AP Police: మాయమైపోయాడు
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:50 AM
బోరుగడ్డ అనిల్‌ను గత ఏడాది అక్టోబరులో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. వివిధ కేసుల్లో బెయిలు వచ్చినప్పటికీ...
బెయిలు కోసం హైకోర్టుకే బురిడీ
తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు
గతనెల 15వ తేదీనే ఆయనకు బెయిల్
రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల
బెయిల్ పొడిగింపు కోసం మళ్లీ హైకోర్టుకు
తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికెట్
ఈనెల 11వరకు బెయిల్ పొడిగించిన కోర్టు
చివరికి.. అది ఫేక్ సర్టిఫికెట్‌గా నిర్ధారణ
బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్
ఎక్కడున్నాడు.. ఏమైపోయాడు?
11న జైలుకు తిరిగొస్తాడా రాడా?
అలా వదిలేస్తారా?
హైకోర్టు బెయిలు ఇచ్చిన తర్వాత... రిమాండ్ ఖైదీని విడుదల చేయడానికి కొన్ని నిబంధనలు పాటించాలి. బెయిలు విషయాన్ని జైలు సూపరింటెండెంట్ తన పై అధికారులకు తెలియజేయాలి. అలాగే... ఆ కేసు నమోదైన పోలీసు స్టేషన్‌కు కూడా సమాచారం పంపించాలి. బోరుగడ్డ అనిల్‌లాంటి వ్యక్తి విషయంలో జైలు అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కానీ... హైకోర్టు అలా బెయిలు ఇవ్వగానే, ఇలా బయటికి పంపించేశారు. హైకోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చి, రెండోసారి దానిని పొడిగించినప్పటికీ ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదు. బోరుగడ్డ బయటికి వచ్చిన సంగతి మీడియాకు కూడా తెలియదు. అంత గుట్టుగా, భద్రంగా రాజమండ్రి జైలు నుంచి బయటికి పంపించేశారన్న మాట!
ఇదో గ్రేట్ ఎస్కేప్! హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది! జైలు అధికారులు వదిలేశారు! ఈ విషయం పోలీసులకు తెలియదు. ప్రభుత్వానికీ తెలియదు! వైసీపీ హయాంలో కూటమి నేతలపై విచ్చలవిడిగా రెచ్చిపోయిన అరాచకవాది బోరుగడ్డ అనిల్ మాయమైపోయాడు! తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని అతడు జైలు నుంచి బయటికి వచ్చేశాడు! నకిలీ సర్టిఫికెట్‌ను సృష్టించి హైకోర్టునూ బురిడీ కొట్టించాడు! చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తోపాటు కూటమి నేతలను, కుటుంబ సభ్యులనూ అసభ్యంగా దూషించి, బెదిరింపులకు దిగి, రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదైన ఒక రాజ్యాంగేతర శక్తికి రెండుసార్లు బెయిల్ వచ్చిందనే సంగతే ఎవరికీ తెలియదు. అతడు జైలు నుంచి బయటికి వచ్చిన విషయమూ తెలియదు!
(గుంటూరు/అమరావతి - ఆంధ్రజ్యోతి)
బోరుగడ్డ అనిల్‌ను గత ఏడాది అక్టోబరులో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. వివిధ కేసుల్లో బెయిలు వచ్చినప్పటికీ... అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో మాత్రం బెయిల్ రాలేదు. తన తల్లి పద్మావతి ఊపిరితిత్తుల సమస్య, గుండెజబ్బుతో బాధపడుతోందని... ఆమెకు చికిత్స చేయించేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత నెల 14న ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యాన్ని లంచ్ మోషన్‌గా స్వీకరించి విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి... ఫిబ్రవరి 15 నుంచి 28వరకు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు బోరుగడ్డ అనిల్ బెయిలు గడువు ముగియగానే జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు. అయితే... తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని, చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలని, మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఈనెల 1వ తేదీన అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ అనుబంధ పిటిషన్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. తన తల్లికి అత్యవసరంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాలని గుంటూరు లలిత సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చారని బోరుగడ్డ తెలిపాడు. ఆ సర్టిఫికెట్‌ను ఆయన తరఫు న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. ప్రస్తుతం ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమెకు పిటిషనర్ ఒక్కడే కొడుకు అని వివరించారు. ప్రసుత్త పరిస్థితుల్లో ఆమెకు కుమారుడి సహాయం ఎంతో అవసరమని చెప్పారు.
