Authority..! : అధిక్కారం..!
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:52 AM
జిల్లాలో పనిచేస్తున్న కీలక ఉన్నతాధికారుల తీరుపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. తాము సిఫార్సు చేసినా.. ఏవేవో చెబుతూ తప్పించుకుంటున్నారని వారు ఆగ్రహంతో ఉన్నారు. చిన్నచిన్న ...
జిల్లా ఉన్నతాధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల అసంతృప్తి
చిన్నచిన్న పనులకూ సాకులు
చెబుతున్నారని విస్మయం
ఫైళ్ల పరిష్కారంపైనా నిర్లక్ష్యం
సీఎం, మంత్రి లోకేశకు ఫిర్యాదు?
బదిలీపై జోరుగా ప్రచారం
అనంతపురం టౌన, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పనిచేస్తున్న కీలక ఉన్నతాధికారుల తీరుపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. తాము సిఫార్సు చేసినా.. ఏవేవో చెబుతూ తప్పించుకుంటున్నారని వారు ఆగ్రహంతో ఉన్నారు. చిన్నచిన్న పనులు కూడా చేయకుండా సాకులు చెబుతున్నారని రగిలిపోతున్నారు. పాలనాపరమైన విధానాల అమలు విషయంలోనూ చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ పథకాల కన్నా సొంత ప్రాపకం కోసం ఉన్నతాధికారి ఆరాట పడుతుంటారనీ, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రావడంలేదనే భావన నేతలు వ్యక్తం చేస్తున్నారని
చెప్పుకుంటున్నారు. బదిలీల సమయంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమకు అనుకూలంగా ఉండే అధికారులను తెచ్చుకుంటుంటారు. జడ్పీ, రెవెన్యూ శాఖల్లో తమకు అనుకూలమైన వారికి అవకాశం కల్పించాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదించినా వాటిని లెక్కచేయకుండా ఇష్టమొచ్చినట్లు పోస్టింగ్‌లు ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికీ పాలనాపరంగా సరైన వ్యవహారాలు సాగడం లేదనే అసంతృప్తి ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విద్యాశాఖలో చేపట్టిన డెప్యుటేషన్ల వ్యవహారంలో ఉన్నతాధికారి వ్యవహరించిన తీరు నేతల మధ్య చిచ్చు రేపినట్లు చర్చలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ హయాంలో నోటిఫికేషన లేకుండానే అర్హత ఉందా, లేదా అని కూడా చూడకుండా డీఈఓ, ఎస్‌ఎ్‌సఏ ఆఫీసులకు టీచర్లను డెప్యుటేషనపై వేసుకున్నారు. కూటమి పాలనలో జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల నేతలు కొందరి పేర్లను ప్రతిపాదించినా.. వాటిని పట్టించుకోకుండా నోటిఫికేషన ఇచ్చి దరఖాస్తులు స్వీకరించి, వైసీపీ హయాంలో ఎస్‌ఎ్‌సఏ, డీఈఓ కార్యాలయంలో పనిచేసిన వారికే మళ్లీ అవకాశం కల్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై విద్యాశాఖాధికారులను అడిగితే తమకు సంబంధం లేదంటూ జిల్లా ఉన్నతాధికారిపైనే చెబుతున్నారని తెలిసింది. డీఈఓ ఆఫీసులో ఏఎ్‌సఓ నియామకంలోనూ జిల్లాకు చెందిన మాజీమంత్రి ప్రస్తుత సీనియర్ ఎమ్మెల్యే చెబుతున్నా.. విద్యాశాఖ అధికారులు కలెక్టర్ పేరు చెబుతూ.. ఇవ్వకుండా నాన్చుతున్నారని సమాచారం. ఇలా విద్యాశాఖ వ్యవహారాల్లో మొత్తం జిల్లా ఉన్నతాధికారి పాత్రే ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వ్యవహారాలపై నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు సమాచారం.
ఫైళ్ల పెండింగ్‌పైనా...
ఆయన జిల్లా ఉన్నతాధికారి. క్షేత్రస్థాయితో పాటు జిల్లాస్థాయిలోనే వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఫైళ్లు పెండింగ్‌ఉండకూడదని పదేపదే ఆదేశిస్తుంటారు. జిల్లా కీలక కార్యాలయంలో మాత్రం వేల ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయని సమాచారం. వాటి పరిష్కారానికి ఆ
ఉన్నతాధికారి శ్రద్ధ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. 10వేలకుపైగా వివిధ శాఖలకు సంబంధించిన ఫైళ్లు కీలక కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయనే చర్చలు వినిపిస్తున్నాయి.
సీఎం, మంత్రి లోకేశకు ఫిర్యాదు?
జిల్లా ఉన్నతాధికారుల వ్యవహారాలను సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశకు ప్రజాప్రతినిధులు, నేతలు తీసుకెళ్లినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందనీ, ఈ కారణంతోనే ఫైళ్లు కదలట్లేదని తెలుస్తోంది. పలు శాఖల్లో నియామకాల విషయంలోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారికి ప్రాధాన్యమిచ్చారనీ, ఇలా అయితే స్థానికంగా తమకు ఇబ్బందులు తప్పవని జిల్లా నేతలు వాపోయినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు కీలక అధికారులు.. త్వరలో బదిలీ కాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....