Free Bus Travel for Women: మహిళల ఉచిత ప్రయాణానికి రైట్ రైట్
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:40 AM
రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఇకనుంచి జీరో ఫేర్ టికెట్‌తో ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు...
ఫ్రీ బస్సుల్లో ఎక్కడికైనా ప్రయాణించండి
మహిళల చేతికి త్వరలోనే స్టీరింగ్ ఇస్తా
లేడీ కండక్టర్లను నియమించిందీ నేనే
ఇకపై కొనేవన్నీ విద్యుత్ బస్సులే
మహిళలు సులభంగా నడపవచ్చు: బాబు
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఇకనుంచి జీరో ఫేర్ టికెట్‌తో ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ బస్టాండ్‌లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ‘స్త్రీ శక్తి’ ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఉండవల్లి గుహల నుంచి విజయవాడ బస్టాండ్ వరకూ మహిళలతో కలిసి వారంతా ప్రయాణించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు రాష్ట్ర మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లభించిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 2.62కోట్ల మంది మహిళలు లబ్ధి పొందే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్లర్లను గతంలో తానే నియమించానని, త్వరలో మహిళా డ్రైవర్లు కూడా రాబోతున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో కొనేవన్నీ విద్యుత్ బస్సులేనని, మహిళలు ఆ బస్సుల్ని సులభంగా నడపవచ్చన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రం.’’ అని లోకేశ్ సూచించారు.


గొప్ప మైలురాయి..
‘‘టీడీపీ మహిళల పక్షపాతి. ఆడబిడ్డలకు ఆస్తిలో వాటా ఎన్టీఆర్ కల్పించారు. ఆర్థిక స్వావలంబన కోసం డ్వాక్రా సంఘాలను నేను తెచ్చాను. మహిళలకు ప్రధాని మోదీ చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ తీసుకు రావడం దేశంలోనే గొప్ప మైలురాయి. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు(2019-2024) మహిళలు ఆనందం, నవ్వు అన్నీ కోల్పోయారు. నాతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబంలోని ఆడవాళ్లు సైతం గత ప్రభుత్వ బాధితులే. ఎన్నికల్లో మీరు నన్ను ఆశీర్వదించారు.. నేను మీకు స్త్రీ శక్తి పథకం అమలు చేసి మీలో సంతోషాన్ని చూస్తున్నా..’’

ఆటోడ్రైవర్లకు ఇబ్బంది రానీయం
‘‘ఆడ బిడ్డలపై అఘాయిత్యాలకు కారణమైన గంజాయి, మత్తు పదార్థాల కట్టడికి ‘ఈగల్’ను రంగంలోకి దించా. గంజాయి అమ్మితే అదే వారికి ఆఖరి రోజు. ఆడబిడ్డల జోలికి ఎవరొచ్చినా, సోషల్ మీడియాలో కించపరుస్తూ పోస్టు పెట్టినా వదిలిపెట్టను. ఈ విషయంలో మంత్రి లోకేశ్ చేసిన సూచన (వెబ్ సిరీ్‌సలో మహిళల్ని అవమానించే వ్యాఖ్యల కట్టడి చట్టం)ను కూడా పరిశీలిస్తాం. అవసరమైతే చట్టం తీసుకొస్తాం. నేను ఏ మంచి పనిచేసినా అడ్డుకునేందుకు కొందరు(వైసీపీ నేతలను ఉద్దేశించి) కుయుక్తులు పన్నుతున్నారు. అటువంటి వారికి మీరే(ప్రజలు) బుద్ధి చెప్పాలి. ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బంది రానివ్వబోం. వారికి ఎలా న్యాయం చెయ్యాలనే విషయమై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. నివేదిక అందగానే సముచిత నిర్ణయం తీసుకుంటాం.’’

పులివెందుల ఓటర్లకు 30ఏళ్ల తర్వాత స్వేచ్ఛ
‘‘పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ముప్పై సంవత్సరాల తర్వాత ఓటేసినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ఒక ఓటరు ‘అందరికీ దండాలు’ అంటూ బ్యాలెట్ పేపర్‌తో పాటు చీటీ బాక్సులో వేశారు. దేశ ప్రజలకు 79ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వస్తే పులివెందుల ఓటర్లకు 30సం.తర్వాత ఓటేసే స్వాతంత్య్రం ఇప్పుడు లభించింది. ‘మా వివేకా సార్‌కు న్యాయం చేయండి’ అంటూ మరో వ్యక్తి చీటీ రాసి వేశారు... వివేకా కుటుంబానికి న్యాయం చేయాలా వద్దా? (సభికుల్ని చంద్రబాబు ప్రశ్నించగా, చేయాలి.. చేయాలి.. అంటూ గట్టిగా మహిళలు గళం కలిపారు.)’’
తల్లి, చెల్లికి న్యాయం చేశాకే మాట్లాడాలి: లోకేశ్
సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని వ్యక్తులు టీడీపీని, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి మంత్రి లోకేశ్ అన్నారు. ‘‘సొంత చెల్లితో రాఖీ కట్టించుకోరు కానీ మాటకు ముందు అక్క చెల్లెమ్మలు అంటారు. మమ్మల్ని ప్రశ్నించే ముదు తల్లి, చెల్లికి ఆయన సమాధానం చెప్పాలి. మా ఇంట్లో మహిళల్ని ఎంతగానో గౌరవిస్తాం. మా అమ్మను హెరిటేజ్ చూసుకోమని మా నాన్న చెప్పినప్పుడు ఆమె మొదట ఆఫీసులోకి వెళ్లలేక పోయారు.. ఎంత భయపడి వెనక్కి వచ్చినా ఆయన పదే పదే ప్రోత్సహించడంతో ఈ రోజు రూ. ఐదు వేల కోట్ల టర్నోవర్ కంపెనీని మా అమ్మ సమర్ధవంతంగా నడుపుతున్నారు. నా భార్య బ్రాహ్మణి స్టాన్ ఫోర్డ్‌లో చదువుకొని వచ్చి ఇప్పుడు వ్యాపారాలతో పాటు ఇంటిని చూసుకొంటున్నారు.. మహిళల్ని కించపరిచేలా వెబ్ సిరీ్‌సలలో వ్యాఖ్యలు ఉంటున్నాయి. వాటిని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం అవసరం.’’ అని లోకేశ్ సూచించారు.

