Share News

Stree Shakti Scheme: సూపర్ సిక్స్.. సూపర్ హిట్: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 15 , 2025 | 05:43 PM

ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది తామేనని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరలో ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహిళలకు డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Stree Shakti Scheme: సూపర్ సిక్స్.. సూపర్ హిట్: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

విజయవాడ, ఆగస్టు 15: సూపర్ సిక్స్ అమలు చేస్తామంటే.. ఆనాడు ఎవరూ నమ్మలేదని.. ఇప్పుడు సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ (శుక్రవారం) విజయవాడలో స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించే ముందు మాట్లాడారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రమే తమ లక్ష్యమన్నారు. ఆడబిడ్డల గౌరవం పెంచేందుకు ఎన్డీయే ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. ఆడబిడ్డలకు మంచి చేశామనే తృప్తి కలుగుతోందన్నారు. రాష్ట్రమంతా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. ఈ పథకం ద్వారా 2.64 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం దూసుకెళ్తామన్నారు.


ఏపీ పునర్నిర్మాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు నవ్వడమే మర్చిపోయారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ పాలనలో ఇంటా, బయటా ప్రజలకు ఆనందం లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. వారి హయాంలో రోడ్డు మీదకు వస్తే తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తామన్న నమ్మకం ఉండేదా? అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే తాట తీస్తానని హెచ్చరించారు. మహిళలను కించపరిచే వారిని వదిలిపెట్టేది లేదని కుండబద్దలు కొట్టారు. ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేక చట్టం తెచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మహిళా సాధికారత కోసమే డ్వాక్రా, మెప్మా సంఘాలు ఏర్పాటు చేశానన్నారు.


ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది తామేనని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. త్వరలో ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలకు డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి 'తల్లికి వందనం' ఇస్తున్నామన్నారు. అయితే రాజకీయాల్లో ప్రజా చైతన్యం చాలా అవసరమని తెలిపారు. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తున్నామని వివరించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇక ఆర్టీసీకి ఆదాయ మార్గాలు పెంచేందుకు చర్యలు సైతం చేపడుతున్నట్లు వివరించారు. ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే కొంటామని.. అవి కూడా ఏసీ బస్సులేనని చెప్పారు. ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు.


వైసీపీ హయాంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారంటూ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికేవని గుర్తు చేశారు. ఏం చేసినా వెనక్కి లాగేందుకు చాలా మంది చూస్తున్నారన్నారు. అమరావతిని ఎడారి అన్నారని.. శ్మశానం అన్నారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సైతం పూర్తి చేస్తామని ప్రకటించారు. పులివెందులలో 30 ఏళ్ల తర్వాత అక్కడి స్థానికులు ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పుకొచ్చారు. తద్వారా పులివెందుల ప్రజలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.


డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు సైతం చేపడుతున్నట్లు ఆయన వివరించారు. మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని వివరించారు. ఉచిత బస్సు పథకం హామీని నెరవర్చగలమా? అని సందేహించామని.. కానీ సీఎం చంద్రబాబు కమిట్‌మెంట్‌కు ఈ పథకం అమలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.'స్త్రీ శక్తి' పథకానికి 8,450 బస్సులు సిద్ధం చేశామని వివరిచారు. గత ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థను సరిచేస్తూ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కవిత

ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..

For Mora AP News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 07:03 PM