Tirupati River Tragedy: స్వర్ణముఖి నది విషాదం.. మరొకరి డెడ్‌బాడీ లభ్యం
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:59 AM
ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభించాయి. మరో చిన్నారి మునిచంద్ర కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తిరుపతి, అక్టోబర్ 25: తిరుపతి వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదిలో నిన్న (శుక్రవారం) జరిగిన దుర్ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నదిలో గల్లంతైన చిన్నారుల కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న బాలు అనే బాలుడి మృతదేహం లభ్యమవగా.. ఈరోజు ప్రకాష్, తేజు డెడ్‌బాడీలు లభించాయి. దీంతో ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభించాయి. మరో బాలుడు మునిచంద్ర కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా రెస్క్యూ బృందాలతో కలిసి బోటులో వెళ్లి స్వర్ణముఖి నదిలో గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.
ఈ ఘటనపై తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. చిన్నారుల కోసం స్వర్ణముఖి నదిలో గాలింపు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే నాని సంఘటనా స్థలంలో స్వయంగా పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలను పటిష్ఠంగా కొనసాగించేందుకు నిరంతర మార్గదర్శకాలు ఇస్తున్నారన్నారు. ఎస్పీ స్వయంగా రక్షణ చర్యలను సమీక్షిస్తూ, ప్రతి చిన్న అవకాశం వదలకుండా గాలింపు చర్యలను నిరంతరాయంగా కొనసాగించాలని సూచించారని తెలిపారు.
ఆయన ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, ఫైర్ సర్వీస్ బృందాలు కలిసి రాత్రంతా గాలింపు చర్యలను చేపట్టాయన్నారు. డ్రోన్‌ల సాయంతో నదీ పరిసర ప్రాంతాలను విస్తృతంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్ర విచారం వ్యక్తం చేశారని.. బాధిత కుటుంబాలకు పూర్తి సహాయాన్ని అందిస్తామని తెలిపారని పోలీసులు పేర్కొన్నారు.
కాగా.. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం అగ్రహారం గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు నిన్న (శుక్రవారం) సాయంత్రం స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లారు. నీళ్లలో ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో ప్రకాశ్ (17), మునిచంద్ర అలియాస్ చిన్న (15), తేజు (19), బాలు (16) కొట్టుకుపోగా.. కృష్ణ, విష్ణు, మునికృష్ణ క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి..
ప్రమాదానికి ముందు బైకర్ ఏం చేశాడో తెలుసా?
కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!
Read Latest AP News And Telugu News