ... దీని వెనుక జరిగింది వేరని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... కాకినాడ పోర్టులో మనీలాండరింగ్‌పై ఈడీ ఆరా తీస్తుండటం... అరబిందో ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితి తలెత్తడం... తీగలాగితే భారీగా డొంక కదిలే పరిస్థితి ఉండటంతో కాకినాడ సీపోర్ట్‌ డీల్‌ ‘రివర్స్‌’ అయ్యింది. ప్రస్తుత పరిస్థితులను కేవీరావు పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు.


పైస్థాయి వ్యక్తులు కొందరు రంగంలోకి దిగి... ఇద్దరినీ కూర్చోబెట్టి కొత్త ‘డీల్‌’కు ఓకే చెప్పించారు. అప్పట్లో... రూ.2500 కోట్ల విలువైన 2.15 కోట్ల షేర్లను జగన్‌ బ్యాచ్‌ రూ.494 కోట్లకే లాగేసుకుందని కేవీ రావు ఆరోపించారు. దీనిపై సీఐడీకి కూడా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కేవీరావుకు చెందిన... 8 వేల ఎకరాలున్న కాకినాడ సెజ్‌ పూర్తిగా అరబిందోకు సొంతమైంది. తాజాగా... ‘కాకినాడ సెజ్‌ గురించి మరిచిపోండి. అది అరబిందోకే! పోర్టులో మీ నుంచి తీసుకున్న వాటాలు మీకే వచ్చేస్తాయి’’ అని డీల్‌ కుదిరింది. దీని ప్రకారం 3 రోజుల కిందట అరబిందో పేరుతో ఉన్న 2.15 కోట్ల షేర్లు కేవీరావుకు బదిలీ అయిపోయాయి. దీనికి సంబంధించి అప్పట్లో తనకు చెల్లించిన డబ్బులను కేవీరావు అరబిందోకు తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. దీంతో కాకినాడ పోర్టు పూర్తిగా కేవీరావు వశమైంది. సీపోర్టుకు స్టాక్‌ ఎక్స్ఛేంజీతో సంబంధం లేకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిపోయింది. ఇక... కాకినాడ సెజ్‌లో తన వాటాగా రూ.1104 కోట్లు రావలసి ఉండగా, రూ.12 కోట్లతో సరిపెట్టారని కేవీరావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోర్టు వాటాలను తిరిగి ఇచ్చేసినందున.. ఇక సెజ్‌ గురించి మరిచిపోయేలా డీల్‌ కుదిరినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కేవీరావు మాత్రం, సెజ్‌లో వాటాలను వదులుకునేది లేదని ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్రంప్ తొలి షాక్!

ఆ ఆటో డ్రైవర్‪కు రివార్డు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 21 , 2025 | 07:22 AM