Share News

Hyderabad: ఉద్యోగుల విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:41 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఇంకా కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగులు వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరాయి.

Hyderabad: ఉద్యోగుల విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

  • ప్రచారాన్ని నమ్మొద్దు: రాష్ట్ర ప్రభుత్వ వర్గాల వివరణ

  • తెలంగాణ నుంచి ఏపీకి 1,369 మంది ఆప్షన్లు

  • ఏపీ నుంచి తెలంగాణకు 1,808 మంది

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఇంకా కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగులు వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరాయి. రాష్ట్రం ఏర్పడిన ఏడాది రెండేళ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చిందని వివరించాయి. ఉద్యోగుల విభజన సమయంలో ఆప్షన్లు, పోస్టుల లభ్యత ఆధారంగా తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు ఏపీకి, ఏపీ స్థానికత ఉన్నవారిలో కొందరిని తెలంగాణకు పంపిణీ చేశారని పేర్కొన్నాయి. వైద్య అవసరాలు, భార్యాభర్తలు ఉద్యోగాల్లో ఉండడం, పిల్లల చదువులు, సొంత ఇళ్లు ఉన్నాయనే కారణాలతో కొందరు ఉద్యోగులు ఈ పంపిణీతో ఇబ్బంది పడ్డారని తెలిపాయి.


మానవీయ కోణంలో తమ బాధను అర్థం చేసుకోవాలంటూ పలుమార్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించారని వివరించాయి. ఏపీకి వెళ్లేందుకు తమకు అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణకు కేటాయించిన 1,369 మంది ఉద్యోగులు కోరారని పేర్కొన్నాయి. 2021 సెప్టెంబరులోవారందరినీ ఏపీకి పంపించేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ సర్క్యులర్‌ జారీ చేశామని స్పష్టం చేశాయి. ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు వచ్చేందుకు సిద్ధపడిన ఉద్యోగుల వివరాలను సేకరించిందని, అక్కడి నుంచి 1,808 మంది ఉద్యోగులు తెలంగాణకు రావడానికి ఆప్షన్లు ఇచ్చారని.. 2022 సెప్టెంబరు 23న అప్పటి ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ.. అప్పటి తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు లేఖ రాశారని పేర్కొన్నాయి. రెండు రాష్ట్రాల్లో ఆప్షన్లు ఇచ్చిన ఉద్యోగుల పరస్పర బదిలీకి రెండు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలంటూ ఉద్యోగులు కోరారని గుర్తుచేశాయి. ఈ అంశం ఎనిమిదేళ్లుగా నానుతున్న వ్యవహారమని.. విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య సమావేశాలు జరిగినప్పుడల్లా చర్చకు వచ్చిందని వివరించాయి.


తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తి కావటంతో విభజన చట్టంలోని అంశాలు.. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలన్నిటినీ ఆరా తీశామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ఈ నెల 2 నుంచి తెలంగాణకు ప్రత్యేక రాజధానిగా మారిందని, ఇదే సందర్భంగా ఏపీకి కేటాయించిన ఆఫీసులు, భవనాలతో పాటు విభాగాల వారీగా విభజన చట్టంలోని అన్ని అంశాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆర్థికశాఖకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించాయి. పెండింగ్‌లో ఉన్న అంశాలపై తదుపరి చర్చలు, సమావేశాలేవీ జరగలేదని స్పష్టం చేశాయి.

Updated Date - Jun 18 , 2024 | 05:41 AM