Share News

Chandrababu Naidu : వారసత్వం ఒక్కటే అన్నీ ఇవ్వలేదు!

ABN , Publish Date - Jan 24 , 2025 | 05:00 AM

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు వారసుడు ఎవరు..? దావోస్‌లో మీడియా ప్రతినిధుల నుంచి ఎదురైన ఈ ప్రశ్నకు ఆయన నేర్పుగా సమాధానమిచ్చారు.

Chandrababu Naidu : వారసత్వం ఒక్కటే అన్నీ ఇవ్వలేదు!

  • మెరుగైన అవకాశాలు రావొచ్చు.. వాటినెలా అందిపుచ్చుకుంటారన్నదే ముఖ్యం

  • 33 ఏళ్ల కిందట కుటుంబ వ్యాపారానికి శ్రీకారం.. అందులో ఉంటే లోకేశ్‌కు సులభంగా ఉండేది

  • కానీ ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు.. ఇందులో వారసత్వం లేనేలేదు: చంద్రబాబు

అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు వారసుడు ఎవరు..? దావోస్‌లో మీడియా ప్రతినిధుల నుంచి ఎదురైన ఈ ప్రశ్నకు ఆయన నేర్పుగా సమాధానమిచ్చారు. ‘ఇండియా టుడే’ ప్రతినిధి ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఈ ప్రశ్న వచ్చింది. రెండ్రోజుల ముందు ఇదే అంశంపై మంత్రి టీజీ భరత్‌ వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రితో అక్షింతలు వేయించుకున్నారు. రెండ్రోజుల తర్వాత మళ్లీ ఇదే ప్రశ్న ఎదురైంది. లోకేశ్‌ మీ వారసుడేనా.. వారసుడే అయితే పార్టీ పగ్గాలు ఎప్పుడు అప్పగిస్తారని అడుగగా.. ఆయన సూటిగా జవాబివ్వకుండా గతంలో చెప్పిన మాటలే పునరుద్ఘాటించారు. ‘వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం.. ఏ రంగంలో అయినా వారసత్వం అనేది మిథ్య. ఒక తరం వ్యాపార రంగంలో రాణించి బాగా సంపాదిస్తే తర్వాతి తరం దానిని పోగొట్టవచ్చు. మన దేశంలో ఒకప్పుడు బలమైన పార్టీలుగా ఉన్నవి తర్వాత కనుమరుగైపోయాయి. వారసత్వం ఒక్కటే అన్నీ నిలబెట్టలేదు. దానివల్ల కొన్ని మెరుగైన అవకాశాలు వస్తాయి. వాటినెలా అందిపుచ్చుకుంటారన్నది ముఖ్యం. సరైన పద్ధతిలో అందుకుంటేనే రాణించగలుగుతారు. నేనెప్పుడూ జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదు. 33ఏళ్ల కిందట కుటుంబ వ్యాపారం ప్రారంభించాను. నా కుటుంబసభ్యులు దానిని నిర్వహిస్తూ వచ్చారు. అదే వ్యాపారంలో కొనసాగితే లోకేశ్‌కు చాలా తేలిగ్గా ఉండేది. కానీ తను ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. అందులో ఆయనకు సంతృప్తి లభిస్తోంది. ఇందులో వారసత్వం ఏమీ లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో చేరే ఆలోచన తనకు లేనే లేదని, రాష్ట్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రతిభ, పనితీరుతోనే లోకేశ్‌ వారసుడిగా ఎదగాలి తప్ప తన కొడుకు అన్న ఒకే ఒక్క కారణంతో వారసుడు కాలేడన్న అభిప్రాయం చంద్రబాబు మాటల్లో ధ్వనించిందని టీడీపీ సీనియర్‌ నేతలు చెబుతున్నారు.


గతంలో ఇలా..

టీడీపీలో వారసత్వంపై గతంలో కూడా కొన్నిసార్లు చర్చ జరిగింది. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో.. 1987 మండల పరిషత్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన, ఆయన కుమారుడు బాలకృష్ణ పాల్గొన్నారు. ఇద్దరికీ భారీ జన సమూహాలు వచ్చాయి. ఆ ఆనందంతో ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఒక సభలో తన రాజకీయ వారసుడు బాలకృష్ణేనని ప్రకటించారు. కానీ హైదరాబాద్‌ తిరిగి వచ్చిన తర్వాత పార్టీ నేతల సలహాతో ఆ అభిప్రాయం మార్చుకున్నారు. తాను అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని మీడియాతో చెప్పారు. ఆయన ప్రకటన చేసిన చోట జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓడిపోవడం విశేషం. అలాగే 2014 ఎన్నికలకు ముందు నందమూరి హరికృష్ణ తమ కుటుంబంలో వారసత్వం గురించిన చర్చ లేవనెత్తారు. తన కుమారుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను రాజకీయ వారసుడిగా ప్రకటించాలని చంద్రబాబుపై గట్టి ఒత్తిడి తెచ్చారు. కానీ ఆయన అటువంటి ప్రకటన చేయడానికి అంగీకరించలేదు. ఇప్పుడు అనుకోకుండా టీడీపీలో ఇదే చర్చ మరోసారి మొదలైంది. కానీ ప్రారంభంలోనే చంద్రబాబు అడ్డుకట్ట వేయడంతో అది చల్లారిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి...

Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం

Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 05:00 AM