Pawan Kalyan: అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. బాధ్యులపై కఠిన చర్యలు
ABN , Publish Date - Jun 08 , 2025 | 05:24 PM
రాజధాని అమరావతి మహిళలను సాక్షి మీడియా వేదికగా అవమానించడాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. ఆ వ్యాఖ్యలు చేసిన వారిని చట్టప్రకారం వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
అమరావతి, జూన్ 08: రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలతో మహిళలను అవమానించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సాక్షి మీడియాలో ఓ చర్చ సందర్భంగా అమరావతి ప్రాంత మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఉపముఖ్యమంత్రి ఖండించారు. రాజధానిపై కుట్రలు చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
జర్నలిస్ట్ ముసుగులో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రజలు, అధికారులు విశ్లేషించాలని అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ సాక్షి ఛానల్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కులముద్రలు వేసి మహిళలను అవమానిస్తున్నారంటూ ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇక్కడ విలసిల్లిన బౌద్ధాన్నీ అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతానికి బలమైన చారిత్రక, ఆధ్యాత్మిక, బౌద్ధ ధర్మ నేపథ్యం ఉన్న విషయాన్ని విస్మరించవద్దని చెప్పుకొచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 32 శాతం ఎస్సీ, ఎస్టీ.. 14 శాతం బీసీ రైతులు ఉన్నారని వివరించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో చర్చ కార్యక్రమం వేదికగా చేసిన కామెంట్లు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను.. ఈ ప్రొగ్రామ్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించకపోగా.. ఆయన వ్యంగ్యంగా కామెంట్ చేయడంపైనా పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఆ మీడియా యాజమాన్యం సైతం దీనిని సమర్థించుకొనే విధంగా.. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు, మహిళలు పెద్దఎత్తున ఉద్యమ బాట పట్టారు. 24 గంటల్లో స్పందించకుంటే.. సాక్షి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాంటి వేళ ఆ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత వరుసగా స్పందించారు. మహిళలపై వ్యాఖ్యలు చేసిన వారిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన సీఎం చంద్రబాబు
కిషన్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే రాజా సింగ్ పరోక్ష విమర్శలు
For AndhraPradesh News And Telugu News