CM Chandrababu : త్వరలో తల్లికి వందనం
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:24 AM
రతనాల రాయలసీమను చేసి చూపిస్తామని చంద్రబాబు తెలిపారు. దీనికోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉద్యాన, వ్యవసాయ రంగాలను మేళవిస్తామని చంద్రబాబు తెలిపారు. ‘
అన్నదాత సుఖీభవకూ నిధులు
చెప్పినదాని కంటే ఎక్కువే చేస్తాం
బనకచర్లతో ప్రతి ఎకరాకూ నీళ్లు
రతనాల రాయలసీమ చేసి చూపిస్తా
వాట్సాప్ పాలన ఆలోచన లోకేశ్‌దే: సీఎం
అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో పింఛన్ల పంపిణీ
‘‘యువగళం పాదయాత్ర సమయంలో లోకేశ్ ఆలోచనల నుంచి వచ్చిందే వాట్సాప్ గవర్నెన్స్. దీని ద్వారా పౌరులకు 161 ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాం. ఇంట్లో ఎందరు పిల్లలుంటే, అందరికీ తల్లికి వందనం త్వరలో అందిస్తాం. కేంద్రం ఇచ్చే నిధులను కలుపుకొని అన్నదాత సుఖీభవ కింద మేనెల నుంచి రూ.20వేలు ఇస్తాం. చెప్పినదాని కంటే ఎక్కువే చేసి చూపిస్తాం. ప్రజల రుణం తీర్చుకుంటాం’’
- సీఎం చంద్రబాబు
రాయచోటి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): గోదావరి- బనకచర్ల అనుసంధానంతో రాయలసీమలోని ప్రతి ఎకరానికీ నీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రతనాల రాయలసీమను చేసి చూపిస్తామని తెలిపారు. దీనికోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉద్యాన, వ్యవసాయ రంగాలను మేళవిస్తామని చంద్రబాబు తెలిపారు. ‘‘గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసింది. 2019లో మేం తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే.. ఏడాదిలోనే హంద్రీనీవా సుజల స్రవంతిని పూర్తి చేసేవాళ్లం. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం పైసా ఖర్చు చేయలేదు. దీంతో ఈ ప్రాంతం ఎడారిలాగా మారిపోయింది. త్వరలోనే తంబళ్లపల్లె నుంచి శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు ఒక కాలువ వస్తుంది. వీలైనంత త్వరలో టెండర్లు పూర్తి చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పేదల సేవలో.... కార్యక్రమంలో భాగంగా శనివారం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవ ర్గం సంబేపల్లె మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి స్వయంగా అందించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసి ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
పేదరికం లేని రాష్ట్రమే లక్ష్యం
‘‘2047 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఐదేళ్ల విధ్వంసకర పాలనతో రాష్ట్రం సర్వనాశనం అయింది. అప్పటి పాలకులు రాష్ట్రాన్ని అడవిపందుల్లా దోచుకుతిన్నారు. రూ.10లక్షల అప్పు నెత్తిన పెట్టి పోయారు. వ్యవస్థలను గాడిలో పెడుతూ.. ఏడు నెలల్లోనే.. ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. గత ప్రభుత్వం పెట్టిన రూ.22,252 కోట్ల బకాయిలు చెల్లించాం. నాలెడ్జ్ పెంచుకుని కష్టపడి పని చేస్తే ఆకాశమే హద్దుగా ఎదగవచ్చు. నా మాటను నమ్మినవాళ్లు బాగుపడ్డారు’’
వర్క్ ఫ్రమ్ హబ్‌గా మారుస్తాం
సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని ఒక నినాదంగా ప్రచారం చేశాం. కో వర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రమ్ హోమ్‌తో మానవవనరుల సమర్థ వినియోగం జరుగుతుంది. భవిష్యత్తులో చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉన్న వారికి శిక్షణ అందించి అవకాశాలు కల్పిస్తాం’’
నాడు ఐటీ.. నేడు ఏఐ
‘‘ఒకప్పుడు నేను ఐటీని ప్రోత్సహించాను. అప్పుడు ఎవరికీ ఐటీ అంటే తెలియదు. హైటెక్ సిటీ కట్టేందుకు చాలా కష్టపడ్డాను. హైటెక్ సిటీ చూశాక యువతకు బాగా చదువుకోవాలనే ఆశ పుట్టింది. 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చాను. ఆ కాలేజీలలో యువత చదువుకున్నారు. నేడు అమెరికా పౌరుల తలసరి ఆదాయం.. 60వేల డాలర్లు ఉంటే.. అక్కడి మన తెలుగువారి తలసరి ఆదాయం రూ.లక్షా 20వేల డాలర్లగా ఉంది’’
రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం
‘‘వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ అందిస్తోంది. పోలవరానికి 12వేల కోట్లు మంజూరు చేశారు. అమరావతి, విశాఖ, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులకు నిధులు కేటాయించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం. ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం. ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. నన్ను నమ్మి 35వేల ఎకరాలను రైతులు ఒకపైసా తీసుకోకుండా ఇచ్చారు. అమరావతి దేవతల రాజధాని. దేవేంద్రుడు పాలించిన రాజధాని పేరు అమరావతి. నేను రాజధానికి శ్రీకారం చుడితే..వైసీపీ ప్రభుత్వంలో మూడుముక్కలాట ఆడారు. శ్మశానం అని దిగజారి మాట్లాడారు’’
ఇంటికెళ్లి స్వయంగా పింఛన్ ఇచ్చి...
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా ఒక జిల్లాకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రే పెన్షనర్ల చేతికి డబ్బులు అందిస్తున్నారు. శనివారం ఆయన రాయచోటి మండల కేంద్రమైన సంబేపల్లెలోని సంతగేటు కాలనీలో గోళ్ల చలపతి అనే వికలాంగ యువకుడికి పెన్షన్ అందజేశారు. ఇతనికి తండ్రి చనిపోయాడు. తల్లి కువైట్‌లో ఉంది. అమ్మ మ్మ సంరక్షణలో చలపతి ఉన్నాడు. ఇతనికి బ్యాటరీ ట్రైసైకిల్ ముఖ్యమంత్రి అందజేశారు. అనంతరం కొప్పుల మంగమ్మ అనే 82 వృద్ధురాలి ఇంటికి వెళ్లి పెన్షన్‌ను అందజేశారు. ఆమె కూతురు....ఇద్దరూ చనిపోయారు. కొడుకు బిడ్డ మంగమ్మ దగ్గరే చదువుకుంటోంది. పెన్షన్ డబ్బు చాలా ఆదుకుంటోందని ఆమె పేర్కొన్నారు. తనకు ఇల్లు లేదని ఆమె చెప్పడంతో.. అప్పటికప్పుడే మంజూరు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మనుమరాలికి పెన్షన్ మంజూ రు చేశారు. సూర్యఘర్ కింద ఉచితంగా సోలార్ విద్యుత్ యూనిట్, దీపం-2 కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ మంజూరు చేశారు. అనంతరం సీఎం చేతుల మీదుగా.. ఆరు ఆటోలను పంపిణీ చేశారు. సంబేపల్లె మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
For AndhraPradesh News And Telugu News