Chandrababu: నకిలీ మద్యం కేసులో మూలాల్లోకి పోతే షాకింగ్ వార్తలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 12 , 2025 | 07:49 PM
నకిలీ మద్యం కేసులో మూలాల్లోకి పోతే షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. అందుకే దీనిపై మరింత విచారణ కోసం సిట్ వేస్తున్నాం. దీంతో దీని వెనుక ఉన్న ఆఫ్రికా లింకులు కూడా బయటకు వస్తాయి. మళ్ళీ ఇలాంటి నేరాలు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తా..
అమరావతి, అక్టోబర్ 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్తీ మద్యం.. వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వ సంపదగా వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ వైపు గంజాయ్, మరోవైపు కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేశారని సీఎం మండిపడ్డారు. జగన్ నేతృత్వాన వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాల్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. కల్తీ మద్యాన్ని చట్టబద్ధం చేసి మరీ, గత పాలకులు నేర సామ్రాజ్యం సృష్టించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్తీ మద్యం నివారణకు సిట్, గంజాయ్ నివారణకు ఈగల్ బృందాలు ఏర్పాటు చేసి కట్టడి చేశామని చంద్రబాబు చెప్పారు. ఇంత చేస్తున్నా కొందరు కాదని బరితెగిస్తే చూస్తూ ఊరుకుంటామా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నేరస్థులు ఏ ముసుగులో వచ్చినా కట్టడి చేసి తీరుతామన్నారు. ఎంతటి వారైనా, ఎవరైనా ఉపేక్షించేది లేదని.. కల్తీ మద్యం నివారణ దిశగా ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ను అందుబాటులోకి తెచ్చామని చంద్రబాబు తెలిపారు. ప్రతీ మద్యం బాటిల్‌పై ఉండే లేబుల్‌ని స్కాన్ చేయటం ద్వారా మద్యం నాణ్యత తెలుసుకునేలా యాప్ రూపకల్పన చేశామని చంద్రబాబు వెల్లడించారు. వ్యవస్థ ప్రక్షాళన దిశగా ఉత్తమ విధానాలు అందుబాటులోకి తెచ్చామన్నారు చంద్రబాబు.
'రాజకీయ ముసుగు తొడుక్కొని నేరాలు చేయాలని చూస్తున్నారు. నా దగ్గర అలాంటి వాళ్ల ఆటలు సాగవు. నకిలీ మద్యంపై సిట్ ఏర్పాటు చేస్తున్నాం. నకిలీ మద్యం తయారీకి చెక్ పెట్టేందుకు టెక్నాలజీ తీసుకువస్తున్నాం. ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ అందుబాటులోకి తెస్తున్నాం. మద్యం నాణ్యత తెలుసుకునేలా యాప్ ఏర్పాటు చేస్తున్నాం. హోలోగ్రామ్ స్కాన్ చేస్తే బ్యాచ్ నంబర్, మద్యం క్వాంటిటీ, ధరలు వంటి పూర్తి వివరాలు వస్తాయి' అని చంద్రబాబు అన్నారు.
అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. లిక్కర్ అంశంతో సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. 'కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం ఒకటి. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఏరులై పారించి లీగలైజ్ చేసింది. గంజాయిని వాణిజ్య పంటగా భావించి గత పాలకులు పండించారు. గంజాయి సరఫరా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను ప్రక్షాళన చేయడం ప్రారంభించాం. గత ప్రభుత్వంలోని పెద్దలు.. తమకు సంబంధించిన మనుషులకు చెందిన కంపెనీల బ్రాండ్లనే అమ్మారు. బలవంతంగా డిస్టలరీలను హ్యండోవర్ చేసుకున్నారు.. ఓ నేర సామ్రాజ్యాన్ని సృష్టించారు.
గత ప్రభుత్వంలో జరిగిన మద్యం దోపిడీపై సిట్ వేశాం. విచారణ జరగుతోంది. మద్యం విషయంలో కొందరు ఇంకా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు. నేరాలు చేయడం.. ఎదుటి వారిపై ఆ నేరాల్ని మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం.. కంట్రోల్లో పెడతాం. గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రానికి వచ్చేది. గత పాలనలో నాణ్యమైన మద్యం లేకపోవడం.. ధరలు విపరీతంగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోడానికి చాలా మంది ప్రయత్నించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బెస్ట్ మద్యం పాలసీ తెచ్చాం' అని చంద్రబాబు అన్నారు.
'శవరాజకీయాలు చేయటంలో ఆరితేరిన వారు కుట్రలకు యత్నిస్తున్నారు. తండ్రి చనిపోతే ఆ శవం నుంచే రాజకీయం మొదలుపెట్టిన వారు బ్లూ మీడియాని అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారాలకు తెరలేపారు. రాజకీయం కోసం ఎలాంటి కుట్రలు పన్నినా ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ విశ్వసనీయత ఎవరు దెబ్బతీయాలని చూసినా చూస్తూ ఊరుకోం. ఎక్సైజ్ అధికారులు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకుంటే ఇబ్బందులు పడతారు. అస్తవ్యస్తం చేసిన శాఖను సమగ్ర ప్రక్షాళన దిశగా ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ చర్యల్ని పరీక్షిద్దామని అనుకుని బలిపశువులు కావొద్దు' అని చంద్రబాబు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News