AP Assembly Monsoon Session 2025: రేపటి నుంచే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:34 PM
ఏపీ రాజధాని అమరావతిలో రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:00 గంటలకు శాసనసభ, 10:00 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:00 గంటలకు శాసనసభ, 10:00 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. రేపటి ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ - BSC) సమావేశమవుతుంది.
అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష..
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇవాళ(బుధవారం) శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ(CS), డీజీపీ (DGP)తోపాటు ఇతర కీలక అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట భద్రతపై చర్చించారు. ఉభయసభల సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను అయ్యన్నపాత్రుడు ఆదేశించారు.
వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. తమ తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఇదో సదావకాశంగా ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. అయ్యన్నపాత్రుడుగా తనకు గౌరవం ఇవ్వమని అడగడం లేదని, కానీ సభాపతి స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు ఉందని గుర్తుచేశారు. సభకు వస్తే ప్రజా సమస్యలు చర్చించేందుకు అందరికీ అవకాశం కల్పిస్తానన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా తిరగటం మంచిది కాదని హెచ్చరించారు. ఉదయం బీఏసీ సమావేశంలో శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులకు సమాధానాలు సకాలంలో చేరాలని అధికారుల్ని ఆదేశించినట్లు అయ్యన్నపాత్రుడు తెలిపారు.
Also Read:
కొందరిని జైలుకు పంపితేనే... పంట వ్యర్ధాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ప్రతి ఇంటికీ ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే
For More Latest News