Share News

Liquor Scam Investigation: లిక్కర్‌లో బాసులూ లాక్‌

ABN , Publish Date - May 06 , 2025 | 03:45 AM

ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం స్కామ్‌లో ధనుంజయ్‌రెడ్డి మరియు కృష్ణమోహన్‌రెడ్డి కీలక పాత్రధారులు. వీరికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు, విచారణలో వారు కేంద్రగా ఉన్నారు.

Liquor Scam Investigation: లిక్కర్‌లో బాసులూ లాక్‌

  • సూపర్‌బాస్‌ సెటిల్‌మెంట్లకు వీరే కేరాఫ్‌!

  • ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలదే నాడు రాజ్యం

  • వీరిద్దరూ నోరు విప్పితే తాడేపల్లి కొంప కొల్లేరే

  • అందుకే విచారణకు వెళ్లకుండా ఏవో సాకులు

  • చివరికి సుప్రీంకోర్టులో కూడా దొరకని ఊరట

  • ఒకరిది ‘ఢిల్లీ’ సర్వీస్‌.. మరొకరిది సర్పంచ్‌గా

  • చేసిన చరిత్ర.. సీఎం కార్యదర్శి, ఓఎస్డీలుగా డ్యూటీ

  • జగన్‌ కోటరీలో కీలకం.. అరాచక మద్యం పాలసీలో ఈ ఇద్దరి వరకు వచ్చి ఆగిన దర్యాప్తు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు వారిదంతా హుంకరింపులు, ఘీంకరింపులే. ఎంతటివారినైనా సరే తమ పాదాక్రాంతం చేసుకుని అరాచకం చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని అటు అధికారులను, ఇటు పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, నేతలు, ప్రజాప్రతినిధులను బెదిరించి మరీ దారిలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు మద్యం స్కామ్‌లో పీకల్లోతున కూరుకుపోయారు. విచారణకు ఎలా డుమ్మా కొట్టాలా? అని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో ఒకరు జగన్‌ హయాంలో సూపర్‌బాస్‌గా వెలుగొందిన ధనుంజయ్‌రెడ్డికాగా, మరొకరు జగన్‌ వెన్నంటే ఉండి ఆయన సొంత వ్యవహారాలను చక్కబెట్టిన ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి.


అప్పట్లో బాసుల దర్పం

ధనుంజయ్‌రెడ్డిది తొలుత ఐ.ఎ.ఎస్‌. కాదు. ఢిల్లీ, అండమాన్‌ నికోబార్‌ ఐలాండ్స్‌ (డానిక్స్‌) సర్వీసుకు చెందిన ధనుంజయ్‌రెడ్డిని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏపీకి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. కడప జిల్లాకు చెందిన ఆయన వైఎస్‌ కోటరీలో కీలక అధికారిగా మారారు. ఆ తర్వాత ఆయనను ఐ.ఎ.ఎ్‌స.కు ఎంపిక చేయించారు. ఏపీలోనే పోస్టింగ్‌ ఇప్పించారు. జగన్‌ అధికారంలోకి వచ్చీరాగానే ధనుంజయ్‌రెడ్డిని ముఖ్యమంత్రి పేషీలోకి తీసుకున్నారు. సీఎం కార్యదర్శిగా నియమించారు. పేరుకే సీఎం కార్యదర్శిగానీ పెత్తనమంతా ఆయనదే అన్నట్లుగా కాలక్రమేణా ధనుంజయ్‌రెడ్డి హవా పెరిగిపోయింది. జగన్‌తో తనకున్న సాన్నిహిత్యంతో సకల అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట పట్టుకొని శాసించగలిగేలా ఎదిగారు. జగన్‌కు ఓఎ్‌సడీగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి తొలుత ప్రభుత్వ ఉద్యోగి. ఉద్యోగానికి రాజీనామా చేసి జగన్‌కు పీఏగా పనిచేశారు. గతంలో ఆయన సర్పంచ్‌గా చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్‌ ప్రకటన కూడా జరిగింది. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చాక కృష్ణమోహన్‌రెడ్డి హోదా పీఏ నుంచి ఓఎస్డీగా మారింది.

ఏదైనా సెటిలయ్యేది అక్కడే!

జగన్‌కు సంబంధించిన సెటిల్‌మెంట్లన్నీ వీళ్లద్వారానే జరిగాయని అప్పట్లో విస్త్రత ప్రచారం జరిగింది. జగన్‌ పేరిట కొన్ని, ఆయన పేరుచెప్పి చేసేవి కొన్ని అన్నట్లుగా ధనుంజయ్‌రెడ్డి వ్యవహారాలు ఉన్నాయని అప్పట్లో బహిరంగ విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఎంతటి పెద్ద పారిశ్రామికవేత్త అయినా, ఇంకా ఎంతపెద్ద నేత అయినప్పటికీ ధనుంజయ్‌రెడ్డి కాళ్లచుట్టూ తిరగాల్సిందే. ఆయన దర్శనం కూడా అంత సులువుగా దొరికేది కాదని చెబుతుంటారు. ధనుంజయ్‌రెడ్డి ఏది ఆదేశిస్తే అది జరిగిపోవాల్సిందే అన్నట్లుగా అధికారయంత్రాంగాన్ని నడిపించారు. ఆయన బాధితుల సంఖ్య వందలు, వేలల్లో ఉంటుందని చెబుతున్నారు. పదవిపోయాక ఆయన గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఒక్కసారిగా మద్యం స్కామ్‌లో ఈ మాజీ సూపర్‌బాస్‌ పేరు తెరపైకి వచ్చింది. జగన్‌ హయాంలో జరిగిన లిక్కర్‌ కుంభకోణంలో రూ.వేల కోట్లను అప్పటి పాలకులు సొంత ఖాతాల్లో వేసుకున్నారన్న ఆరోపణలపై సీఐడీ జరుపుతున్న విచారణలో ఒక్కరొక్కరి పేరు బయటకొస్తుంది.


