Tragic Incident: ఘోర విషాదం.. నీటి కుంటలో పడి సోదరులు దుర్మరణం
ABN , Publish Date - Dec 07 , 2025 | 08:21 PM
అనంతపురం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు.
అనంతపురం, డిసెంబర్ 07: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఇద్దరు అన్నదమ్ముల దుర్మరణం పాలయ్యారు. ఆదివారం మామిడి తోటలో పని చేస్తూ.. నీళ్లు తాగేందుకు వెళ్లిన వీరిద్దరు ప్రమాదవశాత్తు కుంటలో పడి మరణించారు. కళ్యాణ దుర్గంకు చెందిన తలారి నాగేంద్ర (35), తలారి చరణ్ (26) మామిడి తోటలో కూలీలుగా పని చేస్తున్నారు. భోజనం అనంతరం మంచి నీరు తాగేందుకు ఈ సోదరులు ఇద్దరు సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లారు. ఆ క్రమంలో తలారి నాగేంద్ర కాలు జారీ నీటి కుంటలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు సోదరుడు చరణ్ అందులో దిగాడు. నాగేంద్రను రక్షించే క్రమంలో చరణ్ సైతం నీట మునిగాడు. దీంతో వీరిద్దరి ప్రాణాలు కోల్పోయారు.
తోటలో పని చేస్తున్న కూలీలు నీటి కుంట వద్దకు వెళ్లగా.. ఈ అన్నదమ్ముల మృతదేహాలు నీటిలో తేలుతున్నాయి. దాంతో ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు నీటి కుంట వద్దకు చేరుకుని.. ఆ మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం బ్రహ్మసముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై నరేంద్ర కుమార్ ఘటన స్థలం వద్దకు చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం ఈ మృతదేహాలను తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నాగేంద్ర భార్య గర్భవతి అని గ్రామస్తులు తెలిపారు. నాగేంద్ర, చరణ్ మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
దాడి.. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమం..
సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్
For More AP News And Telugu News