Budjet : జలధార.. నిధుల వరద
ABN , Publish Date - Mar 01 , 2025 | 01:08 AM
కూటమి ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కరువు జిల్లాపై కరుణ చూపారు. సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం కల్పించారు. వ్యవసాయం, సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశారు. సూపర్ సిక్స్ పథకాల్లో మిగిలిన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయించారు. వైసీపీ పాలనలో నిర్వీర్యమైన కార్పొరేషన్లకు నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, నాయీబ్రాహ్మణ, చేనేత వర్గాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత ఇచ్చేలా నిధులు కేటాయించారు. బీసీలకు అండగా ..
సాగునీటి ప్రాజెక్టులకు రూ.1450 కోట్లు
హంద్రీనీవాకు అత్యధిక ప్రాధాన్యం
4,47,983 మందికి తల్లికి వందనం
ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు
5.45 లక్షల మంది అన్నదాతలకు సుఖీభవ
కరువు జిల్లాను కరుణించిన ఆర్థిక మంత్రి కేశవ్
అనంతపురం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కరువు జిల్లాపై కరుణ చూపారు. సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం కల్పించారు. వ్యవసాయం, సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశారు. సూపర్ సిక్స్ పథకాల్లో మిగిలిన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయించారు. వైసీపీ పాలనలో నిర్వీర్యమైన కార్పొరేషన్లకు నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, నాయీబ్రాహ్మణ, చేనేత వర్గాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత ఇచ్చేలా నిధులు కేటాయించారు. బీసీలకు అండగా నిలిచే ఆదరణ పథకాన్ని పునరుద్దరించారు. బడ్జెట్‌లో రూ.1000 కోట్లు
కేటాయించారు. ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ, రెడ్డి కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు రూ.3,377 కోట్లు కేటాయించారు.
నిధుల వరద
రాష్ట్రంలో పోలవరం తరువాత ఎక్కువ నిధులను హంద్రీనీవాకు కేటాయించారు. ఉమ్మడి జిల్లాకు హంద్రీనీవా సుజల స్రవంతి, హెచఎల్సీ ప్రధాన ప్రాజెక్టులు. వైసీపీ పాలనలో వీటిని నిర్వీర్యం చేశారు. ఐదేళ్లలో నిర్వహణకు మాత్రమే నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆర్థిక మంత్రి కేశవ్.. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు ఏకంగా రూ.1450 కోట్లు కేటాయించారు. ఇందులో హంద్రీనీవా కాలువ విస్తరణకు రూ.250 కోట్లు, లైనింగ్‌కు రూ.780 కోట్లు, భైరవానతిప్పకు రూ.170 కోట్లు, పేరూరుకు రూ.200 కోట్లు కేటాయించారు. మరో రూ. 150 కోట్లను ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులకు కేటాయించారు. హెచఎల్సీకి రూ.71 కోట్లు కేటాయించారు.
టిడ్కో ఆశలకు రెక్కలు
ఉమ్మడి జిల్లాలో టిడ్కో ఇళ్లకు నిధులను కేటాయించారు. మొత్తం 16,272 టిడ్కో గృహాలకు రూ.350 కోట్లు, 25 వేల ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణానికి రూ.250 కోట్లు కేటాయించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలోని 2.82 లక్షల మందికి ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు అందించేందుకు రూ.1450 కోట్లు కేటాయించారు.
సంక్షేమానికి పెద్దపీట
బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు బడ్జెట్ కేటాయించారు. బీసీ కార్పొరేషన కింద సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు 1953 యూనిట్లను ఎంపిక చేశారు. వీటి కోసం దాదాపు రూ.36.80 కోట్లు నిధులు అవసరం. జనరిక్ మందుల షాపుల కోసం రుణాలు అందించేందుకు 72 యూనిట్లకు రూ.5.76 కోట్లు అవసరం. దరఖాస్తుల స్వీకరణ, వెరిఫికేషన ప్రక్రియ పూర్తి అయింది. లబ్ధిదారులకు రుణాలు అందనున్నాయి. బీసీ సంక్షేమశాఖ వసతి గృహాలకు కొత్త భవనాలు, పాతవాటికి మరమ్మతుల కోసం ఉమ్మడి జిల్లాకు రూ.40 కోట్లకుపైగా అవసరం. వీటికి సైతం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
ఎస్సీ సంక్షేమానికి రూ.20,281 బడ్జెట్ కేటాయించారు. ఇప్పటికే సబ్సిడీ రుణాలకు ప్రణాళికలు రూపొందించారు. ఆటోలు, కార్లు, ట్రక్కులు, గొర్రెలు, ఆవులు తదితరాలను కొనుగోలు చేసి, స్వయం ఉపాధి పొందేందుకు ఉమ్మడి జిల్లాకు 1050 యూనిట్లను మంజూరు చేశారు. వీటికి రూ.35.45 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
ఎస్టీ సంక్షేమానికి రూ.8,159 బడ్జెట్ కేటాయించారు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీ కార్పొరేషన కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2125 మంది ఎస్టీ లబ్ధిదారులకు సబ్సిడీ రుణాల రూపంలో రూ.32.43 కోట్లు లబ్ధి చేకూరుంది. వ్యవసాయ బోర్లు లేని వారికి డిగ్గింగ్ బోర్ వెల్స్ స్కీమ్ కింద 20 మందికి రూ.22.80 లక్షలు ఖర్చు చేసి బోర్లు వేయించారు. బోర్లు ఉండి కరెంటు సౌకర్యం లేని వారి కోసం ఎనర్జీస్టేషన ఆఫ్ ఎస్టీ బోర్ వెల్స్ పథకం కింద 690 మందికి రూ.6.62 కోట్లు ఖర్చు చేశారు. ఇవే పథకాలకు తాజాగా రూ.30 కోట్లు అంచనాలు పంపారు. బడ్జెట్‌లో ఆ మేరకు నిధులు కేటాయించారు.
