Ananthapur News: జై పసుపు జెండా.. టీడీపీ ఖాతాలో ఒకే రోజు రెండు పీఠాలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:18 AM
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే రోజు రెండు పీఠాలు వైసీపీ నుంచి టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఇద్దరు మహిళలు పసుపు జెండాకు జై కొట్టించి, పదవులను దక్కించుకున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్‌గా తలారి గౌతమి, రామగిరి ఎంపీపీగా కప్పల సాయిలీల ఎన్నికయ్యారు. రామగిరి ఎంపీపీ ఎన్నికపై కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
- కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్‌గా తలారి గౌతమి
- రామగిరి ఎంపీపీగా కప్పల సాయిలీల
కళ్యాణదుర్గం(అనంతపురం): అనుకున్నట్లుగానే కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం అయ్యింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి వసంతబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓటింగ్‌కు 22 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. వైసీపీ తరఫున 14వ వార్డుకు చెందిన లక్ష్మణ్ణ, టీడీపీ తరఫున 15 వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి చైర్మన్ పీఠం కోసం పోటీ పడ్డారు. టీడీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ,

ఎమ్మెల్యేలు ఇద్దరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీకి 11 మంది, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. మరో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి 13 మంది టీడీపీ సభ్యులు చేతుతెత్తి నూతన చైర్మన్‌ను ఎన్నుకున్నారు. దీంతో తలారి గౌతమి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆమెకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వసంతబాబు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కాగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకుండా, విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో వైసీపీ మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఇక మీదట కళ్యాణదుర్గంలో అభివృద్ధి పనులు వేగంగా చేసేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు మార్గం సుగమమైంది.

వైసీపీ నేత తలారి రంగయ్యకు షాక్
ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు వైసీపీ కౌన్సిలర్లు సురేష్, ప్రభావతి గైర్హాజరు కావడం పరోక్షంగా టీడీపీకి మద్దతు ఇచ్చినట్లైంది. తమ పార్టీ కౌన్సిలర్లు గట్టుదాటరని ధీమాగా ఉన్న రంగయ్యకు వీరిద్దరు గైర్హాజరవడం షాక్ ఇచ్చినట్లైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణీంద్ర కూడా ఇటీవల టీడీపీలో చేరి బహిరంగంగానే వైసీపీ నేత తలారి రంగయ్యతో సర్వనాశం అయ్యామంటూ విమర్శలు గుప్పించడం తీవ్ర దుమారం రేపింది.
ఈ విజయం అభివృద్ధికి నాంది..
- విజయోత్సవ ర్యాలీలో ఎంపీ అంబికా, ఎమ్మెల్యే అమిలినేని
మున్సిపాలిటీలో టీడీపీ విజయం అభివృద్ధికి నాంది అని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తలారి గౌతమి ఎన్నికైన నేపథ్యంలో గురువారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రజావేదిక వరకు ర్యాలీ సాగింది. అనంతరం ఎమ్మెల్యే, ఎంపీ విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీ బలం రాష్ట్రంలోనే కాదు మున్సిపాలిటీలో కూడా 11కు పడిపోయిందని చమత్కరించారు.
వైసీపీ ఎన్ని ఎత్తుగడలు, అడ్డంకులు సృష్టించినా చివరికీ టీడీపీనే విజయం వరించిందన్నారు. ఇక మీదట కళ్యాణదుర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయన్నారు. మున్సిపాలిటీలో ఇప్పటికే సుమారు రూ.6కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు అడ్డమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మార్గదర్శకత్వంలో మున్సిపాలిటీ, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
రామగిరి ఎంపీపీగా కప్పల సాయిలీల ఏకగ్రీవం..
రామగిరి: ఎంపీపీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల నిర్వహణ అధికారి సంజీవయ్య ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్నిక సమావేశం గురువారం నిర్వహించారు. ఈసమావేశానికి నలుగురు ఎంపీటీసీలు హాజరయ్యారు. ఇందులో ఒకరు టీడీపీ నుంచి గెలవగా మిగిలిన ముగ్గురూ వైసీపీ నుంచి టీడీపీలో చేరినవారు. ఉదయం 11.30 ఎన్నికలు నిర్వహించారు. వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వు కావడంతో కుంటిమద్ది ఎంపీటీసీ సభ్యురాలు కప్పల సాయిలీలను ఎంపీటీసీ శ్రీనివాసులు ప్రతిపాదించారు.
దీన్ని సంపత్‌కుమార్, కర్రెన్న బలపరిచారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎంపీపీగా ఎన్నికైన సాయిలీలకు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రం అందజేసి, ప్రమాణం చేయించారు. సాయిలీలకు ఎంపీడీఓ గంగావతి, ఏఓ ప్రసాద్ కార్యాలయం సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం ఎంపీపీ, ఎంపీటీసీలు ఎమ్యెల్యే పరిటాల సునీతను కలిశారు. ఎమ్మెల్యే నూతన ఎంపీపీకి శుభాకాంక్షలు తెలియజేసి, సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలాభివృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని ఎంపీపీకి, ఎంపీటీసీలకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..
Read Latest Telangana News and National News