Ananthapur News: మూడు ఓవర్లు.. రూ.లక్షల్లో బెట్టింగులు
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:05 AM
నియోజకవర్గ కేంద్రమైన ధర్మవరంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఒక్కో ఓవర్‌కు ఒక్కో పందెం కాస్తున్నారు. పట్టణంలోని క్రీడా మైదానంలో జరిగే పోటీలు బెట్టింగ్‌లకు అడ్డాగా మారాయనే విమర్శలొస్తున్నాయి. ఇక్కడ జరిగే మ్యాచ్‌లో కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఉంటాయి. వివరాలిలా ఉన్నాయి.
- ఒక్కో మ్యాచ్‌కు రూ.లక్షలు పందెం
- ధర్మవరం క్రీడామైదానంలో యథేచ్ఛగా క్రికెట్ బెట్టింగ్
ధర్మవరం(అనంతపురం): ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. మామూలుగా క్రికెట్ మ్యాచ్ అంటే 20 ఓవర్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం మూడు ఓవర్లు మాత్రమే ఉంటాయి. కొత్త విధానానికి ధర్మవరం(Dharmavaram) క్రీడామైదానాన్ని వేధికగా మార్చారు కొందరు ప్రబుద్దులు. ఈ క్రీడామైదానం డీఎస్పీ కార్యాలయానికి, వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు అతి దగ్గర్లో ఉన్నాయి. ఈ క్రీడామైదానంలో బెట్టింగ్ క్రికెట్ చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివెళ్తున్నారు.
ఈ క్రికెట్‌లో బండరాయి వికెట్లు, రబ్బరు బాల్‌తో క్రికెట్ ఆడుతున్నారు. ఇందులో ప్రతిబాల్‌ను ఉతకడమే మ్యాచ్ ప్రత్యేకత. ఒక్కో టీంకు ఐదుగురు చొప్పున రెండు టీంలకు మొత్తం 10 మంది క్రీడాకారులు ఉంటారు. మ్యాచ్ మొత్తం మూడు ఓవర్లే. ఏ టీం మూడు ఓవర్లలో ఎక్కువ స్కోరు చేస్తుందో ఆ టీం గెలిచినట్టే. ఒక్కో మ్యాచ్‌కు రూ.లక్షలు పందెం. మూడు ఓవర్లలో ఒక టీం 50 పరుగులు చేస్తే మరో టీం 51 పరుగులు చేసిందంటే ఆ టీం గెలిచినట్టే. ఈ బెట్టింగ్ క్రికెట్‌లో ఒక్కో మ్యాచ్‌కు రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు ఆడుతున్నారు. కేవలం గంటలోపే మ్యాచ్ మొత్తం ముగుస్తుంది.

వారానికి మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే బెట్టింగ్ క్రికెట్ ఆడుతూ లక్షల్లో బెట్టింగ్ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రీడామైదానానికి డీఎస్పీ కార్యాలయం, వన్‌టౌన్ పోలీసు స్టేషన్ దగ్గరలో ఉన్నా, ఇంత పెద్ద ఎత్తున బెట్టింగ్ క్రికెట్ ఆడుతున్నా, రోజు లక్షల్లో చేతులు మారుతున్నా ఇదేమి పట్టనట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారు. కొంతమంది పోలీసులు ఈ క్రికెట్ మ్యాచ్ ఆడే క్రీడాకారులతో సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
Read Latest Telangana News and National News