Amit Shah : పార్టీని బలోపేతం చేయండి
ABN , Publish Date - Jan 20 , 2025 | 04:29 AM
‘రాష్ట్రాభివృద్ధికి నిధులు వరదలా ఇస్తున్నాం. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతాయి.
రాష్ట్రాభివృద్ధికి నిధులు వరదలా ఇస్తున్నాం
చాలా ఇచ్చాం.. మరిన్ని ఇస్తాం.. ప్రజల్లోకి వెళ్లి అవన్నీ చెప్పండి
బీజేపీ రాష్ట్ర నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం
జగన్ కేసులు తేల్చాలి: ఆదినారాయణ రెడ్డి
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రాభివృద్ధికి నిధులు వరదలా ఇస్తున్నాం. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతాయి. రైల్వే జోన్ ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమైంది. ప్రజల్లోకి వెళ్లి చెప్పండి. పార్టీని బలోపేతం చేయండి’ అంటూ బీజేపీ రాష్ట్ర నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి తదితరులు ఆదివారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ఈ సందర్భంగా వారిని అమిత్ షా ప్రశ్నించగా అంతా బాగానే ఉందని, ప్రజలు కూటమి పాలన పట్ల సంతృప్తిగానే ఉన్నారని నేతలు బదులిచ్చారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు 11,440 కోట్లు కేంద్రం ఇవ్వడంపై మంచి స్పందన వచ్చిందని నేతలు చెప్పగా.. ‘అంతే కాదు ఇంకా చాలా ఇచ్చాం. మరిన్ని ఇస్తాం. రాష్ట్ర అభివృద్ధిలో నరేంద్ర మోదీ పూర్తిగా సహకరిస్తారు. విశాఖపట్నంలో ఇటీవల రెండు లక్షల కోట్లతో అభివృద్ధి పనులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లండి’ అని అమిత్‌షా నిర్దేశించారు. కూటమి ధర్మం తప్పకుండా పార్టీని బలోపేతం చేసుకోవడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని అమిత్‌షా సూచించగా.. రాష్ట్ర నేతలు సరే అన్నారు. కాగా, జగన్ రాష్ట్రాన్ని దోచేశాడని, అన్ని కేసులున్నా బయట స్వేచ్ఛగా తిరగడం ప్రజలకు నచ్చట్లేదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. జగన్ కేసుల విషయంలో ముందడుగు పడితే బాగుంటుందని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి తొక్కిసలాట ఘటన గురించి అమిత్ షా ఆరా తీసినట్టు తెలిసింది.