Vaikuntha Ekadashi: తిరుమలకు ఫ్యామిలీతో సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:34 AM
తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామి వారిని తన కుటుంబంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. అందుకోసం సోమవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తిరుమల చేరుకోనున్నారు.
తిరుపతి, డిసెంబర్ 29: వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమలలో కొలువు తీరిన శ్రీవెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం దర్శించుకోనున్నారు. అందుకోసం సోమవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకోన్నారు. సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంటకు చేరుకోనున్నారు.
అనంతరం తిరుమలలో పద్మావతి అతిథి గృహానికి చేరుకోనున్నారు. మంగళవారం తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా దేవాలయంలోకి ప్రవేశించి.. ఆ దేవదేవుడిని సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకోనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
మరోవైపు వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా ప్రతినిధులు, న్యాయమూర్తులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తిరుమల తరలి రానున్నారు. ఇక రాష్ట్రంలోని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, శానసమండలి చైర్మన్ మోషెస్ రాజు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు.. దాదాపు 80 మందికిపైగా ప్రముఖులు తిరుమల వస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ అధికారులకు సమాచారం అందింది.
ఇంకోవైపు సోమవారం అర్థరాత్రి తిరుమలలోని శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. దాంతో 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను సైతం టీటీడీ రద్దు చేసింది. మొదటి మూడు రోజులు కేవలం టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనాని టీటీడీ కల్పించనుంది.
ఇక జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టికెట్, టోకెన్స్ కలిగిన భక్తులతో పాటు సర్వ దర్శనం క్యూ లైన్ ద్వారా భక్తులను ఈ దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ రోజు అర్ధరాత్రి 12.05 నిమిషాలకు శ్రీవారి ఆలయాన్ని అర్చకులు తెరవనున్నారు. పూజది కైంకర్యాలు ముగిసిన అనంతరం వేకువజామున 1.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.
మంగళవారం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ద్వారా సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది. ఉదయం 9 గంటలకు స్వర్ణ రధంపై ఆలయ తిరు విధుల్లో ఊరేగుతూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో భక్తులకు ఉత్సవ మూర్తులు దర్శనం ఇవ్వనున్నారు. అందుకోసం ఇప్పటికే టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అసెంబ్లీ చేరుకున్న కేసీఆర్.. స్వాగతం పలికిన పార్టీ ఎమ్మెల్యేలు
చలితో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి
For TG News and Telugu News