మైనార్టీల సంక్షేమానికి రూ.5,434 కోట్లు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా మైనార్టీ కార్పొరేషన కింద 1268 యూనిట్లకు రూ.19.52 కోట్లు రుణాలను ఇవ్వనున్నారు. క్రిష్టియన కార్పొరేషన కింద జిల్లాలో 5 యూనిట్లకు రూ.9.50 లక్షలు, శ్రీ సత్యసాయి జిల్లాలో మైనార్టీకార్పొరేషన కింద 1144 యూనిట్లకు రూ.17.61 కోట్లు, క్రిష్టియన కార్పొరేషన కింద 05 యూనిట్లకు రూ.6.50 లక్షలు నిర్దేశిస్తూ ప్రణాళికలు రూపొందించారు. ఈ రుణాలకు నిధులు ఇచ్చారు.
ఉచిత గ్యాస్
దీపం పథకానికి బడ్జెట్‌లో రూ.2,061 కోట్ల నిధులు కేటాయించారు. రేషనకార్డు ఉన్న వారికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఇప్పటికే ఒక విడత సిలిండర్ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేవారు. జిల్లాలో 5,05,831 మందికి ఉచితంగా సిలిండర్లు అందజేస్తున్నారు.
ఆరోగ్య భద్రత
ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం బీమాతో భద్రత కల్పిస్తోంది. బడ్జెట్‌లో ఆరోగ్యం, వైద్య విద్యకు ఆరుశాతం నిధులను కేటాయించారు. నిరుపేదలకు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. తాజాగా ప్రతి కుటుంబానికి ఉచితవైద్యం అందించేందుకు ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొచ్చారు. ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. తద్వారా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం పొందే సౌలభ్యం కలుగుతుంది. జిల్లాలో 1.80 లక్షల కుటుంబాలకు ఈ పథకం వరంగా మారనుంది.
అన్నదాతా సుఖీభవ
ఉమ్మడి జిల్లాలో 5.45 లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. వైసీపీ పాలనలో రైతు భరోసా, పీఎం కిసాన లబ్ధి పొందారు. కూటమి అధికారంలోకి రాగానే వాటి స్థానంలో మెరుగైన పథకం.. అన్నదాతా సుఖీభవ తెచ్చారు. ఏడాదికి ఒక్కో రైతుకు రూ.20 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ పథకానికి రూ.6,300 కోట్లు కేటాయించారు.
ఉచిత విద్యుత...
ఎస్సీ, ఎస్టీ, నేతన్నలు, నాయీబ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత అందించనుంది. జిల్లాలో 9 వేల మంది లబ్ధి పొందుతారు. వీరికి నెలకు రూ.27.34 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత సరఫరా కోసం బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉచిత విద్యుత పొందుతాయి. వీరికోసం నెలకు రూ.2.27 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. పవర్‌లూమ్స్, నాయిబ్రాహ్మణలకు సబ్సిడీతో విద్యుత లబ్ధి చేకూరుస్తున్నారు. బడ్జెట్‌లో విద్యుతశాఖకు రూ.13,600 కోట్లు కేటాయించారు. జిల్లాకు 1300 ట్రాన్సఫార్మర్లు, 2500 కి.మీ. విద్యుత్తు కండక్టర్ (వైర్) అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. బడ్జెట్ నిధులు మంజూరుకావడంతో ఈ సమస్య పరిష్కారం కానుంది.
చంద్రబాబుకు కృతజ్ఞతలు
జిల్లా రైతాంగానికి జీవనాధారమైన సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో అత్యధిక నిధుల కేటాయింపునకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జిల్లా రైతాంగానికి సాగునీరందిస్తే... సిరులు పండిస్తారంటూ చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటనకొచ్చిన ప్రతిసారీ చెప్పడంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పేవారు. ఆ మాటకు కట్టుబడిన నాయకుడిగా, పాలకుడిగా చంద్రబాబు ప్రాజెక్టులకు రూ. 3200 కోట్లు నిధులు బడ్జెట్‌లో కేటాయించారు. జిల్లా ప్రజాప్రతినిధులుగా రైతాంగం రుణం తీర్చుకోవాలని అడిగిన వెంటనే నిధులు కేటాయించేలా చూడటం సంతోషకరం.
-పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి
సూపర్ సిక్స్ హామీలకు చిల్లు...
వార్షిక బడ్జెట్ అంతా అంకెల గారడీలాగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మోసపూరిత నైజాన్ని చాటుకుంటూ సూపర్ సిక్స్ హామీలకు చిల్లు పెట్టారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తామని చెబుతూనే బడ్జెట్‌లో కేటాయింపులు మాత్రం అరకొరగా చేశారు. ఈ రెండు పథకాల్లో భారీగా లబ్ధిదారులను కోత పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు ప్రతినెలా రూ. 1500లుఇస్తామని చెప్పిన హామీకి సంబంధించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో కంటితుడుపు చర్యగా కేటాయింపులున్నాయి. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. నిరుద్యోగ భృతి కనిపించలేదు. పేదల వ్యతిరేక బడ్జెట్‌గా ఉంది.
-అనంత వెంకటరామిరెడ్డి,
వైసీపీ జిల్లా అధ్యక్షుడు
మరిన్ని అనంతపురం వార్తల కోసం....