Share News

Chittoor Rains: చిత్తూరులో భారీ వర్షాలు.. ప్రజలకు అధికారులహెచ్చరికలు

ABN , Publish Date - Oct 22 , 2025 | 10:59 AM

వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి గ్రామస్తులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

Chittoor Rains:  చిత్తూరులో భారీ వర్షాలు.. ప్రజలకు అధికారులహెచ్చరికలు
Chittoor Rains

చిత్తూరు, అక్టోబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Chittoor Rains) కురుస్తున్నాయి. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణాపురం జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు రెండు ప్రాజెక్టుల్లోనూ రెండు గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేశారు. వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి గ్రామస్తులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.


భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు నగరంలోని నీవా నది లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, కళాశాలలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తోంది జిల్లా యంత్రాంగం. పది రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూరగాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.


కాగా.. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు మధ్యాహ్ననికి నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈరోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదని.. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. పొంగిపోర్లే వాగులు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2025 | 11:06 AM