Share News

Tirumala Brahmotsav 2025: తిరుమలలో శ్రీవారి గరుడ సేవ.. మాడవీధుల్లో కిక్కిరిసిన భక్తులు..

ABN , Publish Date - Sep 28 , 2025 | 08:20 PM

శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఐదో రోజు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు.. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Tirumala Brahmotsav 2025: తిరుమలలో శ్రీవారి గరుడ సేవ.. మాడవీధుల్లో కిక్కిరిసిన భక్తులు..

తిరుమల, సెప్టెంబర్ 28: శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఐదో రోజు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు సాయంత్రం గరుడ వాహన సేవ ప్రారంభమైంది. మాడవీధుల గ్యాలరీల్లోకి దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు చేరుకున్నారు. స్వామివారి దర్శించుకుని పులకించిపోయారు. మరోవైపు భక్తుల తాకిడితో తిరుపతిలోని అలిపిరి ప్రాంతం, తిరుమలలోని భక్తుల కాటేజీల ప్రాంతాలు భారీగా వాహనాలతో నిండిపోయాయి.


ఇక శ్రీవారి మూలవిరాట్టుకు అలంకరించే లక్ష్మీహారం, మకరకంఠి ఆభరణాలను ఏడాదిలో ఒక్కసారి.. అంటే గరుడ సేవ రోజు ఉత్సవమూర్తి శ్రీమలయప్పస్వామికి అలంకరిస్తారు. కాగా, ఇవాళ ఉదయం స్వామి వారు సర్వాలంకార భూషితుడై మోహినీ అవతారంలో భక్తులను తన్మయపరిచారు. పద కవితా పితామహుడు అన్నయమ్య సైతం కలియుగవైకుంఠనాథుని గరుడ సేవ వైభవాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ గరుడ సేవలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


తిరుమల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఇవి. వీటిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ బ్రహ్మోత్సవాలకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కరెంట్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. స్పందించిన బండారు విజయలక్ష్మీ

For More AP News And Telugu News

Updated Date - Sep 28 , 2025 | 10:07 PM