AP News: అక్కడ పంప్ తిప్పితే చాలు... ద్రవ జీవామృతం వస్తుంది
ABN , Publish Date - Dec 07 , 2025 | 09:55 AM
అక్కడ పంప్ తిప్పితే చాలు... ద్రవ జీవామృతం వస్తుంది. అవసరం ఉన్నవారు ఎప్పుడంటే అప్పుడు పట్టుకొని మొక్కలకు వేసుకుంటారు. ఈ జీవ ఎరువులను రైతులే స్వయంగా తయారు చేస్తారు. అందుకే ఆ గ్రామం ప్రకృతి సేద్యంతో పచ్చగా మారింది!
- పంటలకు ఎనీటైమ్ జీవామృతం!
రసాయన ఎరువులు విచ్చల విడిగా వాడటం వల్ల భూసారం దెబ్బతిని నేల నిస్సారంగా మారుతోంది. గాలి, నీటి కాలుష్యాలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టి, అవసరమైనప్పుడు జీవామృతం అందుబాటులో ఉండాలనే ఆలోచన నుంచి పుట్టిందే ‘ఎనీటైమ్ జీవామృతం’ యూనిట్. రైతులకు జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి ‘వాసన్’ సంస్థ ఉత్తరాంధ్ర, రాయలసీమలో 2 బయో రిసోర్స్ సెంటర్‌లు ఏర్పాటు చేసింది. వాటిలో ఒకటి తూరుపు కనుమల్లోని ఎఎస్‌ఆర్ జిల్లా, డుంబ్రిగుడ మండలం, కిల్లోగూడలో కాగా, రెండోది శ్రీసత్యసాయి జిల్లా, ఆమడగురు మండలం, పెరంవాండ్లపల్లిలో.

ఎనీటైమ్... ఎలా?
సాధారణంగా పశువుల పేడ, మూత్రాన్ని రైతులు తమ పంట పొలాల్లో జీవామృతం తయారీకి ఉపయోగిస్తారు. అయితే పేడ పోగు చేయడం, గోమూత్రం తీసుకోవడం, కలపడం... ఈ పనికి రోజూ కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో జీవామృతం తయారీ కష్టతరం. ఈ సమస్యల నుంచి రైతులను కాపాడాలని ‘బయో రీసోర్స్ సెంటర్’లో భాగంగా కిల్లోగూడ, పెరంవాండ్ల పల్లిలో ఆటోమేటిక్ జీవామృతం తయారీ కేంద్రాలను గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేశారు.
గ్రామంలోని పశువుల శాలలన్నీ వీలైనంత వరకు ఒకేచోట ఏర్పాటు చేశారు. వాటి నుంచి పైప్ లైన్ ద్వారా గ్రావిటీ పద్ధతిలో పేడ, మూత్రం ఒక చోటుకు సేకరించి, సోలార్ పవర్‌తో ఆటోమేటిక్ మిక్సింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మూడడుగుల డ్రమ్ముల్లో నిరంతరంగా ద్రవ జీవామృత ఉత్పత్తి జరుగుతోంది. దీనికి సౌరశక్తిని, సాంకేతికతను జోడించారు. దాంతో కులాయి తిప్పగానే ‘ఎనీటైమ్ జీవామృతం’ వచ్చేలా యూనిట్‌లు ఏర్పాటు చేశారు. రైతులకు అవసరమైనపుడల్లా ఇక్కడ జీవామృతం పట్టుకొని పెరటి తోటలకు, పొలాలకు వాడుకుంటున్నారు.

లీటర్‌కు మూడు రూపాయలే...
‘‘ఇక్కడ అందరికీ పశువులుండవు. దానివల్ల మేము సొంతంగా జీవన ఎరువులు చేసుకోవడం కష్టమయ్యేది. మా గ్రామంలోనే యూనిట్ పెట్టడం వల్ల ఏ రైతు అయినా అవసరమైతే, ఆ ట్యాంక్ దగ్గర ఉన్న ట్యాప్‌ను తిప్పితే సరిపోతుంది. సిద్ధంగా ఉన్న ద్రవ జీవామృతం బకెట్‌లోకి వస్తుంది. మేమంతా ‘ఎనీటైమ్ జీవామృతం’ అని పిలవడం మొదలుపెట్టాం. కుళాయిలో నీళ్లు పట్టుకున్నట్టుగా జీవామృతం తీసుకొని మా పెరటి తోటలను పెంచుతున్నాం. వంకాయ, టమాటా, బీర పండిస్తున్నాం. ఎంతో రుచిగా ఉంటున్నాయి. జీవామృతం ఒక లీటర్‌కి 3 రూపాయలే’’ అన్నారు సత్యసాయి జిల్లా, గుండువారి పల్లికి చెందిన అరుణ.
విద్యుత్ ఖర్చు లేకుండా...
ఈ ప్రక్రియకు సోలార్ పవర్ వాడటం వల్ల ఎలాంటి అదనపు విద్యుత్ ఖర్చు ఉండదు. ఈ వ్యవస్థను నిర్వహించడానికి చాలా చిన్న మొత్తమే ఖర్చవుతోంది. అందుకే లీటర్‌కు కేవలం 3 రూపాయల ధర మాత్రమే నిర్ణయించారు. ఇది యూనిట్ నిర్వహణకు ఉపయోగపడుతోంది. జీవ ఎరువుల్లో సజీవ సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి మట్టిలోని పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి.

నేల ఆరోగ్యాన్ని పెంచి, పంటలకు చీడ, పీడలను తట్టుకొనే శక్తిని పెంచుతాయి. రసాయన ఎరువులతో పోలిేస్త వీటి ఖర్చు తక్కువ. ‘‘రైతులు సొంతంగా కూడా తయారు చేసుకోవచ్చు. అయితే విడిగా చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఈ యూనిట్‌లు ఏర్పాటు చేశాం’’ అన్నారు వాసన్ సంస్థ ప్రతినిధి సన్యాసి రావు. జీవామృతం యూనిట్‌తో పాటు, పెరంవాండ్ల పల్లిలో జీవ ఎరువుల తయారీ కేంద్రం కూడా నిర్వహిస్తూ, 11 రకాల కషాయాలను స్థానిక రైతులే తయారు చేసుకుంటున్నారు.
కిల్లోగూడ, పెరంవాండ్ల పల్లి గ్రామాల్లో 70 నుంచి 80 శాతం రైతులు ఈ జీవామృతాన్ని రోజూ ఉపయోగిస్తున్నారు. పూర్తిగా రసాయ నాలను మానేసి ప్రకృతి వ్యవసాయానికి మళ్లారు. దానివల్ల దిగుబడి, నాణ్యత పెరిగి రైతుల రాబడి పెరిగింది. నేల కాలుష్యం తగ్గి వ్యవసాయం సుసంపన్నం అవుతోంది. రైతుల రోజువారీ పనుల్లో ఒత్తిడి తగ్గి, పొలాల్లో పని చేయడానికి అదనపు శక్తి, సమయం లభిస్తోంది. ఈ ‘ఎనీటైమ్ జీవామృతం’ మోడల్ గ్రామ సమైక్యతకు అరుదైన ఉదాహరణ.
- శ్యాంమోహన్,
94405 95858
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
Read Latest Telangana News and National News