Share News

Telangana Govt: రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Dec 07 , 2025 | 06:25 AM

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు.

Telangana Govt: రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

  • గ్లోబల్‌ సమ్మిట్‌కు రండి

  • కేంద్రమంత్రి బండి సంజయ్‌కి మంత్రి పొన్నం ఆహ్వానం

  • మధ్యప్రదేశ్‌ సీఎంకు మంత్రి తుమ్మల.. హరియాణా, హిమాచల్‌ సీఎంలకు మంత్రి అడ్లూరి ఆహ్వానం

హైదరాబాద్‌, కరీంనగర్‌ అర్బన్‌, న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. కరీంనగర్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి గ్లోబల్‌ సమ్మిట్‌ ఆహ్వాన పత్రికను శనివారం అందజేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కి కేంద్రమంత్రి బండి సంజయ్‌ని ఆహ్వానించినట్లు చెప్పారు. కాగా తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ఘన విజయం సాధించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆకాంక్షించారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు తనను ఆహ్వానించినందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్న తేదీల్లో తనకు ముందుగానే నిర్ణయించిన జిల్లాల పర్యటనలు ఉండటం వల్ల కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్టు తెలిపారు. కాగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’’లో పాల్గొనాల్సిందిగా కోరుతూ మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మధ్యప్రదేశ్‌ సీఎంను మంత్రి తుమ్మల శనివారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడి అవకాశాలు, వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానాల పరంపరలో భాగంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ శనివారం హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పర్యటించారు.


హరియాణా సీఎం నాయబ్‌సింగ్‌ సైనీని కలిసి సమ్మిట్‌కు రావాలని ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా టీఎ్‌స-ఐపాస్‌ ద్వారా వేగవంతమైన అనుమతులు, ఐటీ, ఫార్మా రంగాల్లో రాష్ట్రం సాధించిన పురోగతిపై చర్చించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం పంజాబ్‌ ఆర్థిక శాఖ మంత్రి హర్‌పాల్‌ సింగ్‌ను కలిసి ఆహ్వానం అందించారు. అలాగే గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖును కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఆహ్వానించారు. శనివారం హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి సీఎం సుఖ్వీందర్‌సింగ్‌ను కలిశారు.

Updated Date - Dec 07 , 2025 | 06:27 AM