AP High Court : రమ్య హత్య కేసులో దోషికి జైలే!
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:52 AM
ఉరిశిక్ష స్థానంలో అతనికి 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది. శశికృష్ణకు క్షమాభిక్ష ప్రసాదించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
మరణశిక్షను సవరించిన హైకోర్టు
2021లో ప్రేమ పేరిట బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేసిన మెకానిక్ శశికృష్ణ
20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన కోర్టు
అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): బీటెక్ విద్యార్ధిని నల్లపు రమ్య హత్య కేసులో దోషి కుంచాల శశికృష్ణకు ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు సవరించింది. ఉరిశిక్ష స్థానంలో అతనికి 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది. శశికృష్ణకు క్షమాభిక్ష ప్రసాదించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ట్రయల్ కోర్టు విధించిన ఇతర శిక్షలను ఖరారు చేసింది. హత్య కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ శశికృష్ణ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. సురేశ్‌రెడ్డి, జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించింది.
ప్రేమను తిరస్కరించడంతో..
గుంటూరు జిల్లా, వట్టిచెరుకూరుకు చెందిన బైక్ మెకానిక్ కుంచాల శశికృష్ణ.. బీటెక్ విద్యార్ధి నల్లపు రమ్యను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ఆమె తన ప్రేమను తిరస్కరించిందనే కారణంతో 2021, ఆగస్టు 15న రమ్యను పట్టపగలు రోడ్డు మీదే కత్తితో పొడిచి హత్య చేశాడు. కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 2022, ఏప్రిల్ 29న శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఉరిశిక్ష ఖరారు విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్ధిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 2022, మే 5న హైకోర్టుకు లేఖ రాసింది. మరోవైపు తీర్పును సవాల్ చేస్తూ శశికృష్ణ హైకోర్టులో అప్పీల్ చేశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు విధించిన మరణశిక్షను ఖరారు చేసే నిమిత్తం హైకోర్టు మరో పిటిషన్‌ను నమోదు చేసింది. ఈ రెండు పిటిషన్లపై ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. శశికృష్ణ తరఫున న్యాయవాది చల్లా అజయ్‌కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం శుక్రవారం నిర్ణయం వెల్లడించింది.
తీర్పు ఇదీ..
‘‘శశికృష్ణకు అంతకుముందు ఎలాంటి నేరనేపథ్యం లేదు. శిక్షించడం కంటే సంస్కరించడానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఇండియన్ క్రిమినల్ జస్టిస్ చెబుతోంది. సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొనేలా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా నిందితుల్లో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుంది. శశికృష్ణలో మార్పు వచ్చి సమాజంలో భాగం అయ్యేందుకు అవకాశం ఉంది. శశికృష్ణకు మరణశిక్ష విధింపు కఠినమైనదిగా కోర్టు భావిస్తోంది. పిటిషనర్ తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, వయసు పైబడటంతో తండ్రి ఎలాంటి పనులకు వెళ్లడం లేదు. జీవనాధారం కోసం తల్లి పాలు అమ్మి రోజుకు రూ.250 సంపాదిస్తోంది. సోదరుడు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని శశికృష్ణకు విధించిన మరణశిక్షను సవరించి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం’’ అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది.
For AndhraPradesh News And Telugu News