Job Scam : ఉద్యోగం కోసం విడాకుల నాటకం!
ABN , Publish Date - Jan 21 , 2025 | 05:23 AM
భర్త విద్యుత్ శాఖలో ఇంజనీరు.. నెలకు లక్షన్నరకు పైగా జీతం.. ఉన్నది ఒకే కుమారుడు.. కానీ ఆ గృహిణి అత్యాశకు పోయి చిక్కుల్లో పడింది.
విద్యుత్‌శాఖ ఇంజనీరు భార్య నిర్వాకం
జైళ్లశాఖ అధికారులను బురిడీ కొట్టించే యత్నం
విచారణలో గుట్టు రట్టు.. చీటింగ్ కేసు పెట్టే యోచన
తప్పించుకునేందుకు కోర్టులో నిజంగానే విడాకుల పిటిషన్
అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): భర్త విద్యుత్ శాఖలో ఇంజనీరు.. నెలకు లక్షన్నరకు పైగా జీతం.. ఉన్నది ఒకే కుమారుడు.. కానీ ఆ గృహిణి అత్యాశకు పోయి చిక్కుల్లో పడింది. సర్వీసులో ఉండగా మరణించిన తండ్రి ఉద్యోగం కోసం.. భర్తతో విడిపోయినట్లు నాటకమాడింది. తల్లితో కలిసి జీవిస్తున్నానని, అమ్మను చూసుకోవడానికి కారుణ్యం కింద ఉద్యోగం ఇవ్వాలని కోరింది. క్షేత్రస్థాయి అధికారులను ఒప్పించి ఉద్యోగం అందుకునే స్థాయికి వచ్చేసింది. కానీ ఉన్నతస్థాయిలో ఒక అధికారికి వచ్చిన అనుమానంతో కూపీ లాగితే మొత్తం గుట్టు రట్టైంది. ఆమెపై చీటింగ్ కేసు పెట్టేందుకు సిద్ధపడటంతో.. నిజంగానే భర్తతో విడాకులు కావాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది. అధికారుల కథనం మేరకు.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో హెడ్ వార్డర్‌గా పనిచేస్తున్న లంకా బుజ్జి బాబు 2020 జూలై 17న మరణించారు. ఆయన ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన చిన్న కుమార్తె ఎం.శాంతి కుమారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని బుజ్జిబాబు భార్య లంకా విక్టోరియా రాణి జైళ్లశాఖకు విన్నవించుకున్నారు. అయితే, కారుణ్యం కింద పెళ్లయిన కుమార్తెకు ఉద్యోగం ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించబోవని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. దీంతో.. తాను భర్తతో విడాకులు తీసుకున్నానని, ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నానని శాంతి కుమారి చెప్పారు. అంతేగాక అప్పటి హోంశాఖ మంత్రి తానేటి వనితతో సిఫారసు చేయించినట్లు తెలిసింది.దీంతో జైలు సూపరింటెండెంట్ ఆమె దరఖాస్తుతో పాటు తన విచారణ వివరాలను హోంశాఖ కార్యదర్శికి పంపారు. జైళ్లశాఖ ఇన్‌చార్జి డీజీగా ఉన్న హోంశాఖ కార్యదర్శి శాఖాపరమైన సమీక్ష సందర్భంగా శాంతి కుమారి కారుణ్య నియామకం గురించి ఉన్నతాధికారులతో ప్రస్తావించారు. పెళ్లైన కుమార్తెకు కారుణ్య నియాయం కింద ఉద్యోగం ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించబోవని ఒక అధికారి చెప్పడంతో ఫైలు పక్కన బెట్టేశారు.
దీంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక చోటా నాయకుడి ద్వారా జైలు అధికారులపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయించారు. మరోసారి విచారణ చేపట్టాలంటూ ఒక ఉన్నతాధికారికి హోంశాఖ అప్పగించడంతో బుజ్జిబాబు భార్య విక్టోరియా రాణితో మాట్లాడారు. తన కుమార్తె భర్తతో విడాకులు తీసుకుని తన ఇంట్లోనే ఉంటోందని ఆమె చెప్పడంతో ఆ అధికారి శాంతి కుమారి భర్త వివరాలు సేకరించారు. జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ(ఏపీఈపీడీసీఎల్)లో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తూ నెలకు లక్షన్నర జీతం తీసుకొంటున్నారని, అతని పేరు ప్రదీప్ కుమార్‌గా నిర్ధారణకు వచ్చారు. ఆ వివరాలతో మరోమారు బుజ్జిబాబు భార్య, ఉద్యోగం ఆశిస్తున్న శాంతి కుమారితో మాట్లాడి.. కోర్టు నుంచి విడాకులు తీసుకున్నట్లు సర్టిఫికెట్ కావాలని, అలాగే, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భర్త నుంచి భరణం ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. మీరు ప్రదీప్ కుమార్‌తోనే కలిసి ఉన్నట్లు తాజాగా ఆయన విద్యుత్ శాఖకు అందజేసిన కుటుంబ సభ్యుల వివరాలు చెబుతున్నాయంటూ ఆధారాలు చూపించారు. అయినా వెనక్కి తగ్గని తల్లి, కుమార్తె ఆ ఉన్నతాధికారిని ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేయాలంటూ ఆయన ఏలూరు జైలు అధికారులకు జైళ్ల శాఖ ఉన్నతాధికారి సూచించారు. విషయం తెలిసిన శాంతి కుమారి, ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి తాజాగా భర్తతో విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేయడం జైళ్లశాఖలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే మొదట్లోనే సరైన విచారణ చేపట్టకుండా ఉన్నతాధికారులకు ఫైలు పంపిన జైలు అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.