Jr NTR : ఆ ఆడియో కాల్స్ బోగస్, జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:55 PM
జూ. ఎన్టీఆర్ అభిమానుల ఆందోళనపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. 'ఆ ఆడియో కాల్స్ నావి కాదు.. అంతా బోగస్' అని ప్రసాద్ అన్నారు. ఆడియో కాల్స్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.
అనంతపురం, ఆగస్టు 17 : జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆందోళనపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించారు. 'ఆ ఆడియో కాల్స్ నావి కాదు.. అంతా బోగస్' అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వివరణ ఇచ్చారు. 'నేను తొలి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని. జూ. ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా. నా ప్రమేయం లేకున్నా నాపేరు ప్రస్తావించారు.. కాబట్టి క్షమాపణలు. ఆడియో కాల్స్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేశా.' అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఈ వివాదానికి సంబంధించి తన వివరణను ఆయన వీడియో రూపంలో తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు.
ఇలా ఉండగా, ఈ ఉదయం అనంతపురం అర్బన్ టీడీపీ ఎంఎల్ఏ దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. అర్బన్ టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించిన జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ వద్దకు వచ్చిన అభిమానులు.. దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ని దూషిస్తూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానితో మాట్లాడిన ఆడియో కాల్ రికార్డ్ గురించి వారు ప్రశ్నించారు. పరిస్థితి చేజారుతుండటంతో అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దగ్గుపాటి లేరని కార్యాలయ సిబ్బంది సమాధానం ఇవ్వడంతో ఆఫీస్ ముందు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బైఠాయించారు.
'తన కట్టె కాలే వరకు టీడీపీతోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలోనే చెప్పారు. టీడీపీకి ఎప్పుడు అవసరం వచ్చినా పని చేస్తానన్నారు. కానీ ఎమ్మెల్యే దగ్గుపాటి ఎందుకు అలా దూషించారో చెప్పాలి. మేము కూడా ఓట్లు వేసి ఉంటేనే మీరు ఎమ్మెల్యేవి అయ్యావ్. నాలుగు గోడల మధ్య కాదు.. ఎన్టీఆర్ అభిమానుల ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలి' అంటూ జూనియర్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. దీనిపైనే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రత్యేక వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. ఇదిలాఉంటే, ఎన్టీఆర్ ప్యాన్స్ రూపంలో కొంతమంది విచ్చిన్నకారులు, గిట్టనివాళ్లు ఆందోళనలోకి చొరబడి మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి