Share News

CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి

ABN , Publish Date - Apr 20 , 2025 | 03:56 PM

CM Chandrababu Birthday: తెలుగు రాష్ట్రాల్లో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. అలాంటి వేళ.. కర్నూలు జిల్లాలో టీడీపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకొంది.

CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి

కర్నూలు,ఏప్రిల్ 20: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరులో సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆదివారం స్థానికంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ జిల్లా యూత్ అధికార ప్రతినిధి బోయ సురేంద్ర పాల్గొన్నారు.


ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో.. ర్యాలీలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. దీంతో పార్టీలోని సహచరులు వెంటనే స్పందించి.. ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బోయ సురేంద్ర మరణించారని వైద్యులు వెల్లడించారు. దీంతో స్థానిక శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనే బోయ సురేంద్ర ఒక్కసారిగా.. అది కూడా అంతా ఇలా ఫుల్ జోష్‌లో ఉండగా మృతి చెందడంతో వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు సైతం పార్టీని అంటిపెట్టుకొని.. కేడర్‌లో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా.. నేనున్నాంటూ వారికి భరోసా ఇచ్చే నాయుకుడు బోయి సురేంద్ర లాంటి తెలుగు తమ్ముడు ఇలా కళ్ల ముందే తిరిగి రాని లోకాలకు వెళ్లి పోవడం పట్ల జిల్లాలోని పార్టీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా పార్టీ నేతలు వెంటనే కర్నూలు నుంచి ఆలూరుకు బయలుదేరారు. ఇంకోవైపు.. బోయ సురేంద్ర మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.


సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఆదివారం జరుగుతోన్నాయి. ఈ సందర్భంగా ఈ రెండు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలను పార్టీ శ్రేణులు చేపట్టాయి. అందులోభాగంగా ఉచిత వైద్య శిబిరాలు, అన్న దానం, రక్తదానం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఇక భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 04:03 PM