ఆదేశాలు ఎక్కడినుంచి అందుకున్నారు?

మద్యం కుంభకోణంలో ప్రధానంగా సొంత బ్రాండ్లను తయారు చేయించడం, రాష్ట్రంలోని ప్రముఖ డిస్టిలరీలను బెదిరించి లాక్కోవడం కీలకమైన అంశాలు. ఇందులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డిల పాత్ర ఏ మేరకు ఉంది? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మద్యం ముడుపుల వ్యూహం ఖరారు, ఇతర కీలక సమావేశాల్లో తమతోపాటు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమెహన్‌రెడ్డి పాల్గొన్నారని ఈ కేసులో ఏ1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డితోపాటు పలువురు నిందితులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ ముడుపుల దందాను ఖరారు చేసే సమావేశాల్లో పాల్గొనాలని, ఆ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాలని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహ న్‌రెడ్డిలను ఎవరు ఆదేశించారో తేలాల్సి ఉంది. అది తేలకుండా లిక్కర్‌స్కామ్‌ దర్యాప్తు ముగిసినట్లు కాదు. దీంతో వీరిద్దరి వాంగ్మూలాలను నమోదుచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే, ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు సాధారణ వ్యక్తులుగా విచారణకు హాజరుకావడానికి ఆ ఇద్దరికి అహం అడ్డొస్తున్నట్లుంది. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు వీరు సమాధానాలు చెప్పాల్సి వస్తే, ఈ వ్యవహారంలో జగన్‌ పాత్ర కూడా నిర్ధారణ అవుతుంది. అదే జరిగితే తమకు మరిన్ని చిక్కులు తప్పవని ఆ ఇద్దరు భావిస్తున్నారు. దీంతో విచారణను ఎలా ఎగ్గొట్టాలా అని పథక రచన చేస్తున్నారని తెలిసింది. సుప్రీం కోర్టులో వీరికి ఎలాంటి వెసులుబాటు రానందున దర్యాప్తు సంస్థ వీరిని తక్షణ విచారణకు పిలిస్తే తప్ప ఈ కేసులో అసలు నిజాలేమిటో బయటకు రావని పోలీసువర్గాలే చెబుతున్నాయి.


ఊహించని షాక్‌

మద్యం కుంభకోణంలో తమ పేర్లు బయటకొచ్చాయని తెలియగానే ఆ ఇద్దరిలో వణు కు మొదలయింది. అర్జంటుగా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉండగానే ఆగమేఘాల మీద సుప్రీం కోర్టు తలుపుతట్టారు. అక్కడ కాదు పొమ్మనడంతో షాక్‌కు గురయ్యారు. హైకోర్టు ఏం చెబుతుందోనని తీక్షణంగా ఎదురుచూస్తున్నారు. నిజానికి వీరిద్దరికి లిక్కర్‌స్కామ్‌తోనే సంబంధాలున్నాయా? అంతవరకే వీరి పాత్ర పరిమితమైందా? అని ఆరాతీస్తే ఒక్కసారి వారి గత వైభవాన్ని పరిశీలిస్తే అసలు విషయాలు ఎన్నో బయటకొస్తాయి. జగన్‌ హయాంలో జరిగిన ఏ స్కామ్‌ను గురించి విచారించాలన్నా ఈ ఇద్దరే కీలకం అని పోలీసు అధికారులు భావిస్తున్నారు. శివుడు ఆజ్ఞలేకుండా చీమయినా కుడుతుందో లేదు కానీ ఈ ఇద్దరి ఆదేశం లేకుండా జగన్‌ ప్రభుత్వంలో ఏదీ జరగలేదన్నది పోలీసుల అభిప్రాయం. అనేక స్కామ్‌లతో పెనవేసుకుపోయిన ధనుంజయ్‌రెడ్డిని విచారించడానికి సిట్‌ అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరే కీలకం..

లిక్కర్‌స్కామ్‌లో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ల విచారణ తర్వాత అనేక మంది అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. మద్యం ముడుపుల వ్యవహారం ప్రస్తుతం ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల దగ్గర ఆగింది. ధనుంజయ్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకే తాము పనిచేశామని మద్యం కుంభకోణంలో ఇప్పటికే అరెస్టైయిన అనేక మంది వెల్లడించారు. నిజానికి ధనుంజయ్‌రెడ్డి పేరు చెప్పారంటే... దాన్ని జగన్‌ పేరు చెప్పడంగానే చూడాల్సి ఉంటుందని పోలీసువర్గాలు అనుమానిస్తున్నా యి. జగన్‌ చెబితేనే మద్యం ముడుపుల ఆదేశాలు ఇచ్చి ఉంటారని ఈ వర్గాలు సందేహిస్తున్నాయి. కాబట్టి ఈ జగన్‌ పాత్ర నిరూపించేందుకు ఈ ఇద్దరే కీలకం.

Updated Date - May 06 , 2025 | 03:46 AM