Mayor Murder Case: మేయర్ దంపతుల హత్య కేసులో విచారణ పూర్తి.. కోర్టు సంచలన నిర్ణయం
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:14 PM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు నగర మేయర్ దంపతులు హత్య కేసు విచారణ పూర్తయింది. ఈ కేసులో నిందితులను కోర్టు గుర్తించింది.
చిత్తూరు, అక్టోబర్ 24: రాష్ట్రవాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురు ప్రధాన ముద్దాయిలపై నేరం రుజువు అయిందని ప్రత్యేక మహిళా కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ప్రత్యేక మహిళా కోర్టు శుక్రవారం పూర్తి చేసింది. ఈ కేసులో దోషులకు అక్టోబర్ 27వ తేదీన శిక్షలు ఖరారు చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకోవాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులను ప్రత్యేక మహిళా కోర్టు ఆదేశించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
2015, నవంబర్ 15వ తేదీన చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ అనురాధపై కొంత మంది విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కాల్పు శబ్దం విని కార్యాలయంలోకి ఆమె భర్త, మున్సిపల్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కఠారి మోహన్ .. మేయర్ ఛాంబర్‌లోకి వచ్చారు. ఇంతలో దుండగులు ఆయనపై ఆయుధాలతో దాడి చేశారు. ఆయన పరిగెత్తారు. ఆ క్రమంలో దుండగులు కత్తులతో ఆయనపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ని తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దీంతో మేయర్ అనురాధ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో మేయర్ అనురాధ భర్త మోహన్ మేనల్లుడు చింటూ ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడని తేల్చారు. అతడితోపాటు మరో 23 మంది నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ పదేళ్లలో ఈ హత్య కేసులో దాదాపు 122 మంది సాక్షులను విచారించి.. నిందితులను కోర్టు గుర్తించింది.
మరోవైపు ఈ కేసులో తుది తీర్పు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అంవాఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు నగరంతోపాటు కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బస్సు దగ్ధం.. వి కావేరి ట్రావెల్స్ సంచలన నిర్ణయం
పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్..
For More TG News And Telugu News