Share News

AP Govt : గీత కులాలకు 335 మద్యం షాపులు

ABN , Publish Date - Jan 22 , 2025 | 05:54 AM

గీత కులాలవారికి 335 మద్యం షాపులను రిజర్వ్‌ చేస్తూ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని విడుదల చేసింది.

AP Govt :  గీత కులాలకు 335 మద్యం షాపులు

  • 7న లైసెన్సీల ఎంపికకు లాటరీ

  • లైసెన్స్‌ ఫీజు 50 శాతం మాత్రమే.. ఉత్తర్వులు జారీ

అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గీత కులాలవారికి 335 మద్యం షాపులను రిజర్వ్‌ చేస్తూ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని విడుదల చేసింది. ఆ షాపుల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాలను పేర్కొంటూ ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కె.మీనా మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. 2016లో నిర్వహించిన స్మార్ట్‌ పల్స్‌ సర్వే ప్రామాణికంగా గీత కులాల జనాభాను పరిగణనలోకి తీసుకుని.. ఆయా జిల్లాల్లో గీత ఉప కులాలవారికి వేర్వేరుగా మద్యం షాపులను కేటాయించారు. ఇందులో యాత, గౌడ, ఈడిగ, గామళ్ల, కలాలీ, గౌండ్ల, శ్రీశయన (సేగిడి), శెట్టిబలిజ కులాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఈ షాపులు కేటాయించనున్నారు. ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని శెట్టి బలిజలు ఓసీల్లో ఉన్నందున.. ఆయా జిల్లాల్లో శెట్టిబలిజలకు ఈ పాలసీ వర్తించదు. షెడ్యూలు ప్రాంతాల్లో గీత కులాలకు షాపులు కేటాయించరు. ఎక్కడ షాపులు పెట్టాలనేది ఆయా జిల్లాల్లో ఎక్సైజ్‌ అధికారులు నిర్ణయిస్తారు. ప్రాంతాలను నిర్ణయించిన అనంతరం జిల్లాల్లోని ఎక్సైజ్‌ అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ లేదా హైబ్రిడ్‌ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. కలెక్టర్ల సమక్షంలో లాటరీ ద్వారా లైసెన్సీలను ఎంపిక చేస్తారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా కులధ్రువీకరణ, స్వస్థల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కో దరఖాస్తు రుసుము రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ షాపులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే వారంతా గీత కులాలకు చెందినవారైనప్పటికీ ఆయా ఉప కులాలకు నోటిఫై చేసిన షాపులకు దరఖాస్తులు చేసుకోవడానికి వీల్లేదు.


ఫిబ్రవరి 7న లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఎంపిక చేస్తారు. ఒక వ్యక్తికి ఒక్క షాపు మాత్రమే కేటాయిస్తారు. ఒకవేళ ఒకే వ్యక్తికి రెండు షాపులు లాటరీలో వస్తే.. దరఖాస్తుదారుల అభీష్టం మేరకు వారు కోరుకున్న షాపును కేటాయించి, మిగిలిన షాపు లైసెన్స్‌ను రద్దు చేస్తారు. అక్టోబరు నుంచి అమలులోకి వచ్చిన సాధారణ మద్యం పాలసీ లైసెన్సుదారులు చెల్లించే మొత్తంలో 50 శాతం లైసెన్స్‌ ఫీజు మాత్రమే గీత కులాల లైసెన్సీలు చెల్లిస్తే సరిపోతుంది. 2026, సెప్టెంబరు వరకు ఈ లైసెన్సుల గడువు ఉంటుంది.

చారిత్రక నిర్ణయం: మంత్రి అనగాని

కల్లు గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ హర్షం వ్యక్తం చేశారు. కల్లుగీత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. కుల వృత్తినే నమ్ముకుని, ఇబ్బందులు పడుతున్న గీత కార్మికులకు మద్యం దుకాణాలు కేటాయించడం చారిత్రక నిర్ణయిమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2025 | 05:54 AM