CM Chandrababu: ధన్యవాదాలంటూ సీఎం చంద్రబాబు ట్వీట్.. ఎందుకంటే..
ABN , Publish Date - Apr 20 , 2025 | 08:23 PM
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూరప్ పర్యటనలో ఉన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు.
అమరావతి, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం ఈ రోజు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు సైతం వారు చేపట్టారు. ఈ నేపథ్యంలో యూరప్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు, ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ప్రజలు చూపిన అభిమానం, ఆప్యాయతతో మనసు ఉప్పొంగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుజాతి అభ్యున్నతికి పునరంకితం అవుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోనే శక్తిమంతంగా తెలుగుజాతి ఉండాలన్నది తన అభిమతమని ఆయన ఆకాంక్షించారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే.. "నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటి వరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.
75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో,47 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో నాకు ఎల్లప్పుడూ తోడునీడగా ఉండి,నన్ను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం… అపురూప అవకాశం.
మీ ఆదరాభిమానాలు, నాపై మీరు ఉంచిన నమ్మకం నాలో బాధ్యతను, నిబద్ధతను మరింత పెంచాయి. తెలుగు సమాజ పురోగతి కోసం అలుపు లేకుండా పని చేసేలా మీరంతా నాలో ఉత్సాహం నింపారు. మీ భవిష్యత్ కలలు, ఆకాంక్షలను సాకారం చేయాడానికి నిరంతరం కష్టపడి పని చేస్తానని మాటిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని నా జన్మదినం రోజున వినమ్రంగా తెలియజేస్తున్నాను.
స్వర్ణాంధ్ర-2047 విజన్ మీ అందరి ఆకాంక్షల సమాహారం.మీ మద్దతుతో,మీ సహకారంతో,సమిష్టి కృషితో ఆ కలను నిజం చేస్తాను. నా ప్రతీ అడుగు, నా ప్రతీ ఆలోచన, ప్రతీ కార్యక్రమం మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే.అందరికీ అవకాశాలు కల్పించేలా,ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసా నిచ్చేలా పాలన అందిస్తాను.ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ ఆవిష్కరణలకు , అవకాశాలకు కేంద్రంగా మలచాలనేది నా తపన.‘థింక్ గ్లోబల్లీ- యాక్ట్ గ్లోబల్లీ’ విధానంతో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుకుందాం.
సమాజంలో అసమానతలు పోవాలి. పేద-ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గాలి. పేదరికం లేని సమాజం స్థాపించాలనేదే నా సంకల్పం. అందుకే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.. మూడు దశాబ్దాల నాడు నేను ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ సమాజంలో ఎంతో మార్పు తెచ్చింది. ఈసారి తీసుకువచ్చిన ‘పీ4’తో రాష్ట్రంలో పేద కుటుంబాలను... స్వర్ణ కుటుంబాలుగా చేయాలనేది నా ప్రయత్నం. ప్రతి సంపన్న వ్యక్తి పేదవాడి శ్రేయస్సు కోసం పాటుపడాలి. వ్యక్తి శ్రేయస్సే... సమాజ శ్రేయస్సుగా నేను విశ్వసిస్తాను. జనం మన బలం... జనాభా సమర్ధ నిర్వహణ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించవచ్చు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సాధిస్తున్న విజయాలు మనకెంతో గర్వకారణంగా నిలుస్తున్నాయి. అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్నవారిలో ముందువరుసన ఉన్నాం. మనం కలిసికట్టుగా పని చేస్తే మరిన్ని తిరుగులేని విజయాలు సాధించగలం. 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తెలుగు జాతిని నిలపాలన్నదే నా అభిలాష.
ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం తెలుగు ప్రజల రక్తంలోనే ఉంది. దేశభక్తి చాటేలా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయి చేయి కలుపుదాం. నాతో పాటు, అందరూ ఇందులో భాగస్వాములు అయ్యేలా ఆహ్వానిస్తున్నాను.
నా పుట్టినరోజు సందర్భంగా మారుమూల పల్లె నుంచి దేశ,విదేశాల వరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు....అందరికీ మరోసారి ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి..
Lightning Strike: క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి
Minister Narayana: గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం
YSRCP: అధికారం కోల్పోయినా.. అరాచకాలు ఆగలేదు
10th class Students: సార్, ఛాయ్ తాగండి, నన్ను పాస్ చేయండి
CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..
CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి
For Andhrapradesh News And Telugu News