Ananthapuram News: కాటేస్తున్న కాలభైరవులు.. మూడు నెలల్లోనే 106 కేసులు నమోదు
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:14 PM
వీధికుక్కలతో అక్కడి ప్రజలు భయపడాల్సి వస్తోంది. ఏదైనా పనిమీద బయటకు వెళితే.. తిరిగి ఇంటికి జాగ్రత్తగా వస్తామన్న నమ్మకం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ప్రధానంగా వీధికుక్కలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కేవలం మూడు నెలల్లోనే 106 కేసుల నమోదయ్యాయంటే ఇక్కడి పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
- చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
- ఆందోళనలో ఓడీసీ మండల ప్రజలు
ఓబుళదేవరచెరువు(శ్రీ సత్యసాయి): వీధి కుక్కల దాడులతో మండల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వీధుల్లోనే కాకుండా పాఠశాలల్లోకి సైతం కుక్కలు చొరబడి కరుస్తున్నాయి. 15 రోజుల కిందట మండలకేంద్రంలోని చెరువు ప్రాంతంలోని మదీనామసీద్ వెనుకవైపున జిలేబీ బాబ్‌జాన్ కుమారుడు అఖీబ్‌పై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. వెంకటసాయి ఐటీఐ కళాశాలలో పనిచేస్తున్న నారాయణస్వామిపై బుధవారం కుక్క దాడి చేసి గాయపరిచింది. కదిరి-హిందూపురం(Kadiri-Hindupuram) రహదారిపై విచ్చలవిడిగా వీధి కుక్కలు ద్విచక్రవాహనాలకు అడ్డు వస్తుండటంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. గడచిన మూడు నెలల్లోనే 106 మంది యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ప్రభుత్వ వైద్యాధికారి భానుప్రకాష్ నాయక్ తెలిపారు.
వీరిలో ఎక్కువ శాతం చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. ప్రధానంగా చికెన్ సెంటర్‌ల వద్ద వ్యర్థ పదార్థాలకు అలవాటు పడ్డ కుక్కలు అవి దొరకనప్పుడు మనుషులపై దాడులకు తెగబడుతున్నాయి. మండల వ్యాప్తంగా వీధికుక్కలు పెరిగిపోతున్నా వాటిని నియంత్రించాలన్న ఆలోచన అధికారుల్లో లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఓడీసీ యువసైన్యం సభ్యులు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి ఫిర్యాదు చేశారు. మండలంలో మూడు నెలల్లోనే 106 కుక్క కాటు కేసులు నమోదైతే వాటి నియంత్రణకు ఏం చేస్తున్నారని మండల అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు. నెలాఖరులోగా కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

చెప్పి .. చెప్పి.. సాలైపోయింది...
మండల కేంద్రంలో కుక్కల సంచారాన్ని నివారించి, దాడులను అరికట్టాలని పలుమార్లు అధికారులకు విన్నవించాం. అయినా అధికారుల లో ఏమాత్రం స్పందన లేదు. రోజు రోజుకు కుక్కలు కరవడం పెరుగుతోందే తప్ప, సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లాం.
-లడ్డూ బాబ్‌జాన్, ఓడీచెరువు
భయమేస్తోంది...
కుక్కల దెబ్బకు మండల కేంద్రంలో తిరగాలంటే భయమేస్తోంది. పదుల సంఖ్యలో కుక్కలు గుంపులు గుంపులుగా వస్తున్నాయి. రోడ్డుకు అడ్డంగా వచ్చిన సమయంలో అనేకమంది ద్విచక్రవాహనదారులు కిందపడి గాయపడ్డారు. అధికారులు స్పందించి తక్ష ణం నియంత్రణ చర్యలు తీసుకోవాలి.
-మోహన్‌రెడ్డి, యం.కొత్తపల్లి
ఈ వార్తలు కూడా చదవండి..
ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
Read Latest Telangana News and National News