Share News

CM Chandrababu Announces Super Six: సూపర్‌సిక్స్‌ సూపర్‌ హిట్‌

ABN , Publish Date - Aug 16 , 2025 | 04:19 AM

సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలుకాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు....

CM Chandrababu Announces Super Six: సూపర్‌సిక్స్‌ సూపర్‌ హిట్‌

సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థమిచ్చాం

  • మా సంక్షేమానికి సాటి లేదు.. అభివృద్ధికి అడ్డులేదు: సీఎం

  • 64 లక్షల మందికి ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు

  • రూ.10 వేల కోట్లతో తల్లికి వందనం

  • అన్నదాతల ఖాతాల్లో 3,173 కోట్లు జమ

  • 2,684 కోట్లతో 2 కోట్ల రాయితీ సిలిండర్లు

  • ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

  • ఈ నెలాఖరుకు 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ

  • ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేశాం

  • ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు 10 వేలు

  • అర్చకుల వేతనాలు రూ.15 వేలకు పెంచాం

  • నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలు చేశాం

  • గీత కార్మికులకు 10ు మద్యం షాపులు, బార్లు

  • మత్స్యకారులకు రూ.259 కోట్ల సాయం

  • చేనేతకు అండగా ఉచిత కరెంటు

  • ఇమామ్‌లకు రూ.10 వేలు.. మౌజన్లకు 5 వేలు

  • ఎస్సీ వర్గాలకు నష్టం లేకుండా వర్గీకరణ

అమరావతి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలుకాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్‌ సిక్స్‌ను సూపర్‌ హిట్‌ చేశామని ప్రకటించారు. శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలోని తెలుగువారందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు. అభివృద్ధికి అడ్డులేదు.. సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డు.. ఇదే ఆల్‌టైం రికార్డు’గా అభివర్ణించారు. ఎన్టీఆర్‌ భరోసా కింద 64 లక్షల మందికి ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేస్తూ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చామన్నారు. పేదింటి తల్లులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు రూ.10వేల కోట్లతో తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చామన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో మొదట విడతగా రాష్ట్రప్రభుత్వం రూ.5వేలు, కేంద్రం ఇచ్చిన రూ.2వేలు కలిపి మొత్తం రూ.7వేల చొప్పున రూ.3,173 కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, రూ.2,684 కోట్లు ఖర్చుతో 2కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ‘స్త్రీశక్తి’ పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుకగా ఇస్తున్నామని చెప్పారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించామని.. ఈ నెలాఖరుకు నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దుచేశామని గుర్తుచేశారు. 204 అన్న క్యాంటీన్లలో 5.16కోట్లమందికి రూ.5కే కడుపు నింపుతున్నామని చెప్పారు. 6 వేలకు పైగా ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు రూ.10వేల చొప్పున విడుదల చేస్తున్నామని తెలిపారు.

dsf.jpg


అర్చకుల వేతనాలను రూ.15 వేలకు పెంచామని, ఆలయాల్లో అన్యమతస్థులు లేకుండా చూస్తున్నామన్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణుల కనీస వేతనం రూ.25వేలకు పెంచామని.. దేవాలయ ట్రస్టు బోర్డుల్లో వారికి చోటు కల్పించామన్నారు. 40వేల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని తెలిపారు. కల్లుగీత కార్మికులకు 10శాతం మద్యం షాపులు, బార్లు కేటాయించామని చెప్పారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా 1,29,178 మందికి రూ.259 కోట్లు అందించామని తెలిపారు. చేనేతకు నెలకు 200యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చామన్నారు. ‘అడవితల్లి బాటలో’ కార్యక్రమం ద్వారా రూ.1,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్లకు 5వేల చొప్పున గౌరవవేతనం ఇస్తున్నామన్నారు. సోషల్‌ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తున్నామని, మహిళల ఆత్మగౌరవం కాపాడుతున్నామని తెలిపారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే...

Sfdb.jpg

గ్రోత్‌ ఇంజన్లుగా నగరాలు, పట్టణాలు..

నగరాలు, పట్టణ ప్రాంతాలను రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్లుగా అభివృద్ధి చేస్తున్నాం. భవన నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేశాం. 100 గజాల్లోపు స్థలాల్లో బిల్డింగ్‌ ప్లాన్‌ లేకుండానే ఇంటిని నిర్మించుకునే అవకాశం కల్పించాం. పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగిస్తున్నాం. ఇప్పటివరకు 9ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశాలు నిర్వహించి రూ.5.94 లక్షల కోట్ల విలువైన 113 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాం. వీటి ద్వారా 5.56 లక్షల ఉద్యోగాలు వస్తాయి. గూగుల్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాం. ఇప్పటి వరకు 1.5 కోట్ల టన్నుల ఇసుక అందించాం. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే మద్యం పాలసీని రూపొందించాం. నాణ్యమైన, బ్రాండెడ్‌ మద్యం విక్రయాలు జరిగేలా చూస్తున్నాం. మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా 700 పౌరసేవలు అందిస్తున్నాం. అత్యంత పేదరికంలో ఉన్న వారిని ఆదుకునేందుకు తీసుకొచ్చిన కార్యక్రమం జీరో పావర్టీ-పీ4. ఉన్నతస్థాయిలో ఉన్న 10 శాతం మంది అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనిచ్చి పైకి తీసుకురావడమే దీని ముఖ్యోద్దేశం.


3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా..

మోదీ నాయకత్వంలో త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నాం. మనది డెడ్‌ ఎకానమీ కాదు, గుడ్‌ ఎకానమీ. సైనిక శక్తిలోనూ మనమేంటో ఆపరేషన్‌ సిందూర్‌తో నిరూపించాం. శత్రుదేశాలు తూటాలు పేల్చితే.. మిస్సైళ్లతో బదులిచ్చిన మన త్రివిధ దళాలకు జైకొడదాం. మోదీ వికసిత్‌ భారత్‌-2047 విజన్‌ రూపొందించారు. మనం స్వర్ణాంధ్ర-2047 విజన్‌ను రూపొందించాం. 2047 నాటికి భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలుస్తుంది.

గ్రామ స్వరాజ్యం దిశగా..

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్మాగాంధీ మాటలు మాకెప్పుడూ ఆచరణీయం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అత్యధికంగా రూ.5,211 కోట్లు ఖర్చు పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో 4 వేల కి.మీ సీసీ రోడ్లు, 250 కి.మీ బీటీ రోడ్లు నిర్మించాం. 2028 నాటికి జల్‌జీవన్‌ మిషన్‌ కింద ప్రతి పల్లెకు, ప్రతి గడపకు సురక్షిత తాగునీరు అందిస్తాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ మా విధానం. ప్రివెంటివ్‌, క్యూరేటివ్‌, కాస్ట్‌ ఎఫెక్టివ్‌, రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ విధానాలతో ప్రజారోగ్యానికి సంజీవనిగా వైద్యశాఖను తీర్చిదిద్దాం. సీఎం సహాయ నిధి నుంచి రూ.552 కోట్లు అందించాం. సూపర్‌ సిక్స్‌, మేనిఫెస్టో అమలుతో ప్రజల జీవనప్రమాణాలు మారుస్తున్నాం.

XFHB.jpg

Updated Date - Aug 16 , 2025 | 07:37 AM