అయితే... కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నిజమైనదో, కాదో అనే సమాచారం తనకు లేదని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు మెడికల్ సర్టిఫికెట్ వాస్తవికతను పరిశీలించేందుకు ప్రాసిక్యూషన్‌కు అనుమతించారు. తప్పుడు ధ్రువపత్రం అని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఫేక్ సర్టిఫికెట్‌తో బురిడీ
తల్లి అనారోగ్యంపై బోరుగడ్డ అనిల్ హైకోర్టుకు అందించిన మెడికల్ సర్టిఫికెట్ నిజమైనదా, కాదా నిర్ధారించాలని అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు గురువారం గుంటూరు పోలీసులను కోరారు. కార్డియాలజిస్టుగా డాక్టర్ రాఘవ శర్మకు మంచి పేరుంది. క్లిష్టమైన కేసులకు సైతం గుంటూరులోనే చికిత్స అందించగల సమర్థులు. అలాంటిది... బోరుగడ్డ అనిల్ తల్లి కేసును చెన్నై అపోలో ఆస్పత్రికి రిఫర్ చేశారనడంతో గుంటూరు పోలీసులకు అనుమానం వచ్చింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. గుంటూరు లలితా ఆస్పత్రిలో అనిల్ తల్లి పద్మావతి అసలు చేరనేలేదని... ఆమెను చెన్నై అపోలోకు రిఫర్ చేస్తూ డాక్టర్ రాఘవశర్మ ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని వెల్లడైంది. ఆయన పేరుతో ఉన్న లెటర్‌హెడ్‌పై ఉన్న సంతకం ఫోర్జరీ అని స్పష్టమైంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా కంగు తిన్నారు.
ఫోన్లు స్విచ్ ఆఫ్...
బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు అటు గుంటూరు, ఇటు అనంతపురం పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనిల్‌తోపాటు ఆయన తల్లి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోందని తెలిసింది. ఆయన తల్లికి నిజంగా చెన్నై అపోలోలో చికిత్స చేయించారా... లేదా అనేది తెలియడంలేదు! తల్లి అనారోగ్యమే నిజమైతే... గుంటూరు డాక్టర్ పేరిట తప్పుడు సర్టిఫికెట్ ఎందుకు సృష్టించాడు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? కేసులు, అరెస్టులు, కారాగారవాసం నుంచి తప్పించుకునేందుకే ఈ పథకం వేశాడా? మధ్యంతర బెయిలు గడువు ముగిసేలోగా... అంటే ఈనెల 11వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోతాడా... లేదా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు.
ఎన్నెన్ని కేసులో...
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు రాజ్యాంగేతర శక్తిగా రెచ్చిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌పై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 కేసులు నమోదయ్యాయి. గుంటూరులోని ఏఈఎల్‌సీ చర్చి ట్రెజరర్ బాబు ప్రకాశ్‌ను కత్తితో బెదిరించి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో అనిల్‌ను గత ఏడాది అక్టోబరులో అరండల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీ్‌సస్టేషన్లలో నమోదైన కేసుల్లో ఆయా పోలీసులు కోర్టులలో పీటీ వారెంట్లు దాఖలు చేసి ఆయనను సంబంధిత కోర్టులలో హాజరు పరిచారు. తాను కేంద్ర మంత్రి పీఏనని అనంతపురం కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి అక్కడి చర్చి ఆస్తుల వివాదంలో బోరుగడ్డ తలదూర్చాడు. ఆయా కేసుల్లో ఆయా జిల్లా కోర్టుల నుంచి బెయిల్ వచ్చినప్పటికీ... అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అక్కడ జిల్లా కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఈ కేసులోనే బోరుగడ్డ అనిల్ రిమాండ్‌లో ఉన్నాడు.