Share News

TG News: పాత ఫైళ్లతో డబ్బులు డ్రా చేసిందెవరు?

ABN , Publish Date - May 26 , 2024 | 09:08 AM

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పేషీలో ఓ ఉద్యోగి పాత ఫైళ్ల (ఎంబీ బుక్కు)పై బదిలీపై వెళ్లిన కమిషనర్‌ సంతకాలతో డబ్బులు డ్రా చేసిన వైనంపై ఇంటెలిజెన్స్‌ పోలీసులు దృష్టి సారించారు. ఈ తతంగంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘పాత ఫైళ్లపై బిల్లులు’ అనే కథనం ప్రచురించింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్‌ అధికారులు నాలుగురోజులుగా కూపీ లాగుతున్నారు.

TG News: పాత ఫైళ్లతో డబ్బులు డ్రా చేసిందెవరు?
warangal

  • బల్దియాలో ఇంటెలిజెన్స్‌ పోలీసుల ఆరా

  • కాంట్రాక్టర్లకు అధికారుల

  • మధ్య వారధిపై విచారణ

  • పలువురు ఉద్యోగుల తీరుపై

  • సమాచార సేకరణ

  • 200 ఎంబీ బుక్స్‌ విషయంలో

  • కూపీ లాగుతున్న అధికారులు

రంగల్‌ కార్పొరేషన్‌, మే 25: గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పేషీలో ఓ ఉద్యోగి పాత ఫైళ్ల (ఎంబీ బుక్కు)పై బదిలీపై వెళ్లిన కమిషనర్‌ సంతకాలతో డబ్బులు డ్రా చేసిన వైనంపై ఇంటెలిజెన్స్‌ పోలీసులు దృష్టి సారించారు. ఈ తతంగంపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ‘పాత ఫైళ్లపై బిల్లులు’ అనే కథనం ప్రచురించింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్‌ అధికారులు నాలుగురోజులుగా కూపీ లాగుతున్నారు. నిఘా వర్గాలు బుధవారం నుంచి రంగంలోకి దిగి శనివారం రాత్రి వరకు బల్దియాలోని పలు విభాగాల్లో రహస్య సేకరణ చేశారు. ముందుగా ఇంటెలిజెన్స్‌ జిల్లా ఉన్నతాధికారి నుంచి ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌, ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఒక లెటర్‌ తెచ్చి బల్దియా అధికారులకు ఇచ్చి వివరాలు కావాల్సిందిగా కోరారు. అయినా బల్దియా అధికారులు కాలయాపన చేస్తున్నట్టు సమాచారం. అయినా నిఘా వర్గాలు రహస్యంగా వివరాలు సేకరించినట్టు విశ్వసనీయ సమాచారం. తప్పుడు మార్గంలో డబ్బులు దండుకుని పాత కమిషనర్‌ సంతకాలు చేయించిన 200 ఎంబీ (మెజర్‌మెంట్‌ పుస్తకం) ఎవరి వద్ద ఉన్నాయి? అవి సంతకాలు చేయించి తీసుకుని వచ్చి ఇంజనీరింగ్‌, డీబీ(డ్రాయింగ్‌ బ్రాంచి) నుంచి గ్రీన్‌ సిగ్నం ఇప్పించింది ఎవరు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇంకా ఇంటెలిజెన్స్‌ అధికారులు ఒక ఆడుగు ముందుకు వేసి నక్కలగుట్ట, కాశిబుగ్గ, కాజీపేటలో పనిచేస్తున్న ఇద్దరు ఏఈలను, ఒక డీఈతో పాటు 6గురు డీబీ అధికారులను విచారించి వివరాలు సేకరించినట్టు తెలిసింది. వారు నలుగురు బడా కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చేశామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పని చేసినట్టు వెల్లడించినట్టు విశ్వసనీయ సమాచారం. 200 ఎంబీ బుక్కులు దొరికేంత వరకు సమస్య ఝఠింలంగానే ఉంటుందని, సేకరించిన వివరాలను రాష్ట్ర అధికారులకు పంపించినట్టు అధికారులు తెలిపారు.


ప్రధాన పాత్రధారి కోసం వేట

బల్దియాలో కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్‌ అధికారులకు, డీబీ సిబ్బందికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరించిన వ్యక్తి పూర్తి వివరాలపై ఇంటెలిజెన్స్‌ అధికారులు కూపీ లాగుతున్నారు. కాంట్రాక్టర్ల నుంచి ఒక్కో ఎంబీకి రూ.10 నుంచి 20వేలు తీసుకుని అడ్డదారిలో ఎంబీ పుస్తకాలపై సంతకాలు చేయించినట్టు తెలుసుకున్నారు. అలాగే తన సామాజికవర్గానికి చెందిన ఉన్నతాధికారుల అండదండలతోనే తన సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్లకు, డబ్బులు ఇచ్చిన వారికి ఎంబీలపై సంతకాలు చేయించినట్టు తెలిసింది. అయితే సదరు వ్యక్తి గతంలో ఎక్కడ పని చేశాడు? ఇతడికి బల్దియాలో ఎవరు సహకరిస్తున్నారు? 200 ఎంబీ బుక్కులు ఎవరి వద్ద ఉన్నాయి? అనే కోణంలో ఆరాతీస్తున్నారు.

Updated Date - May 26 , 2024 | 09:08 AM