Share News

Pawan Kalyan: అవకాశాల రాజధాని

ABN , Publish Date - May 03 , 2025 | 04:20 AM

అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. యువత ఉపాధికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమరావతి అవకాశాల కేంద్రంగా మారనుందన్నారు

Pawan Kalyan: అవకాశాల రాజధాని

  • ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లక్కర్లేదు

  • మోదీ సహకారం.. చంద్రబాబు అనుభవంతో ప్రపంచస్థాయి నగరంగా అమరావతి తథ్యం

  • రైతుల కష్టాలు నాకు గుర్తున్నాయి

  • జవాబుదారీగా ఉంటాం.. రాజధాని నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): ‘‘రాజధాని అమరావతి ప్రపంచస్థాయి, సర్వశ్రేష్ఠ రాజధానిగా నిలుస్తుంది. కేవలం ఆర్కిటెక్చర్‌, కాంక్రీట్‌ జంగిల్‌లా కాకుండా... జవాబుదారీతనానికి, న్యాయానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ కలిసి అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతారు. మన యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లాంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా... అమరావతే అవకాశాల రాజధానిగా నిలుస్తుంది’’... అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు, జగన్‌ హయాంలో వారు ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావిస్తూ ఉద్వేగంగా ప్రసంగించారు. ముఖ్యాంశాలు..

నాడు చెప్పాం.. నేడు చేస్తున్నాం

అప్పట్లో దివి సీమ తుఫాను వచ్చి అందరి ఆశలు తుడిచిపెట్టినట్లు... గత ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు, అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 మాత్రమే గుర్తుకు వచ్చేలా చేసింది. రాజధాని కోసం 34వేల ఎకరాలు ఇచ్చిన 29వేల పైచిలుకు రైతులు గత ఐదేళ్లు నలిగిపోయారు. రోడ్ల మీదకు వచ్చారు. ముళ్ల కంచెల మధ్య కూర్చున్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. కేసులు ఎదుర్కొన్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సమయంలో... తమ కన్నీళ్లు తుడిచే వారు ఉన్నారా... మా కష్టాలు ప్రధాని మోదీకి తెలుస్తాయా అని నన్ను అప్పట్లో అడిగారు. మోదీకి తెలియకుండా ఏదీ ఉండదు... అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆనాడే మాట ఇచ్చాం. గత ప్రభుత్వం ఈ త్యాగాన్ని అవమానించింది.


మూడు రాజధానుల పేరుతో అమరావతిని అగౌరవపరిచింది. మగవాళ్లు పోరాటం ఆపివేస్తే మహిళలు ఆంధ్రుల పౌరుషం చూపించారు. మీ సాహసం, సహనం అందరికీ ప్రేరణగా నిలుస్తాయి. మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీకు అయిన గాయాలు అన్నీ గుర్తున్నాయి. మరీ ముఖ్యంగా... మహిళా రైతుల పాత్ర మరిచిపోలేం. జవాబుదారీగా ఉంటాం. అప్పుడు చెప్పినట్లుగానే... ఇప్పుడు ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనుల పునఃప్రారంభం జరుగుతోంది. అది కూడా... ఆదిశంకరాచార్యుడి జయంతి సందర్భంగా జరుగుతుండటం ఎంతో ఆనందం కలిగిస్తోంది. ధర్మం కోసం మనం నిలబడితే... ధర్మం మన పక్షాన నిలబడుతుంది. కేంద్రంలో, రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీయే ప్రభుత్వం ఉంది. అభివృద్ధి వేగంగా సాగుతోంది.గత ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వని కారణంగా కేంద్రం నుంచి వచ్చే వేల కోట్లు నష్టపోయాం. ఇప్పుడు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సమాఖ్య స్ఫూర్తితో పని చేస్తున్నాయి. నేడు అమరావతి పనులతోపాటు రహదారులు, రైల్వే, పారిశ్రామిక, రక్షణకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తున్నారు. నేను ఎన్నికల సమయంలో అవనిగడ్డలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మిస్సైల్‌ టెస్ట్‌ రేంజ్‌కు శంకుస్థాపన జరుగుతుండటం ఆనందంగా ఉంది.


ప్రధానికి దుర్గమ్మ శక్తినివ్వాలి...

కశ్మీర్‌లో ఉగ్ర దాడి నేపథ్యంలో... క్లిష్ట సమయంలోనూ.. దేశమంతా యుద్ధంవైపు వెళ్తున్న సమయంలోనూ ప్రధాని ఇక్కడికి వచ్చారు. లోపల ఎంతో వేదన ఉన్నప్పటికీ... అమరావతి రైతులు చేసిన త్యాగాలు మరచిపోకూడదనే ఆయన ఇక్కడికి వచ్చారు. రాష్ట్రం పట్ల ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనం. పహల్గాం దాడి జరిగిన రోజు... చీకటి రోజు. కశ్మీర్‌లో చిందిన నెత్తురు... దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు ఉంటాయని మోదీ దేశ ప్రజలకు మాట ఇచ్చారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని నడిపిస్తున్న ప్రధానికి... కనక దుర్గమ్మ, భవానీ మాత ఆశీస్సులు, శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. జై భవానీ, జై భారత్‌, జైహింద్‌.

మోదీకి దేశమే ఇల్లు.. అమరావతి రాష్ట్రానికి ఇల్లు

ప్రధాని మోదీ గతంలో సన్యాశ్రమ దీక్షలో ఉన్నప్పుడు ‘అనికేత్‌’ అనే పేరు పెట్టుకున్నారు. దాని అర్థం... ఇల్లు లేని వాడు, పరమశివుడు అని అర్థం. కానీ... అలాంటి వ్యక్తి నేడు ఐదు కోట్ల తెలుగు వారి కోసం, మనందరికీ ఇల్లు లాంటి రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తున్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు... కామాఖ్య నుంచి ద్వారక వరకు.. ఉన్న. దేశాన్నే ఆయన తన ఇల్లుగా చేసుకున్నారు.

చంద్రబాబు విజన్‌.. దక్షత...

చంద్రబాబు విజనరీ లీడర్‌. ఒకప్పుడు రాళ్లు, రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి. 20 ఏళ్ల ముందుకు వెళ్లి ఆలోచించే నాయకుడు. రాష్ట్రానికి అలాంటి నేత సీఎం కావాలని ఆకాంక్షించాం. అదే జరిగింది. చంద్రబాబు సైబరాబాద్‌ను ఎంతో అద్భుతంగా రూపకల్పన చేశారు. ఆయన అనుభవం, దక్షత, పాలనా సామర్థ్యంతో అమరావతినీ అలాగే అభివృద్ధి చేస్తారు. ఈ నగరం తెలుగు వారికే కాదు... దేశానికే తలమానికంగా ఉంటుంది.


ఇవి కూడా చదవండి

Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Updated Date - May 03 , 2025 | 06:46 AM