Share News

Ananthapur News: గంజాయి గ్యాంగ్ అరాచకం.. తరచూ గొడవలు, దాడులు

ABN , Publish Date - Dec 11 , 2025 | 11:58 AM

సోమందేపల్లి మండలంలో గంజాయి గ్యాంగ్ అరాచకాలు పేట్రేగిపోతున్నాయనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారని, దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు.

 Ananthapur News: గంజాయి గ్యాంగ్ అరాచకం.. తరచూ గొడవలు, దాడులు

- బెంబేలెత్తుతున్న జనం

- అరికట్టడంలో విఫలమవుతున్న పోలీసులు

- సోమందేపల్లిలో మత్తు బారిన యువత

సోమందేపల్లి(అనంతపురం): మండల కేంద్రంలో గంజాయి గ్యాంగ్‌లు పేట్రేగిపోతున్నాయి. మత్తుకు అలవాటుపడిన యువత.. ఆ వ్యసానాన్ని తీర్చుకునేందుకు విక్రయాలకు దిగుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి ఇతర ప్రాంతాలకెళ్లి కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. దానిని ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఆ మత్తులో అరాచకాలు చేస్తున్నారు. గొడవలకు దిగుతున్నారు. విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. దీంతో మండల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గంజాయి మత్తులో ఉన్న యువకులు.. ఎప్పుడు, ఎవరిపై దాడులు చేస్తారోనని భయాందోళనలు చెందుతున్నారు. గంజాయిని అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి ముఠాలు పుట్టుకొచ్చాయి. యువతను మత్తుకు బానిసగా మార్చేశాయి. పల్లెలు, పట్టణాల నుంచి ఉద్యోగ, ఉపాధి, చదువుల కోసం నగరాలకు వెళ్లిన యువకులు అక్కడ ఏర్పడిన స్నేహాల కారణంగా గంజాయికి అలవాటు పడుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈజీ మనీకి అలవాటుపడి కొందరు యువకులు పల్లెలు, పట్టణాలకు దందా విస్తరించినట్లు తెలిసింది. వైసీపీ హయాంలో అడ్డుఅదుపులేకుండా ఈ దందాను కొందరుసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు సైతం తరలించి అక్రమార్జనకు తెరలేపినట్లు విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక విక్రేతలపై ఉక్కుపాదం మోపింది.


pandu4.2.jpg

అక్రమార్కుల పనిపట్టడానికి ఈగల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసింది. అయినా గంజాయి క్రయవిక్రయాలు ఆగలేదు. గతంలో వివిధ ప్రాంతాలకు చెందిన విక్రేతలు గంజాయిని నేరుగా యువతకు చేర్చేవారు. ప్రస్తుతం అలవాటుపడిన యువకులే స్వయంగా వెళ్లి తెచ్చుకుంటున్నట్లు సమాచారం. సోమందేపల్లిలో గంజాయికి బానిసైన యువత పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, కియ అనుబంద సంస్థల్లో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికుల నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. కొందరు కేజీల్లో కొనుగోలుచేసి వాటిని యాభై, వంద గ్రాముల ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు సమాచారం.


pandu4.3.jpg

సోమందేపల్లిలో తరచూ ఏదో ఘటన జరుగుతూనే ఉంది. చాలా వెలుగులోకి రావడంలేదు. బహిర్గతమైనా పెద్దల జోక్యంతో స్టేషన్‌ వరకు రావడంలేదు. మరికొన్ని ఘటనల్లో పోలీసులపై పెద్దల ఒత్తిళ్ల కారణంగా చర్యలు లేకుండా బయటపడుతున్నారు. గంజాయి వ్యవహారంలో రాజకీయ నాయకుల పిల్లలు, సమీప బంధువులు, అనుచరుల సంబంధికులు అధికంగా ఉంటుండటంతో పోలీసులు కట్టడి చేయలేకపోతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. పోలీసులకు సమాచారం ఉన్నా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న చర్చ నడుస్తోంది. గంజాయిని పూర్తిస్థాయిలో కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


గంజాయిని సమూలంగా నిర్మూలిస్తాం..

సోమందేపల్లిలో గంజాయుని సమూలంగా నిర్మూలిస్తాం. ఇప్పటికే గంజాయి సేవిస్తున్న యువకులు, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చాం. పట్టణంలో గంజాయి బ్యాంచ్‌లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాం. గంజాయితో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు. కేసులు నమోదు చేస్తాం.

-రాఘవన్‌, సీఐ, పెనుకొండ


ఈ వార్తలు కూడా చదవండి..

2030 నాటికి అమెజాన్‌ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు

3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2025 | 11:58 AM