Adavipalle reservoir: వైసీపీ పాపం.. ఆ ప్రాజెక్టుకు శాపం..
ABN , Publish Date - Sep 29 , 2025 | 10:22 AM
హంద్రీ-నీవా పథకం ద్వారా కేవీ పల్లె మండలం అడవిపల్లె వద్ద రిజర్వాయర్ నిర్మించి కరువు పీడిత ప్రాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం..
పీలేరు, సెప్టెంబరు 29: హంద్రీ-నీవా పథకం ద్వారా కేవీ పల్లె మండలం అడవిపల్లె వద్ద రిజర్వాయర్ నిర్మించి కరువు పీడిత ప్రాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం సర్కారు తలపోసింది. కేవీ పల్లె, పీలేరు, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల, పాకాల, ఐరాల, పూతలపట్టు, తవణంపల్లె, బంగారుపాళెం, చిత్తూరు, గుడిపాల, పెనుమూరు మండలాల్లోని 80 వేల ఎకరాలకు సాగునీరు, అనేక వందల గ్రామాలకు తాగునీరు అందేలా రూపకల్పన చేశారు. జలయజ్ఞంలో అడవిపల్లె, రిజర్వాయర్ నిర్మాణాన్ని 2006లో రూ.55.59 కోట్లతో ప్రారంభించారు. 2006లో ప్రారంభమైన మొదటి దశ పనులు 2016లో పూర్తయ్యాయి. అప్పట్లో ఆ ప్రాజెక్టు పరిశీలనకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన చంద్రబాబునాయుడు అడవిపల్లె రిజర్వాయర్ సామర్థ్యం గురించి తెలుసుకుని మరో టీఎంసీ పెంచి అక్కడి నుంచి పైపు లైన్ల ద్వారా చిత్తూరు పట్టణానికి తాగు నీరు అందిస్తానని ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి నిర్మాణం చేయడానికి 2016లో అధికారులు రూ.29.21 కోట్లతో పనులు ప్రారంభించారు.
టీడీపీ హయాంలో పరుగులు పెట్టిన రిజర్వాయర్ పనులు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిలిచిపోయాయి. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ పాలకులు గానీ, అధికారులు గానీ దాని గురించి పట్టించుకోకపోవడంతో అది అసంపూర్తిగా మిగిలిపోయింది. గొలుసుకట్టు విధానంలో నిర్మితమైన ప్రాజెక్టు కావడంతో ఎగువన రాయచోటి ప్రాంతంలోని రిజర్వాయర్లు నిండితేగానీ అడవిపల్లె రిజర్వాయర్ నిండే పరిస్థితి లేదు. దీంతో పీలేరు నియోజకవర్గానికి సంజీవని వంటి ఆ ప్రాజెక్టు పూర్తిగా అటకెక్కింది. అయితే పీలేరు ఎమ్మెల్యేగా 2024లో గెలుపొందిన నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తన తొలి అసెంబ్లీ ప్రసంగంలోనే అడవిపల్లెను ప్రస్తావించడం ద్వారా దానిని మళ్లీ వెలుగులోకి తెచ్చారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా అడవిపల్లె రిజర్వాయర్ నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యం, దాని వెనకున్న కారణాలు, వాటిని అధిగమించడానికి ఉన్న అవకాశాలు, అవసరమయ్యే నిధుల గురించి కూలంకషంగా ప్రభుత్వానికి తెలియజేశారు. ఆయన కృషి ఫలించి ఆ రిజర్వాయర్ పనులు మళ్లీ మొదలవుతాయేమోనన్న ఆశ పీలేరు నియోజకవర్గ రైతాంగంలో చిగురిస్తోంది.
ప్రతిపక్షంలో వద్దు...అధికారంలో ముద్దు..
వైసీపీ నాయకులు ఎందుకనో ముందు నుంచి ఆడవిపల్లె ప్రాజెక్టుపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. కానీ చంద్రబాబు ప్రతిపాదించిన చిత్తూరు పట్టణానికి పైపులైను పనులపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆడవిపల్లె ప్రాజెక్టులోని నీరంతా పీలేరు నియోజకవర్గానికే పరిమితం చేయాలని, చుక్క నీరు కూడా బయబకు ఇవ్వమంటూ ధర్నాలు, రాస్తారోకోలు, పాత్రికేయ సమావేశాలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక గుట్టుచప్పుడు కాకుండా పైపులైను పనులు పూర్తి చేసేశారు. అధికార పార్టీ నేతల కారణంగా అడవిపల్లె ప్రాజెక్టు నుంచి చిత్తూరు సమీపంలోని ఎన్టీఆర్ జలాశయం వరకు సుమారు రూ.300 కోట్లతో పైపులైను నిర్మించారు. ఆ పనుల్లోనూ స్థానిక నాయకులకు ఆమ్యామ్యాలు ముట్టాయని అప్పట్లో పెద్దఎత్తున పుకార్లు చెలరేగాయి. పైప్ లైను నిర్మాణంపై చూపిన శ్రద్ధలో పావు వంతు ప్రాజెక్టులోకి నీరు తేవడంపై పెట్టి ఉంటే బావనుండే దని పీలేరు నియోజకవర్గ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
పూడిపోయిన హంద్రీ-నీవా కాలువలు..
పీలేరు, కేవీ పల్లె మండలాల్లోని హంద్రీ-నీవా కాలువలు పిచ్చి మొక్కలతో నిండిపోవడమే కాకుండా చాలాచోట్ల పూడిపోయాయి. హంద్రీ-నీవా పథకంలో చిట్టచివరి నియోజకవర్గం కావడం. అప్పటి పీలేరు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందే విధంగా రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఆ కాలువలన్నీ పూడిపోయే దుస్థితికి చేరుకున్నాయి. అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎందుకనో వైసీపీ నాయకులు అడవిపల్లె గురించి పట్టించుకోలేదని, అది సమగ్రంగా పూర్తయి ఉంటే పీలేరు నియోజకవర్గ రైతాంగం లాభపడినంతగా మరే నియోజకవర్గ ప్రజలు లాభపడి ఉండరని పలువురు విశ్రాంత ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆడవిపల్లె పనులను గాడిలో పెట్టాలని వారు కోరుతున్నారు.
Also Read:
Salman Ali Agha Cheque: పాకిస్థాన్ కెప్టెన్ తీరు చూడండి.. రన్నరప్ చెక్కును ఎలా విసిరాడంటే..
Baby's First Hair Cut: చిన్నపిల్లలకు పుట్టెంటుకలు తీయడం వెనుక శాస్త్రీయ కారణం ఉందా?
For More Andhra Pradesh News and Telugu News..