Share News

Thermal Power : చరిత్ర సృష్టించిన జెన్కో

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:01 AM

విద్యుదుత్పత్తిలో ఏపీజెన్కో ఆదివారం చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో 241.523 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేసింది.

 Thermal Power : చరిత్ర సృష్టించిన జెన్కో

  • రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి

  • 241.523 మిలియన్‌ యూనిట్ల ఉత్పాదన

  • వీటీపీఎ్‌సలో 52.73 మి.యూనిట్లు

  • ఇది సువర్ణాధ్యాయం: ఎండీ చక్రధరబాబు

అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): విద్యుదుత్పత్తిలో ఏపీజెన్కో ఆదివారం చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో 241.523 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేసింది. దీనికితోడు .. విజయవాడ నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్కేంద్రం(వీటీపీఎస్‌) స్థాపించిన నాటి నుంచి ఇప్పటిదాకా సాధించని విధంగా 52.73 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తిని ఆదివారం సాధించింది. మునుపెన్నడూ లేనంతగా ఉత్పాదన జరగడంపై రాష్ట్ర ఇంధన శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది. ఏపీజెన్కో చరిత్రలో ఆదివారం సువర్ణాధ్యాయమని సంస్థ ఎండీ కేవీఎస్‌ చక్రధరబాబు తెలిపారు. థర్మల్‌ కేంద్రాల్లో 123.055 ఎంయూ, హైడల్‌ 9.411 ఎం యూ, సోలార్‌ 1.957 ఎంయూ, సెంట్రల్‌ జనరేషన్‌ స్టేషన్‌ 32.282 ఎంయూ, అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ (సెం ట్రల్‌ పూల్‌), 29.359 ఎంయూ, విండ్‌ 6.817 ఎంయూ, ప్రైవేటు సోలార్‌ 22.032 ఎంయు, జెన్‌కో పరిధిలోని ఉత్పత్తి సంస్థలు 3.763 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. దరిమిలా రాష్ట్రంలో ఆదివారం విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకునేందుకు కేవలం 7.967 మిలియన్‌ యూనిట్లనే బహిరంగ మార్కెట్లో జెన్కో సేకరించింది. అటు వీటీపీఎస్‌ నాలుగో యూనిట్‌ను ప్రారంభించాక 100 రోజుల పాటు నిర్విరామంగా పనిచేస్తూనే ఉండడం గమనార్హం.

జగన్‌ మూసేయాలని చూస్తే..!

బొగ్గు కొరతను సాకుగా చూపిస్తూ బ్యాకింగ్‌డౌన్‌ పేరిట రాష్ట్ర థర్మల్‌ విద్యుత్కేంద్రాలను నాటి సీఎం జగన్‌ మూసేయాలని చెబితే.. 2024లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం గరిష్ఠ స్థాయిలో విద్యుదుత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దాననికి అనుగుణంగానే ఆదివారం రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించిందని నిపుణులు చెబుతున్నారు. ఇదే తరహాలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తే.. ఈ వేసవిలో కరెంటు డిమాండ్‌ను అవలీలగా దాటేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో వేసవి డిమాండ్‌ను తట్టుకునేలా ఉత్పత్తి సాధించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జెన్కో ఎండీ చక్రధరబాబు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Feb 24 , 2025 | 04:01 AM