మీ బస్సు టికెట్‌కు నేను డబ్బులిచ్చా
నా నియోజకవర్గానికి మీ నిధులు తీసుకుంటా!
డిప్యూటీ సీఎం పవన్‌తో లోకేశ్ సరదా వ్యాఖ్యలు
‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభం సందర్భంగా ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్‌కు రావడానికి మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ముందుగా బస్సు ఎక్కిన సీఎం చంద్రబాబు కండక్టర్ కె. దుర్గాభవాని దగ్గర టికెట్ తీసుకున్నారు. తర్వాత ఎక్కిన పవన్ ముందుకు వెళ్లబోతుండగా కండక్టర్ ‘టికెట్ సార్’ అని అడిగారు. పవన్ తన జేబులోంచి డబ్బులు తీస్తుండగా వెనక వచ్చిన లోకేశ్ ఆయన్ను వారించారు. నలుగురికీ తానే టికెట్ తీసుకుంటానంటూ కండక్టర్‌కు డబ్బులు ఇచ్చారు. సీఎం దగ్గర తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇచ్చేయాలని కోరారు. లోకేశ్ ఒత్తిడి చేయడంతో పవన్ నవ్వుకుంటూ ముందుకు కదిలారు. ఆ తర్వాత పవన్‌తో లోకేశ్ మాట్లాడారు. ‘మంగళగిరిలో మీ బస్సు టికెట్‌కు డబ్బులు నేనిచ్చాను. నా నియోజకవర్గ అభివృద్ధికి మీ నుంచి నిధులు తీసుకుంటా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరి మధ్యా నవ్వులు పూశాయి.

సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేస్తాం: పవన్
సూపర్ పథకాల అమలులో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిచూసి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు సాధ్యమేనా.. అని ముఖ్యమంత్రి చంద్రబాబును అప్పట్లో అడిగానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మనసుంటే మార్గం ఉంటుంది.. మాటిచ్చాం... అమలు చేసి తీరుతామని సీఎం అన్నారని, ఆయన అపారమైన అనుభవం, నిబద్ధతకు ఈ మాటలే నిదర్శనమన్నారు. ‘‘వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఓ వైపు ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దతూనే మరో వైపు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. మహిళా సాధికారత కోసం, ఆర్థిక స్వావలంబన కోసం ఉచిత ప్రయాణం అమలు చేయడం సంతోషంగా ఉందని, మహిళల భద్రత కోసం పటిష్ఠ చర్యలు చేపడతామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలతోపాటు కండక్టర్లకు బాడీ కెమెరాలు ఉంటాయని తెలిపారు. ‘‘కూటమిగా ఏర్పడి ఓట్లు అడిగాం.. మీరు మమ్మల్ని గెలిపించి బాధ్యత అప్పగించారు.. ప్రధాని మోదీ సహకారంతో చంద్రబాబు నాయకత్వంలో సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేస్తాం.’’ అని ధీమా వ్యక్తం చేశారు. ఉచిత బస్సు వల్ల ప్రతి నెలా రూ.1500నుంచి రెండు వేల వరకూ ప్రయాణ ఖర్చు మిగులుతుందని తనతోపాటు బస్సులో ప్రయాణించిన వారు చెబుతుంటే సంతోషం అనిపించిందన్నారు.

మహిళలు త్యాగమూర్తులు: మాధవ్
‘‘ప్రతి కుటుంబంలోనూ మహిళలు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని వారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. అలాంటి త్యాగమూర్తులకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, ఉచిత ప్రయాణం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటే అదే పెద్దవరంగా సీఎం చంద్రబాబు భావిస్తారని, మహిళా సాధికారత కోసం ఉచిత ప్రయాణం ఎంతగానో ఉపయోగ పడుతుందని మాధవ్ ఆనందం వ్యక్తం చేశారు.