Tirupati Bomb Threat: తిరుపతికి ఉగ్ర బెదిరింపులు.. విస్తృత తనిఖీలు
ABN , Publish Date - Oct 03 , 2025 | 02:20 PM
అప్రమత్తమైన పోలీసులు తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, గోవిందరాజుల స్వామి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. జడ్జిల నివాస సముదాయం, కోర్టు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
తిరుపతి, అక్టోబర్ 3: తిరుపతిలో ఉగ్రవాదుల బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతోంది. ఉగ్రవాదుల బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో బాంబు డిస్పోజల్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రెండు అనుమానాస్పద మెయిల్స్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తమిళనాడు కేంద్రంగా ఐఎస్‌ఐ, మాజీ ఎల్‌టీటీఈ మిలిటెంట్లు కుట్ర పన్నినట్లు బెదిరింపులు చేస్తూ గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్ పంపారు. తిరుపతిలో నాలుగు ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలను పేల్చబోతున్నట్లు బెదిరింపులకు దిగారు.
ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, గోవిందరాజుల స్వామి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. జడ్జిల నివాస సముదాయం, కోర్టు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నెల 6న సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తిరుపతి పర్యటన నేపథ్యంలో వ్యవసాయ కళాశాల హెలిప్యాడ్ వద్ద తనిఖీలు చేశారు. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాల్లోనూ బీడీ టీమ్స్ సోదాలు నిర్వహించింది. తిరుపతికి బాంబు బెదిరింపు రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాటిని నమొద్దు: ఎస్పీ
బాంబు బెదిరింపులపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. ఈ మెయిల్స్ ద్వారా వివిధ రాష్ట్రాలలో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయన్నారు. కొద్ది రోజుల క్రితం తిరుపతి జిల్లాకు కూడా ఇలాంటి బెదిరింపు ఈ మెయిల్ వచ్చిందని అన్నారు. బెదిరింపుల నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మెయిల్స్ సమాచారంపై కేసు నమోదు చేసి.. తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భక్తులు, ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని.. అపోహలు, ఊహాగానాలను నమొద్దని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు.
ఇవి కూడా చదవండి...
దసరా ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రిపై అరుదైన రికార్డ్
మలేషియా ప్రతినిధులతో నారాయణ కీలక భేటీ
Read Latest AP News And Telugu News