Share News

CM Chandrababu: లెక్చరర్‌గా కాదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పా

ABN , Publish Date - Sep 05 , 2025 | 08:38 PM

తాను కూడా టీచర్ కావాల్సిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. లెక్చరర్‌గా చేరాలని యూనివర్సిటీ వీసీ తనను కోరారని చెప్పారు. కానీ తాను లెక్చరర్‌గా కాదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయనతో పేర్కొన్నానన్నారు.

CM Chandrababu: లెక్చరర్‌గా కాదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పా
AP CM Chandrababu

విజయవాడ, సెప్టెంబర్ 05: భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికి ఆదర్శప్రాయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి రోజు తాను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. టీచర్లను జీవితంలో ఎప్పుడూ మరచిపోలేమన్నారు. తాను కూడా టీచర్ కావాల్సిందన్నారు. లెక్చరర్‌గా చేరాలని యూనివర్సిటీ వీసీ తనను కోరారని తెలిపారు. లెక్చరర్‌గా కాదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయనకు తెలిపానని చెప్పారు.


హైదరాబాద్‌ను నెంబర్‌వన్‌గా చేసేందుకు తాను ఎంతో కష్టపడ్డానని పేర్కొన్నారు. ప్రపంచంలో తెలుగు వారు నెంబర్‌ వన్‌గా ఉండాలన్నదే తన కోరిక అని తెలిపారు. ఐఐటీ కోచింగ్‌ విషయంలో చుక్కా రామయ్య కచ్చితంగా ఉండేవారన్నారు. సీఎం సిఫార్సు చేసినా సీటు ఇవ్వబోనని ఆయన నిక్కచ్చిగా చెప్పేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అందుకే చుక్కా రామయ్య అంటే తనకు ఎంతో గౌరవం పెరిగిందని చెప్పారు.


10 వేలమంది దరఖాస్తు చేస్తే 100 మందికే ఐఐటీ శిక్షణ ఇచ్చేవారని.. అలా వందకు వంద మందినీ ఐఐటీకి ఆయన పంపేవారంటూ చుక్కా రామయ్యలోని విశిష్ట లక్షణాలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు. ఇక రాష్ట్ర విభజన కంటే కూడా గత పాలకుల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


జీఎస్టీ సంస్కరణలతో ప్రజల జీవితాల్లో కేంద్రం మార్పులు తెచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్‌ నెంబర్‌ వన్‌ అవుతుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోనే ఏపీ నెంబర్‌వన్‌గా మారాలనేదే తన లక్ష్యమన్నారు. రానున్న 22 ఏళ్ల పాటు మనమంతా దృష్టి పెడితే ఇది సాధ్యమే అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి

మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి

ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ, గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 05 , 2025 | 08:44 PM